గుడ్ నైట్.. హ్యాపీ న్యూఇయర్.. మదురో అరెస్టు తర్వాత తొలి వీడియో సంచలనం
కొరకరాని కొయ్యగా మారి.. వెనుజుల దేశాన్ని గుప్పిట పట్టి.. డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మార్చి.. దేశ ద్రవ్యోల్బణాన్ని దిగజార్చిన వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా గద్దెదించి అమెరికా తరలించి తగినశాస్తి చేసింది.
By: A.N.Kumar | 4 Jan 2026 10:32 AM ISTకొరకరాని కొయ్యగా మారి.. వెనుజుల దేశాన్ని గుప్పిట పట్టి.. డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మార్చి.. దేశ ద్రవ్యోల్బణాన్ని దిగజార్చిన వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా గద్దెదించి అమెరికా తరలించి తగినశాస్తి చేసింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దక్షిణ అమెరికా దేశం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం వ్యూహాత్మక ఆపరేషన్ ద్వారా బంధించి.. అమెరికాకు తరలించింది. డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను న్యూయార్క్‌లోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) కేంద్రానికి తరలించారు.
వైరల్‌గా మారిన వీడియో.. సంకెళ్లతో మదురో
మదురో అరెస్టుకు సంబంధించిన తొలి దృశ్యాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ వీడియోలో మదురో చేతులకు సంకెళ్లతో కనిపించడం గమనార్హం. ముగ్గురు డీఈఏ అధికారులు ఆయనను ఎస్కార్ట్ చేస్తూ తీసుకెళ్తుండగా మదురో చాలా ప్రశాంతంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.బందీగా ఉన్నప్పటికీ మదురో ఎక్కడా ఆందోళన చెందినట్లు కనిపించలేదు. తనను తీసుకెళ్తున్న అధికారులను ఉద్దేశించి ఆయన "గుడ్ నైట్.. హ్యాపీ న్యూ ఇయర్" అని చెప్పడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. శత్రు దేశం తనను బంధించినా ఏమాత్రం బెరుకు లేకుండా ఆయన స్పందించిన తీరుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆపరేషన్ వెనుక కారణాలు
వెనిజులాపై శనివారం జరిగిన భారీ సైనిక దాడి అనంతరం మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మదురో ప్రభుత్వంపై అమెరికా చాలా కాలంగా ఆగ్రహంతో ఉంది. మదురో నేతృత్వంలోని ప్రభుత్వం అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తోందని డీఈఏ గతంలోనే అభియోగాలు మోపింది. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని అమెరికా మదురోను గుర్తించడం లేదు. మదురో ఆచూకీ తెలిపిన వారికి లేదా పట్టించిన వారికి గతంలోనే అమెరికా 15 మిలియన్ డాలర్ల భారీ రివార్డును ప్రకటించింది.
లాటిన్ అమెరికాలో మారనున్న సమీకరణాలు
మదురో అరెస్టుతో వెనిజులా రాజకీయాల్లో భారీ శూన్యం ఏర్పడింది. ఆయన మద్దతుదారులు ఈ చర్యను 'కిడ్నాప్'గా అభివర్ణిస్తుండగా అమెరికా మాత్రం చట్టపరమైన ప్రక్రియగానే పేర్కొంటోంది. ఈ పరిణామం రష్యా, చైనా వంటి దేశాలతో అమెరికా సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ దేశాలు మదురోకు మిత్రపక్షాలుగా ఉన్నాయి.
ప్రస్తుతానికి మదురో న్యూయార్క్‌లోని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నారు. ఆయనపై ఉన్న అభియోగాల రీత్యా అమెరికా కోర్టులో విచారణ జరగనుంది. ఒక దేశాధ్యక్షుడిని మరో దేశం ఇలా బంధించి తీసుకురావడం ఆధునిక చరిత్రలో అరుదైన ఘట్టం.
