ఖరీదైన కొనుగోలుతో రికార్డ్... ఎవరు ఈ లీనా గాంధీ?
తాజాగా ముంబైలో అత్యంత ఖరీదైన కొనుగోలు జరిగింది. వ్యాపార సముదాయాలకు సంబంధించిన కొనుగోలు వందలు, వేల కోట్లలో జరగడం చూస్తూ ఉంటాం.
By: Ramesh Palla | 4 Aug 2026 12:48 PM ISTభారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఏ స్థాయిలో అభివృద్ది చెందుతూ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభివృద్దిలో దూసుకు పోతున్న పాశ్చాత్య దేశాలతో పోల్చినా ఇండియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ గత పదేళ్లలో పదుల రెట్లు పెరిగింది అనడంలో సందేహం లేదు. తీవ్రమైన ఆర్థిక ఒడిదొడుకులు ఉన్న సమయంలోనూ ఇండియాలోని మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఏమాత్రం తగ్గలేదు అనేది వాస్తవం. వందల కోట్ల కొనుగోలు, అమ్మకాలు ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ పేరుతో పెద్ద మొత్తంలో ఆధాయం సమకూరుతూనే ఉంది. తాజాగా ముంబైలో అత్యంత ఖరీదైన కొనుగోలు జరిగింది. వ్యాపార సముదాయాలకు సంబంధించిన కొనుగోలు వందలు, వేల కోట్లలో జరగడం చూస్తూ ఉంటాం. అయితే నివాస గృహానికి సంబంధించిన కొనుగోలు ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా ఏకంగా రూ.703 కోట్ల రియల్ ఎస్టేట్ కొనుగోలు నమోదు అయింది.
రూ.703 కోట్లతో నివాస గృహం డీల్...
ముంబైలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వర్లి సీ ఫేస్ ఏరియాలో ఉన్న నమన్ క్సానా టవర్స్ లో యూఎస్‌వి ఫార్మాసూటికల్స్ చైర్‌మన్ లీనా గాంధీ తివారీ లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు విలువ రూ.639 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ చార్జీలు ఇతర ఖర్చులు మొత్తం కలిపి రూ.703 కోట్లు అయినట్లుగా ముంబై వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ నివాస గృహ కొనుగోలు డీల్ ఈ స్థాయిలో జరగలేదు అనేది ముంబై వర్గాల టాక్. అంతకు మించిన ఖరీదైన ఇల్లు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్స్, వ్యాపారవేత్తల ఇల్లు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాయి. కానీ వాటిని వారే నిర్మించుకున్న కారణంగా రిజిస్ట్రేషన్ చేయించలేదు. కానీ ఇప్పుడు కొనుగోలు చేయడం వల్ల ఈ నివాస గృహం రికార్డ్ నెలకొల్పడం జరిగిందని ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇండియాలోనే ఖరీదైన రియల్ వ్యాపారం...
ఇంత భారీ డీల్ ను చేసిన ఆ యూఎస్‌వి ఫార్మాసూటికల్స్ చైర్మన్ ఎవరా అని అంతా కూడా ఆసక్తిగా సోషల్ మీడియాలో, ఇంటర్నెల్‌లో వెతికేస్తున్నారు. లీనా గాంధీ భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు. ఇండియాలో అత్యధికంగా అమ్ముడు పోయే డయాబెటిస్ మందు అయిన గ్లైకోమెట్ ను ఈమె చైర్మన్‌గా ఉన్న యూఎస్‌వి ఫార్మాసూటికల్స్ తయారు చేస్తోంది. అందుకే దేశంలోనే అత్యంత లాభాలు ఆర్జిస్తున్న ఫార్మా కంపెనీగా యూఎస్‌వి నిలిచింది. ఆ మధ్య ఫోర్బ్స్ అందించిన డేటా ప్రకారం ఈమె నికర ఆస్తి విలువ దాదాపుగా నాలుగు బిలియన్ డాలర్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడాది ఈమె ఆస్తి దాదాపుగా 25 శాతం పెరుగుతున్నట్లుగా మార్కెట్ వర్గాల వారు, మీడియా వారు చెబుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ముంబైలో రియల్ ఎస్టేట్ తగ్గిందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ డీల్ మళ్లీ ఊపును తెచ్చిందని మార్కెట్ వర్గాల వారు అంటున్నారు.
యూఎస్‌వి ఫార్మాసూటికల్స్ కంపెనీ అధినేత లీనా గాంధీ..
ముంబై మీడియా కథనాల అనుసారం ఈ అపార్ట్‌మెంట్‌లో చదరపు అడుగుకు దాదాపు రూ.3.17 లక్షలు పడినట్లు తెలుస్తోంది. కార్పెట్ ఏరియా పరంగా చూస్తే రూ.2.83 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పలికిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ మెట్రో నగరంలోనూ ఈ స్థాయిలో రేటు పలకలేదని మార్కెట్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సముద్రానికి ఎదురుగా ఉండి, సీ వ్యూ తో ఈ అపార్ట్‌మెంట్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ ఏరియాలో అపార్ట్‌మెంట్స్ కి మంచి డిమాండ్ ఉంది. పైగా అత్యంత లగ్జరీ నమన్ క్సానా టవర్ లో కావడంతో ఈ రేటు పలికింది. 32 నుంచి 35 వ అంతస్తు వరకు ఈ డూప్లెక్స్ విస్తరించి ఉందని తెలుస్తోంది. ముందు ముందు వెయ్యి కోట్ల డీల్ ను కూడా చూస్తామని ముంబై రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుకుంటున్నారు. ఆ నెంబర్ ను చేరడానికి మరెంత కాలం పట్టక పోవచ్చని, ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాదిలో వెయ్యి కోట్ల మార్క్ చేరుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
