భారత్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమన్న రష్యా
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు హాజరైన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
By: A.N.Kumar | 29 Sept 2025 1:19 AM ISTఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు హాజరైన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వస్తారని వెల్లడించారు.
లవ్రోవ్ ప్రకారం, డిసెంబరులో పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య విస్తృత ద్వైపాక్షిక అజెండాపై చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, కృత్రిమ మేధ (AI) వంటి రంగాల్లో భారత్–రష్యా దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. సాధారణ దౌత్య సంప్రదాయాల భాగంగా ఈ ఏడాదిలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కో పర్యటన చేసే అవకాశం ఉందని, తానే స్వయంగా భారత్‌ను సందర్శిస్తానని లవ్రోవ్ తెలిపారు.
భారత్ స్వతంత్రతను గౌరవిస్తున్న రష్యా
భారత్ వాణిజ్యం, ఇంధన సంబంధిత అంశాల్లో తీసుకునే నిర్ణయాల్లో రష్యా జోక్యం చేసుకోదని లవ్రోవ్ స్పష్టం చేశారు. ఈ రంగాల్లో భారత్‌కు స్వయంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా చమురు వాణిజ్యంపై భారత్ వైఖరిని లవ్రోవ్ అభినందించారు.
జైశంకర్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ లవ్రోవ్ మాట్లాడుతూ “అమెరికా తన చమురును అమ్మాలనుకుంటే, సంబంధిత నిబంధనలపై చర్చించేందుకు భారత్ సిద్ధంగా ఉంటుంది. కానీ, వాణిజ్యం ఎవరితో చేయాలనేది భారత్ స్వతంత్రంగా తీసుకునే నిర్ణయం” అని తెలిపారు. దీనిని ప్రస్తావిస్తూ భారత్‌కు ఆత్మగౌరవం ఉన్న దేశంగా లవ్రోవ్ అభివర్ణించారు.
రష్యా చేసిన తాజా వ్యాఖ్యలు భారత్–రష్యా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. పుతిన్ రాబోయే పర్యటనతో ఇరుదేశాల సంబంధాలు కొత్త దిశలో ముందుకు సాగే అవకాశముంది.
