Begin typing your search above and press return to search.

లేఆఫ్స్‌ని 'ఎఫిషియెన్సీ'గా చూపించడం.. కరెక్టేనా? అసలు నిజం ఏంటంటే?

ఉద్యోగులను రోడ్డున పడేస్తూ 'ఎఫిషియెన్సీ' అని కలరింగ్ ఇవ్వడం వెనుకున్న అసలు నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

By:  Madhu Reddy   |   3 Sept 2026 10:17 AM IST
లేఆఫ్స్‌ని ఎఫిషియెన్సీగా చూపించడం.. కరెక్టేనా? అసలు నిజం ఏంటంటే?
X

మేము మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసివేయడం లేదు.. సంస్థను మరింత వేగవంతం చేయడానికి పునర్వ్యవస్థీకరిస్తున్నాం!" – ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ చెప్పిన మాట ఇది. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగాల కోత అనే తీవ్రమైన నిర్ణయాన్ని కప్పిపుచ్చేందుకు పిఆర్ (PR) టీమ్‌లు ఎలాంటి తీపి మాటలను వాడుతున్నాయో చెప్పడానికి ఇదొక స్పష్టమైన ఉదాహరణ. ఉద్యోగులను రోడ్డున పడేస్తూ 'ఎఫిషియెన్సీ' అని కలరింగ్ ఇవ్వడం వెనుకున్న అసలు నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

లేఆఫ్స్ కాదు.. 'రైట్ సైజింగ్' అంట:

గతంలో ఒక కంపెనీ ఉద్యోగులను తీసివేస్తే ఖర్చులు తగ్గించుకోవడానికనో లేదా నష్టాల వల్లనో అని నేరుగా చెప్పేసేవారు. కానీ నేటి టెక్ ప్రపంచంలో ఏ కంపెనీ కూడా తమ ఆర్థిక లోపాలను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక అందుకే 'లేఆఫ్స్' అనే పదానికి బదులుగా రైట్ సైజింగ్, ఆర్గనైజేషనల్ ఎఫిషియెన్సీ, రీ-స్ట్రక్చరింగ్ వంటి అందమైన పేర్లను పిఆర్ టీమ్‌లు సృష్టిస్తున్నాయి. మీ ఉద్యోగం పోయిందనే నిష్ఠుర సత్యాన్ని దాచిపెట్టి, సంస్థ వేగం పెంచుతున్నామని చెప్పడం ఒక కొత్త రకం భాషా విన్యాసం.

మేనేజ్‌మెంట్ వైఫల్యం.. మూల్యం చెల్లించేది ఉద్యోగులే:

"చిన్న టీమ్ ఉంటే నిర్ణయాలు త్వరగా జరుగుతాయి, అనవసర సమన్వయానికి సమయం వృధా కాదు" అని కంపెనీలు సాకులు చెబుతుంటాయి. కానీ ఇక్కడ ఉత్పన్నమయ్యే అసలు ప్రశ్న ఏంటంటే.. అసలు అంత పెద్ద బ్యూరోక్రసీని, అవసరం లేని సిబ్బందిని చేర్చుకుంది ఎవరు? విస్తరణ పేరుతో వేల మందిని నియమించుకుని, ఆ తర్వాత నిర్వహించలేక యాజమాన్యాలు విఫలమైతే, ఆ తప్పుకు మూల్యం మాత్రం సాధారణ దిగువ స్థాయి ఉద్యోగులే చెల్లించాల్సి వస్తోంది.

ఇన్వెస్టర్లను మెప్పించే 'కార్పొరేట్ డిక్షనరీ':

ఈ తరహా తీపి మాటల వెనుక ఉన్న ముఖ్య లక్ష్యం ఉద్యోగుల క్షేమం కాదు, కేవలం షేర్ మార్కెట్ మరియు ఇన్వెస్టర్లు మాత్రమే! 'మా వద్ద డబ్బులు లేవు, నష్టాల్లో ఉన్నాం' అని చెబితే స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు పడిపోతాయి. అదే 'మేము ఫాస్టర్ డెసిషన్ మేకింగ్ కోసం టీమ్ సైజ్ తగ్గిస్తున్నాం' అని చెప్పగానే ఇన్వెస్టర్లకు అది ఒక గ్రేట్ మూవ్‌లా కనిపిస్తుంది. ఇక ఒక ఉద్యోగి తన జీవనోపాధిని కోల్పోతున్న క్షణంలో కూడా కంపెనీలు తమ స్టాక్ వ్యాల్యూను ఎలా పెంచుకోవాలో ఆలోచిస్తున్నాయి.

కార్పొరేట్ సంస్థలు ఎంత మెత్తటి పదాలతో ప్యాక్ చేసినా, ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి జరిగే తీవ్ర నష్టం మాత్రం మారదు. ఇకనైనా కంపెనీలు 'ఆర్గనైజేషనల్ చేంజ్' అనే ముసుగుల వెనుక దాక్కోకుండా తమ ప్లానింగ్ లోపాలను, మార్కెట్ అంచనాలు తప్పిన విధానాన్ని నిష్కపటంగా ఒప్పుకోవాలి. ఇక ముసుగులు లేని నిజాయితీ గల కమ్యూనికేషన్ దిశగా అడుగులు వేయడమే నేటి కార్పొరేట్ ప్రపంచానికి అత్యంత అవసరం.