కేజ్రీవాల్ కే గురిపెట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. రూ.7 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం..
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు హత్య బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. రూ.7 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌కు ఫోన్, వాట్సాప్ ద్వారా హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ఆప్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By: A.N.Kumar | 12 Nov 2026 7:20 PM ISTలారెన్స్ బిష్ణోయ్.. ఈ గ్యాంగ్ స్టర్ జైల్లో ఉన్నా ఆయన అనుచరులు మాత్రం దేశంలో అరాచకాలను సృష్టిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రముఖ హీరో టైగర్ ష్రాఫ్ పై ముంబైలో కాల్పులు జరపడం కలకలం రేపింది. మొత్తం బాలీవుడ్ హీరోలను టార్గెట్ చేసి హింసిస్తున్న ఈ గ్యాంగ్ టార్గెట్ చేస్తే తప్పించుకోలేరని.. హీరోలు సెక్యూరిటీని టైట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లు ముంబైలోనే ఎక్కువగా కనిపించిన ఈ గ్యాంగ్ ఆగడాలు ఇప్పుడు ముంబైని దాటి దేశ రాజధానికి చేరాయి.
ఢిల్లీలో ఇప్పుడు మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఈ గ్యాంగ్ గురిపెట్టింది. కేజ్రీవాల్ ను టార్గెట్ చేసిన ఈ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. దీంతో కలకలం చెలరేగింది. రూ.7 కోట్లు ఇవ్వకపోతే కేజ్రీవాల్ ను హత్య చేస్తామంటూ దుండగులు హెచ్చరించినట్లు సమాచారం. ఈ పరిణామం ఢిల్లీ రాజకీయవర్గాల్లో సంచలనమైంది.
అయితే ఈ బెదిరింపులు నేరుగా కేజ్రీవాల్ కు కాకుండా ఆయన పార్టీకి చెందిన తిలక్ నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ కు వచ్చినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ తోపాు వాట్సాప్ సందేశాలు కూడా అందినట్లు సమాచారం. అందులో రూ.7 కోట్లు చెల్లించాలని.. లేదంటే కేజ్రీవాల్ ను చంపేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ సందేశాల వెనుక బిష్నోయ్ గ్యాంగ్ హస్తం ఉందని చెబుతున్నారు.
ఈ బెదిరింపులను సీరియస్ గా తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ యాజమాన్యం వెంటనే జర్నైల్ సింగ్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ తోపాటు ఆయన కుటుంబ సభ్యుల భద్రతను మరింత పెంచాలని పోలీసులను కోరారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు, కాల్పులు భయాందోళనలు సృష్టిస్తున్నాయి.. ఇప్పుడు ఢిల్లీ మాజీ సీఎంనే ఈ గ్యాంగ్ బెదిరించడం సంచలనమైంది.. ఈ బెదిరింపుల వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉందా? లేక ఆ గ్యాంగ్ పేరును ఉపయోగించుకుని ఎవరైనా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది.
