Begin typing your search above and press return to search.

లైఫ్ అంటే లైట్ కాదు బ్రో !

జీవితం అన్నది మూడు అక్షరాల పదం అనుకుంటారు కానీ అనుభవించే సరికి ముప్పయి మూడు సముద్రాలు దాటినంత ఫీల్ కలుగుతుంది.

By:  Satya P   |   19 April 2026 1:45 PM IST
లైఫ్ అంటే లైట్ కాదు బ్రో !
X

జీవితం అన్నది మూడు అక్షరాల పదం అనుకుంటారు కానీ అనుభవించే సరికి ముప్పయి మూడు సముద్రాలు దాటినంత ఫీల్ కలుగుతుంది. జీవితాన్ని ఎవరు ఎలా చూస్తారు అన్నది వారి వ్యక్తిగతమైనా అందరికీ జీవితం ఒక్కేలా ఉండదు అన్నది నిజమైనా కూడా కామన్ గా లైఫ్ విషయంలో కొన్ని ఉంటాయి. ఎంతటివారికైనా కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి. అదే పనిగా సుఖమే లభిస్తే అది కూడా కష్టమే. అయినా కష్టం సుఖం కూడా మనసుకు సంబంధించిన భావన అది ఎవరు ఎంత మేరకు తీసుకుంటారు అన్న దానిని బట్టే అవి వారిని ప్రభావితం చేసే తీరు ఆధారపడి ఉంటుంది.

జవాబు చెప్పాల్సిందే :

జీవితంలో ప్రతీ ప్రశ్నకు కచ్చితంగా జవాబు చెప్పాల్సిందే. తప్పించుకోవడానికి ఎక్కడా అవకాశం ఉండదు, మామూలు పరీక్షలో ఏదైనా ప్రశ్నకు జవాబు తెలియకపోతే దానిని దాటుకుని ముందుకు పోవచ్చు. కానీ జీవితంలో అలా కాదు సమాధానం వెతకాల్సిందే. లేకపోతే అక్కడ నుంచి కదిలేది ఉండదు, అందుకే జీవితంలో ప్రశ్నలకు జవాబు చెప్పే శక్తిని సాధించాలి, అలా కాకపోయినా జవాబు కోసం వెతికే ఓపిక ఓరిమి అయినా ఉండాలి. అన్ని ప్రశ్నలకు వేగంగా జవాబులు దొరకవు, కొన్నింటికి అసలు జవాబులు ఉంటాయో లేదో కూడా తెలియదు. అయినా సహనంతో వెతకాల్సిందే వేచి చూడాల్సిందే. ఎందుకంటే తప్పించుకునేందుకు దారి లేదు కాబట్టి.

టఫ్ కూడా కాదు :

జీవితం అంటే లైట్ కాదు అంటున్నారు కదా టఫ్ గా ఉంటుందా అంటే టఫ్ కూడా కాదు. అయితే ఒక్కోసారి అది అలా అనిపిస్తుంది. లైఫ్ ని డీల్ చేసే విధానం బట్టే ఇదంతా ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఎవరు ఎలా జీవితాన్ని నడిపిస్తారో తమ మానసిక స్తోమతను ఏ మేరకు ఖర్చు చేస్తారో దానిని బట్టే జీవితం లోతు ఏమిటి అన్నది బోధపడుతుంది. ఎవరెంత సాధించినా శోధించినా కూడా జీవితం అందరికీ ఆటాడిస్తుంది, అందరికీ వెంటపెట్టి వేధిస్తుంది, అంత మాత్రం చేత జీవితానికి భయపడడం అన్నది ఏ మాత్రం మంచిది కాదు, అసలు అది కుదిరేది కూడా కాదు.

పులి మీద స్వారీ :

అవును ఈ విధంగా కూడా జీవితాన్ని పోల్చవచ్చు. అచ్చం పులి మీద స్వారి చేయడం లాంటిదే జీవితం. పులి మీద కూర్చున్న వాడు భయంతో అయినా స్వారీ చేయాల్సిందే. ఎక్కడా ఆగిపోకూడదు, దిగిపోయేందుకు దారి లేదు, ఒకవేళ తెగించి దిగాలనుకున్నా అదే పులి చంపేస్తుంది. అందువల్ల జీవితం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానిని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని పిచ్చి ఆలోచనలు మానేసి దానిని ఏ విధంగా డీల్ చేస్తే బాగా ఉంటామో ఆ గుట్టు ఎరిగి మరీ ముందుకు సాగాల్సి ఉంటుంది. లేకపోతే అదే జీవితం తినేస్తుంది కూడా.

ఓర్పుతోనే మార్పు :

ఎంత ఓర్చితే అంత మేలు అన్నది ఒక ముతక సామెత ఉంది. అది జీవితానికి అన్వయించుకోవాలి. సహనంగా ఉండాలి. సవాళ్ళు వచ్చినపుడు బెదిరి బావురుమనకూడదు, అదిరిపడిపోయి అవతలకు పారిపోయే ప్రయత్నం అంతకంటే చేయకూడదు. వాస్తవంలో ఉండాలి. జీవితం అంటేనే ఇలాగే ఉంటుంది అనుకోవాలి. సమస్యలను స్వాగతించాలి. వాటిని ఓరిమితో కూరిమితో చేరదీసి పరిష్కారం కోసం చూడాలి. అంతే కాదు మంచి కాలం కోసం వేచి చూడాలి. ఒక్కటి అయితే అంతా గుర్తు పెట్టుకోవాలి. జీవితం ముందు ఎవరూ తోపులు కాదు, ఎంతవారైనా ఎన్నో సార్లు వైకుంఠపాళిలో పాము మింగేసి పాతాళానికి వెళ్ళి మరీ నిచ్చెన మెట్లు వెతుక్కుని ఎక్కిన వారే అని గ్రహించాలి.

జీవితం తెల్ల కాగితం :

అంతా ఒక్కటే అందరూ జీవితంతో పోరాడుతున్నారని ఆలోచించినపుడు స్పోర్టివ్ గా లైఫ్ ని తీసుకోవడం అలవాటు అవుతుంది. అపుడు జీవితం అనే ఆటలో పాములు ఉన్నా నిచ్చెనలు ఉన్నా రెండింటినీ సమానంగా చూసి తీసుకునే విచక్షణ వస్తుంది. జీవితం అన్నది ఒక తెల్ల కాగితం అయితే దాని మీద అన్నీ ఆణి ముత్యాల లాంటి రాతలే ఉంటాయని ఉండాలనుకోవడం కూడా తప్పుడు ఆలోచన. కొక్కిరి రాతలు కూడా ఉంటాయి. అలాగని కాగితాన్ని చింపేసినంత సులువుగా జీవితాన్ని నలిపేయలేమని గుర్తుంచుకుంటే జీవితం విలువ తెలుస్తుంది, దానిని ఆస్వాదించే తీరులోనూ మార్పు కనిపిస్తుంది.