Begin typing your search above and press return to search.

మెస్సీ నెట్‌వర్త్ చూస్తే షాకవ్వాల్సిందే.. $1.1 బిలియన్‌ సంపద ఎలా కూడబెట్టాడంటే?

భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ.10,500 కోట్లకు పైమాటే. కేవలం ఆట ద్వారా వచ్చిన పారితోషికంతోనే కాకుండా చతురతతో కూడిన పెట్టుబడులు

By:  A.N.Kumar   |   1 Sept 2026 1:23 PM IST
మెస్సీ నెట్‌వర్త్ చూస్తే షాకవ్వాల్సిందే.. $1.1 బిలియన్‌ సంపద ఎలా కూడబెట్టాడంటే?
X

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లియోనెల్ మెస్సీ మైదానంలో గోల్స్‌తో రికార్డులు సృష్టించడమే కాదు.. ఆర్థికంగానూ ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఆయన సాధించిన విజయావకాశాలు.. మైదానంలో చూపిన అసాధారణ నైపుణ్యం ఆయనను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రీడాకారుడిగా నిలబెట్టాయి. ఫోర్బ్స్‌ అంచనాల ప్రకారం.. మెస్సీ నెట్‌వర్త్‌ సుమారు $1.1 బిలియన్‌. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ.10,500 కోట్లకు పైమాటే. కేవలం ఆట ద్వారా వచ్చిన పారితోషికంతోనే కాకుండా చతురతతో కూడిన పెట్టుబడులు, అంతర్జాతీయ బ్రాండ్ డీల్స్ ద్వారా మెస్సీ ఈ స్థాయిలో సంపదను కూడబెట్టాడు.

మెస్సీ ఆర్థిక ప్రస్థానానికి ప్రధాన పునాది బార్సిలోనా క్లబ్‌లోనే పడింది. చిన్న వయసులోనే ఆ క్లబ్‌లో చేరిన మెస్సీ.. అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగే కొద్దీ రికార్డు స్థాయి వేతనాలు, భారీ బోనస్‌లు అందుకనే స్థాయికి చేరుకున్నాడు. బార్సిలోనా తరఫున అనేక ట్రోఫీలు గెలవడంతో పాటు వ్యక్తిగత అవార్డులు సాధించడం ఆయన మార్కెట్ విలువను ఆకాశానికి ఎత్తింది. ఆ తర్వాత ఫ్రెంచ్‌ క్లబ్‌ పారిస్‌ సెయింట్‌-జెర్మైన్‌ (పీఎస్.జీ) తరఫున ఆడుతూ భారీ పారితోషికాన్ని, అదనపు కమర్షియల్ అవకాశాలను స్వీకరించాడు. ఇక అమెరికాలోని 'ఇంటర్‌ మియామీ' క్లబ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మెస్సీ కెరీర్‌లోనే అత్యంత లాభదాయకంగా మారింది. అమెరికన్ మార్కెట్‌లో ఫుట్‌బాల్‌కు క్రేజ్ పెంచడంతో పాటు ఆపిల్ టీవీ ప్లస్ ప్రాసారాల వాటా.. అడిడాస్ షేర్లతో కూడిన ఒప్పందాలు ఆయన ఆదాయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి.

మెస్సీ సంపదలో కేవలం ఆట ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అడిడాస్‌తో జీవితకాల ఒప్పందంతో పాటు పెప్సికో, మాస్టర్‌కార్డ్, సైటో వంటి అంతర్జాతీయ కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ఏడాదికి వందల కోట్లు ఆర్జిస్తున్నాడు. దీనికి తోడు వ్యాపార రంగంలోనూ మెస్సీ తన మార్కు చూపిస్తున్నాడు. విలాసవంతమైన హోటళ్ల శ్రేణి , సొంత దుస్తుల బ్రాండ్ 'ది మెస్సీ స్టోర్', రియల్ ఎస్టేట్ రంగాలు ఆయన ఆస్తుల విలువను నిరంతరం పెంచుతున్నాయి. మైదానంలో అసాధారణ ప్రతిభతో జగజ్జేతగా నిలిచిన మెస్సీ, పక్కా ఆర్థిక ప్రణాళికతో బిలియనీర్‌గా మారి ఒక గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్‌గా అవతరించిన తీరు నిజంగా అద్భుతమైనది.