నితీష్ లేని బీహార్ లో ....నిప్పులు చెరిగిన లాలూ !
ఇక ఆర్జేడీ 30వ వ్యవస్థాపక దినోత్సవం వేళ పాట్నాలో జరిగిన పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో లాలూ మరోసారి తన ఫైర్ బ్రాండ్ రూపమే చూపించారు.
By: Satya P | 6 July 2026 9:11 AM ISTబీహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ పాత్ర ప్రత్యేకం. దాని మీద ఒక మాట కూడా ఉంది. సమోసాలో ఆలూ బీహార్ లో లాలూ అని. అంటే లాలూ లేకుండా బీహార్ పాలిటిక్స్ లేదని. అంతలా బీహార్ రాజకీయాలను శాసించి మలుపు తిప్పిన నాయకుడిగా లాలూ ఆ రాష్ట్ర చరిత్రలో నిలిచారు. ఆయన 1990లలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత జనతాదళ్ నుంచి వేరు కుంపటి పెట్టి సొంత పార్టీగా ఆర్జేడీని స్థాపించారు. 1997 జూలై 5న ప్రారంభం అయిన ఆర్జేడీ సరిగ్గా ముప్పై వసంతాలు పూర్తి చేసుకుంది. ఒక ప్రాంతీయ పార్టీ ఇన్నేళ్ళ పాటు కొనసాగడం విశేషం అని చెప్పాలి. అందులోనూ ఆధికారంలో కూడా ఎక్కువ కాలమే ఉంది.
కాషాయం పార్టీ మీద ఫైర్ :
ఇక ఆర్జేడీ 30వ వ్యవస్థాపక దినోత్సవం వేళ పాట్నాలో జరిగిన పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో లాలూ మరోసారి తన ఫైర్ బ్రాండ్ రూపమే చూపించారు. గతంలో లాలూ ఎలా ఉండేవారో మరోసారి అదే రూపాన్ని ప్రదర్శించి క్యాడర్ కి ఉత్సాహం తీసుకుని వచ్చారు. ఎనభయ్యేళ్ళ లాలూ ఇపుడు విశ్రాంతి తీసుకుంటూ తన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ కి పార్టీ పగ్గాలు అప్పగించారు. తాను కేవలం అధ్యక్ష పీఠం మీద ఉంటూ కుమారుడికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇక ఈ సమావేశానికి ఆర్జేడీ సుప్రీం లీడర్ స్థాయిలో హాజరైన లాలూ కాషాయం పార్టీ మీద నిప్పులు చెరిగారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట పట్టిందని లాలూ ఫైర్ అయ్యారు. కేవలం అంతా తానే అన్నట్లుగా ఏకపక్షంగా అధికారాన్ని చలాయిస్తోంది అని అన్నారు. దేశాన్ని పూర్తిగా వెనక్కి నెట్టేలా బీజేపీ పాలన సాగుతోంది అని లాలూ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.
బీజేపీ గెలుపు మీద :
దేశంలో ఇటీవల జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుని లాలూ హాట్ కామెంట్స్ ద్వారా ఎద్దేవా చేశారు. బీజేపీ రాజ్యాంగ సంస్థలను గుప్పిట పట్టి అధికారం చలాయిస్తోంది అని చెప్పడం ద్వారా అసలైన గెలుపు కాదని లాలూ ఘాటు విమర్శలు చేశారు. గతంలో ఇదే తరహా ఆరోపణలు మమతా బెనర్జీ ఇతర పార్టీ నేతలు చేస్తూ వచ్చారు. ఇపుడు లాలూ కూడా బీజేపీ విజయం వెనక జనాల అనుకూలత కంటే ఇతర మార్గాలు వ్యూహాలు ఉన్నాయని చెప్పదలచారు అని అంటున్నారు.
ఎన్నికలు ముఖ్యం కాదంటూనే :
ఎన్నికలు మాత్రమే ఆర్జేడీకి ముఖ్యం కాదని లాలూ స్పష్టం చేశారు. వెనకబడిన వర్గాలు మైనారిటీలు బహు జనుల కోసం ఆర్జేడీ ఏర్పాటు అయింది అని వారు కోసం పోరాడుతుందని చెప్పారు. తమ పార్టీ పేదలు బడుగుల పక్షాన ఉందని లాలూ గట్టిగా చెప్పుకొచ్చారు. ఇక మీదట తమ పోరాటం అంతా పార్లమెంట్ నుంచి మొదలు పెట్టి గల్లీ దాకా సాగుతుందని ఆయన సింహ గర్జన చేశారు. ఆర్జేడీ ఏంటో చూపిస్తామని కూడా గట్టి హెచ్చరిక కూడా చేశారు. అదే సమయంలో పార్టీలో నాయకులు అంతా విభేదాలు విడనాడి కలసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపు ఇచ్చారు.
బీజేపీకి భారీ సవాల్ :
ఇక ఆర్జేడీ వ్యూహం వేరే విధంగా ఉంది అని అంటున్నారు. జనంలో మంచి పట్టు ఉన్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నెలలు గడుస్తోంది. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ప్రచారం సాగింది కానీ ఇంకా దక్కలేదు, ఆయన కుమారుడికి పదవి ఇచ్చారు. అయితే నితీష్ లేని బీహార్ లో బీజేపీ ప్రభుత్వాన్ని మరింత గట్టిగా ఎదుర్కోవాలని జాతీయ ప్రాంతీయ స్థాయిలలో కాషాయం పార్టీని గట్టిగా నిలువరించడం ద్వారా 2029 ఎన్నికల నాటికి విజయాల బాటలు వేసుకోవాలని లాలూ చూస్తున్నారు. తాను ఎనభై ఏళ్ళ వయో వృద్ధుడిని అయినా కూడా ఇంకా గర్జించే సింహాన్నే ఆని ముప్పయ్యేళ్ళ పార్టీ ఉత్సవాలలో లాలూ బీజేపీకి చెబుతూనే భారీ సవాల్ చేశారు. మరి ఆర్జేడీ కొత్త వ్యూహం బీహార్ లో ఏ విధంగా ఉండబోతోందో చూడాల్సి ఉంది.
