ట్రంప్ అనుకున్నదొక్కటి.. అయ్యింది ఇంకొక్కటి !
అమెరికా వ్యూహం బెడిసికొట్టింది. అనుకున్నదొక్కటి అయిందొక్కటి. అమెరికా దుందుడుకు చర్యలే దీనికి కారణం.
By: A.N.Kumar | 5 March 2026 12:12 PM ISTఅమెరికా వ్యూహం బెడిసికొట్టింది. అనుకున్నదొక్కటి అయిందొక్కటి. అమెరికా దుందుడుకు చర్యలే దీనికి కారణం. ఇరాన్ పై యుద్ధం నేపథ్యంలో అమెరికా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరమూ ఉంది. లేదంటే అమెరికా, ఇరాన్ యుద్ధ మేఘాలు ప్రపంచాన్ని మొత్తం కమ్మేస్తాయి.
అలా వదిలేయాల్సింది :
ఇరాన్ ను అమెరికా ఇంకొంత కాలం అలానే వదిలేయాల్సిందన్న వాదన ఉంది. ఇందుకు కారణం ఇరాన్ లో ఇప్పటికే అంతర్గత సంక్షోభం ఉంది. ఇరాన్ మత ప్రభుత్వ కఠిన నియమాలను ఆ దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఆయతుల్లా ఖమేని పాలనను వ్యతిరేకిస్తున్నారు. ఖమేనీ తీవ్రంగా ప్రజలను అణచివేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అమెరికా రంగ ప్రవేశం చేసి ఖమేనిని హతమార్చింది. ఫలితంగా ఖమేనీ వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారారు. దేశసార్వభౌమాధికారంపై దాడిగా భావిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న ప్రజలు వ్యతిరేకంగా మారడం చూసి ట్రంప్ ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణం ట్రంప్ వ్యూహాత్మక తప్పిదమే. ఇరాన్ లో అంతర్గత సంక్షోభం పతాకస్థాయికి చేరింది. ఆ సయమంలో ట్రంప్ ఇరాన్ ప్రజలకు బయటి నుంచి సహాయ సహకారాలు అందించి ఉంటే.. ఇరాన్ ప్రజలే ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేవారు. కానీ అంత వరకు ట్రంప్ ఆత్రం పట్టుకోలేకపోయారు. ఖమేనిని హతమార్చడంతో సీన్ రివర్స్ అయింది.
ఆర్థిక ఆంక్షలతో పకడ్బందీ వ్యూహం
ట్రంప్ ఇరాన్ పై వాణిజ్య, ఆర్థిక ఆంక్షలు విధించి.. తద్వారా ద్రవ్యోల్బణానికి కారణమయ్యారు. ఫలితంగా పెరిగిన ధరలతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. దీనికి తోడు ఇరాన్ కఠిన నియమాలు తోడయ్యాయి. మొదట వ్యూహాత్మక అడుగు వేసి ఖమేని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన ట్రంప్.. రెండో వ్యూహాత్మక అడుగు మాత్రం తప్పుగా పడింది. దీని ఫలితమే ట్రంప్ కు ఇరాన్ వ్యతిరేకంగా మారింది. ఇరాన్ కూడా వ్యూహాత్మకంగా అమెరికాతో యుద్ధం చేస్తోంది. ఖమేని హత్యతో అందరూ సరెండర్ అవుతారని అనుకున్న ట్రంప్ కు.. ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. డాలర్ ఆధిపత్యానికి కారణమైన గల్ఫ్ దేశాలపై దాడులు జరుపుతు, ప్రపంచ ఆయిల్ సరఫరా వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. హార్మూజ్ జలసంధిలో ఆంక్షలు ప్రపంచంలోని 20 శాతం ఆయిల్ దిగుమతులకు దిక్కులేకుండా చేసింది. రిఫైనరీలపై దాడి చేసి ప్రపంచ వాణిజ్యాన్ని ప్రమాదంలోకి తోస్తోంది. దీంతో ట్రంప్ ఏం చేయలేని స్థితి. మరోవైపు ప్రపంచ దేశాలు మెల్లగా రెండు శిబిరాలుగా మారుతున్నాయి. ఇరాన్ మద్దతుదారులు ఒకవైపు, అమెరికా మద్దతుదారులు మరోవైపు చేరిపోతున్నారు. ఇది మరింత ప్రమాదకర పరిణామం. ఇది కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే దీనికి అమెరికా-ఇరాన్ యుద్ధంగానే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న యుద్ధంగా చూడాల్సి ఉంటుంది. ప్రతి దేశమూ స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది.
తదుపరి అడుగే కీలకం
ట్రంప్ తదుపరి అడుగు కీలకం కానుంది. ఎందుకంటే ఇరాన్ గల్ఫ్ దేశాలపై, చమురు సరఫరా వ్యవస్థపై దాడి చేస్తూ ప్రపంచ దేశాలను ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తోంది. తద్వారా ప్రపంచ దేశాలు అమెరికాపై రాజకీయ ఒత్తిడి పెంచాల్సి వస్తుంది. అప్పుడు ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకం. ఇరాన్ హార్మూజ్ జలసంధి పక్కన ఉండటం ఒక బలం. మరో బలహీనత. బలహీన సమయంలో ఇరాన్ తన బలాన్ని ఉపయోగించి ప్రత్యర్థిపై ఓత్తిడి చేస్తోంది. చర్చల ద్వారా ట్రంప్ యుద్ధం ముగిస్తే.. అందరికీ శ్రేయస్కరం. లేదంటే ప్రమాదం తప్పదు.
