Begin typing your search above and press return to search.

ఫేక్ జీవోలతో రూ.1500 కోట్ల భూమికి ఎసరు? వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిపై కేసు

హైదరాబాద్ లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై నమోదైన కేసు సంచలనం సృష్టిస్తోంది.

By:  Tupaki Political Desk   |   30 May 2026 3:11 PM IST
ఫేక్ జీవోలతో రూ.1500 కోట్ల భూమికి ఎసరు? వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిపై కేసు
X

హైదరాబాద్ లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై నమోదైన కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతోపాటు నలుగురు పరారీలో ఉన్నారని, మరో ముగ్గురిని అరెస్టు చేశామని శేరిలింగంపల్లి డీఎస్పీ చింతమనేని శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గండిపేటలో సుమారు రూ.1500 కోట్ల విలువైన కబ్జాపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఇందులో ప్రమేయం ఉందంటూ మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో ఆయన పరార్ అయ్యారని, ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారంగా మారుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

శేరిలింగంపల్లి డీఎస్పీ చింతమనేని శ్రీనివాస్ కథనం ప్రకారం హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో సుమారు రూ.1500 కోట్ల విలువైన భూములను కాజేందుకు కొందరు స్కెచ్ వేశారని స్థానిక ఎమ్మార్వో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో మొత్తం ఏడుగురి పాత్ర ఉందని గుర్తించగా, వారిలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరు చేర్చడంతో రాజకీయ సంచలనంగా మారిందని అంటున్నారు. గండిపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 18లో మొత్తం 104.25 ఎకరాలు ఉండగా, అందులో 9.28 ఎకరాలను గండిపేటకు చెందిన ఐదుగురు వ్యక్తులు తప్పుడు పత్రాలతో క్రమబద్దీకరించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు.

ఈ విషయం స్థానిక తహశీల్దార్ దృష్టికి వెళ్లిందని, ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని తహశీల్దార్ ఫిర్యాదు చేశారని డీఎస్పీ వెల్లడించారు. దీంతో నార్సింగి పోలీసులతోపాటు సైబర్ క్రైం, ఆర్థిక నేరాల విభాగం పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు నిర్వహించి కబ్జా కుట్రను భగ్నం చేసినట్లు డీఎస్పీ మీడియాకు వివరించారు. కాగా, వివాదంలో ఉన్న భూమిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడంతో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును నిందితుడిగా చేర్చినట్లు చెబుతున్నారు. గండిపేటకు చెందిన నిమ్మల దశరథ కుటుంబ సభ్యులు ఈ భూమి తమదంటూ కొన్నాళ్లుగా చెబుతున్నారని అంటున్నారు. దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. హైకోర్టులో రిట్ పెండింగులో ఉండగా, నకిలీ జీవోలతో అమ్మేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు.

నిమ్మల కుటుంబ సభ్యుల నుంచి భూమిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడంతోనే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు కేసులో ఇరుక్కున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివాదాస్పద భూమిని కొనుగోలు చేసేందుకు రూ.4 కోట్లు అడ్వాన్స్ చెల్లించడంతో పోలీసులు ఆయనను నిందితుడిగా చేర్చారని అంటున్నారు. దీంతోనే బొల్లా అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది.