కడప జైల్లో జీవిత ఖైదీకి బంగారు పతకం... కారణం 'టాప్'!
అవును... చదువుకునే వయసులో హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ.. జైల్లో దూర విద్య ద్వారా చదవడం ప్రారంభించాడు.
By: Raja Ch | 26 Sept 2025 3:00 PM ISTకృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని అంటారు. మనిషికి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని చెబుతారు. అది ప్రాక్టికల్ గా చేసి చూపించాడు ఓ జీవిత ఖైదీ. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అతడు.. చదువులో టాప్ గా నిలిచాడు. డిగ్రీలు, పీజీలు చేస్తూ.. నేడు బంగారు పతకం అందుకోబోతున్నాడు.
అవును... చదువుకునే వయసులో హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ.. జైల్లో దూర విద్య ద్వారా చదవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో జైల్లో ఉంటూనే నాలుగు డిగ్రీలు, మూడు పీజీలు పూర్తి చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా మార్కులు సాధించిన అతడు బంగారు పతకం, బుక్ ప్రైజ్ అవార్డు అందుకోబోతున్నాడు.
వివరాళ్లోకి వెళ్తే... తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చెంగాలపల్లికి చెందిన జి యుగంధర్ (43) ఇంటర్మీడియట్ చదువుకునే సమయంలో ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి, హత్య చేశాడు. ఈ కేసులో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. దీంతో 2010 నుంచి అతడు కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
ఈ క్రమంలో జైలు నుంచే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంటర్మిడియట్ పూర్తి చేశాడు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డిస్టెన్ ఎడ్యుకేషన్ లో పాత సిలబస్ ప్రకారం రెండు బీఏలు, కొత్త సిలబస్ ప్రకారం మరో రెండు బీఏలు పూర్తి చేశాడు. అనంతరం మూడు ఎంఏలు సైతం చదివాడు. జైల్లోనే కంప్యూటర్ శిక్షణ తీసుకున్నాడు. సర్టిఫికెట్ కూడా పొందాడు.
ఈ క్రమంలో బీఏ పరీక్షలో యుగంధర్ అత్యధికంగా 8.02 పాయింట్లు సాధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం దక్కించుకున్నాడు. దీంతో ఈ నెల 30న హైదరాబాద్ లో జరిగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్శిటీ 26వ స్నాతకోత్సవంలో అతడికి బంగారు పతకం, బుక్ ప్రైజ్ అవార్డు అందించనున్నారు.
