Begin typing your search above and press return to search.

స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌.. ఇదొక్క‌టేనా మార్గం?!

అసెంబ్లీలో అయినా.. శాస‌న మండ‌లిలో అయినా.. దేశంలో అత్యున్నత పార్ల‌మెంటులో అయినా.. స‌భ్యు ల‌ను స‌స్పెండ్ చేయ‌డం.. ఇటీవ‌ల కాలంలో స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది.

By:  Garuda Media   |   9 Sept 2026 8:00 PM IST
స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌.. ఇదొక్క‌టేనా మార్గం?!
X

అసెంబ్లీలో అయినా.. శాస‌న మండ‌లిలో అయినా.. దేశంలో అత్యున్నత పార్ల‌మెంటులో అయినా.. స‌భ్యు ల‌ను స‌స్పెండ్ చేయ‌డం.. ఇటీవ‌ల కాలంలో స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. ఈ స‌స్సెన్ష‌న్ అనేది.. స్పీక‌ర్ లేదా మండ‌లి చైర్మ‌న్‌, పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల పెద్ద‌ల‌కు రాజ్యాంగం క‌ల్పించిన విచ‌క్ష‌ణాధి కారం. ఇది రూలేం కాదు. రూల్స్‌లో ఉన్న‌ప్ప‌టికీ.. స్పీక‌ర్ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేయాలా.. వ‌ద్దా.. స‌భ‌ను న‌డిపించేందుకు ప్ర‌య‌త్నాలు చేయాలా? అనేది ఆయ‌న/ ఆమె విచ‌క్ష‌ణ‌పైనే ఉంటుంది.

కానీ.. నేడు ప్ర‌భుత్వ ప‌క్షం సూచించడ‌మే త‌రువాయి అన్న‌ట్టుగా స్పీక‌ర్లు .. స‌భ్యుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు ఇది త‌ప్ప మ‌రోమార్గం లేదా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. గ‌తంలో మూడు మాసాల‌కు ఒక్క‌సారి స‌భ‌లు కొలువుదీరినా.. క‌నీసం 15 రోజుల‌కు త‌గ్గ‌కుండా.. స‌భ‌లు న‌డిచేవి. కానీ, నేడు ఇది వారం నుంచి ఐదారు రోజుల‌కు ప‌డిపోయిన ద‌రిమిలా.. ఆ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో కూడా .. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకుని.. చ‌ర్చించేందుకు స‌భ‌ల‌ను వినియోగించుకోక‌పోతే.. ఎలా అనేది ప్ర‌శ్న‌.

ఈ విష‌యంలోనూ స్పీక‌ర్ల‌కు రాజ్యాంగం స‌ముచిత‌మైన ఆలోచ‌న చేసేందుకు అవ‌కాశం క‌ల్పించింది. స‌భ‌లో అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య వివాదం రేగిన‌ప్పుడు.. వారిని చ‌ల్ల‌బ‌రిచేందుకు స‌భ‌ను కొద్ది సేపు వాయిదా వేయొచ్చు.. ఇది ప్రాధ‌మిక నియమం. ఇక‌.. అప్ప‌టికీ.. స‌భ్యులు స‌ర్దుబాటు చేసుకోక‌పోతే.. ఉభ‌య ప‌క్షాల ఫ్లోర్ లీడ‌ర్ల‌ను(స‌భా ప‌క్ష నేత‌లు) స్పీక‌ర్ త‌న చాంబ‌ర్‌కు పిలిచి.. చ‌ర్చించి.. స‌భ‌లు స‌మంజ‌సంగా జ‌రిగేలా వారిని ప్రోత్స‌హించ‌వ‌చ్చు.. ఇది త‌దుప‌రి నిర్ణ‌యం.

అయిన‌ప్ప‌టికీ.. స‌భ‌లో ఇంకా ర‌గ‌డ కొన‌సాగితే.. స‌ద‌రు స‌భ్యుల‌ను ఒక గంట‌కు.. లేదా ఒక రోజుకు ప‌రిమి తం అయ్యేలా స‌స్పెండ్ చేయొచ్చు. కానీ, ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ప‌రిస్థితి మారిపోయింది. స‌స్పెండ్ అనే కొర‌డాను వెంట‌నే వినియోగించేస్తున్నారు. ఇక‌, ఒక‌రోజు ఒక గంట అనే మాట ఎప్పుడో పోయింది. ఏకంగా స‌భ జ‌రిగిన‌న్ని రోజులు స‌స్పెండ్ చేస్తున్నారు. త‌ద్వారా.. ప్ర‌జ‌ల స‌మస్యలే కాదు.. కీల‌క‌మైన బిల్లుల‌పై చ‌ర్చ‌లే లేకుండా.. ప్ర‌భుత్వ ప‌క్షాలు ఆమోదం చేసుకుంటున్నాయి. ఇది స‌రైన విధానం కాద‌ని.. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 168 నుండి 212 వరకు చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. స‌భ‌ల్లో నియ‌మాలు.. నిబంధ‌న‌లు పాటించేందుకు ఎక్క‌డో తేడా కొడుతుండ‌డం గ‌మ‌నార్హం.