Begin typing your search above and press return to search.

సాదాసీదాగా కుటుంబ సభ్యులతో గుడికి వెళ్లిన పవన్ సతీమణి

సామాన్యులకు అసమాన్యులకు తేడా ఏంటి? అత్యున్నత స్థాయిలో ఉండి కూడా సామాన్యంగా ఉంటారు.

By:  Garuda Media   |   4 Feb 2026 10:15 AM IST
సాదాసీదాగా కుటుంబ సభ్యులతో గుడికి వెళ్లిన పవన్ సతీమణి
X

సామాన్యులకు అసమాన్యులకు తేడా ఏంటి? అత్యున్నత స్థాయిలో ఉండి కూడా సామాన్యంగా ఉంటారు. కాస్తంత పవర్ చేతిలో ఉంటేనే తమకు మించినోళ్లు లేరన్నట్లుగా వ్యవహరించే తీరుకు భిననంగా.. సింఫుల్ గా.. సాదాసీదాగా వెళ్లటం కొందరికే చెల్లుతుంది. ఆ కోవలోకే వస్తారు ఏపీ డిప్యూటీ సీఎం కం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా. నిజానికి ఆమె కోరుకుంటే అంగరంగ వైభవంగా.. అత్యుత్తమ ప్రోటోకాల్ తో గుడికి వెళ్లే వీలుంది. మరి..కాస్త హడావుడి చేయాలంటే భారీ ఎత్తున అభిమానుల్ని రంగంలోకి దించొచ్చు.

ఇవన్నీ ఏమీ లేకుండా ఒక సామాన్య భక్తురాలిగా గుడికి వెళ్లిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. ఆమె మీద గౌరవం మరింత పెరిగేలా చేసింది. వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. సాధారణ భక్తురాలిగా ప్రత్యేక దర్శనం టికెట్ కొనుగోలు చేసిన ఆమె.. రష్యా నుంచి వచ్చిన తన కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్ లో వెళ్లి పూజలు చేశారు.

అయితే.. ఆమెతో ఉన్న భద్రతా సిబ్బందిని ఆలయంలోని వారు అడగటంతో ఆమె పవన్ కల్యాణ్ సతీమణిగా పేర్కొనటంతో.. వెంటనే దేవస్థానం అర్చకులు.. ధర్మకర్తలు.. ఉద్యోగులు మహా మండపంలో వేదాశీర్వచనం అందించారు అమ్మవారి శేషవస్త్రాలు.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. రష్యా నుంచి తన కుటుంబ సభ్యులు వెంట ఉన్నప్పటికి.. తన పరపతి చూపేందుకు ఏ మాత్రం ఇష్టపడకుండా.. సామాన్యురాలిగా వ్యవహరించిన తీరును అభినందించాల్సిందే. ఇలాంటి ఉదంతాల గురించి తెలిసినప్పుడు.. అత్యుత్తమ స్థానాల్లో ఉంటూ సామాన్యుల మాదిరి వ్యవహరించే తీరును అభినందించకుండా ఉండలేం.