త్యాగ పురుషుడు అద్వానీ
లాల్ క్రిష్ణ అద్వానీని అంతా లోహ పురుషుడు అంటారు. అంటే ఉక్కు మనిషి అని. అయితే ఆయనలో పట్టుదల ఉక్కు లాంటిదే.
By: Tupaki | 8 Nov 2025 7:26 PM ISTలాల్ క్రిష్ణ అద్వానీని అంతా లోహ పురుషుడు అంటారు. అంటే ఉక్కు మనిషి అని. అయితే ఆయనలో పట్టుదల ఉక్కు లాంటిదే. అందుకే ఆయన రామజన్మ భూమిని విషయం మీద అతి పెద్ద రధాయాత్రను చేపట్టారు. దేశంలో హిందువుల ఓట్లను కన్సాలిడేట్ చేశారు. అదే సమయంలో ఆయన బీజేపీకి కొత్త ఊపు తీసుకుని వచ్చారు. దేశంలో బీజేపీ రోజున ఈ స్థితిలో ఉంది అంటే దానికి ఎల్ కే అద్వానీ తీసుకున్న నిర్ణయాలు అంతే కాదు ఆయన ఆలోచనలు పార్టీ పట్ల దేశం పట్ల ఆయన చిత్తశుద్ధి ఇలా అనేక కారణాలు కనిపిస్తాయి.
వాజ్ పేయి కోసం :
బీజేపీలో అద్వానీ శకం మొదలయ్యాకనే కాషాయం పార్టీ దేశంలో వికసించింది అన్నది తెలిసిందే. 1984లో వాజ్ పేయి జాతీయ అధ్యక్షుడిగా ఉండగా కేవలం రెండు ఎంపీ సీట్లకే పరిమితం అయిన బీజేపీని అయిదేళ్ళ కాలంలోనే 89 సీట్లకు పెంచిన ఘనత ఎల్ కే అద్వానీదే. ఆయన బీజేపీకి 1986లో జాతీయ అధ్యక్షుడు అయ్యారు. ఆ తరువాత బీజేపీ పరుగులు పెట్టింది. 1991 నాటికి తన సీట్ల సంఖ్యను మరింత పెంచుకున్న బీజేపీ 1996 నాటికి 160కి పైగా ఎంపీ సీట్లు సాధించడమే కాదు దేశంలో తొలిసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆనాడు అలా వచ్చిన అవకాశాన్ని ఎల్ కే అద్వానీ తాను తీసుకోలేదు తన ప్రియ స్నేహితుడు అటల్ బిహారీ వాజ్ పేయికి ఇచ్చారు. ఆ తరువాత 1998, 1999 లలో వాజ్ పేయ్ ఈ దేశానికి ప్రధానిగా ఉన్నారు. మొత్తం ఆరున్నరేళ్ల పాటు వాజ్ పేయి ప్రధానిగా ఉంటే ఆయన వద్ద ఉప ప్రధానిగా అద్వానీ పనిచేశారు. తనకు తరువాత కాలంలో అవకాశం వస్తుందా రాదా అన్నది కూడా ఆలోచించకుండా వాజ్ పేయి మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ అనురాగం. గురు భావం, ప్రియ స్నేహితం ఇవన్నీ అద్వానీ కీలక సమయంలో చూపించారు.
ఎవరూ చేయనిదే :
వర్తమాన రాజకీయాలను చూస్తే ఎవరికైనా అద్వానీ చేసిన త్యాగం ఎంత నిరుపమానమో అర్ధం అవుతుంది. ఎందుకంటే ఈ రోజున పదవే పరమావధిగా పాలిటిక్స్ సాగుతోంది. తామే నిరంతరం అధికారంలో ఉండాలనుకుని ఏమైనా చేసే కల్చర్ సాగుతోంది. అయితే ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం అద్వానీ మాత్రం అలా చేయలేదు, పార్టీలో తన కన్నా సీనియర్ అయిన వాజ్ పేయి కే ప్రధాని పీఠం అప్పగించి తాను రెండవ స్థానంలో కుదురుకున్నారు. అయితే అద్వానీకి ఏనాడు అయినా ప్రధాని అవకాశం వస్తుందని ఆశించిన ఆయన అభిమానులకు మాత్రం అది ఎప్పటికీ చేదు నిజంగానే మారింది.
పార్టీని నిలబెట్టి :
ఒక విధంగా చెప్పాలంటే అద్వానీ పార్టీని నిలబెట్టి తాను మాత్రం తెర వెనక్కి వెళ్ళిపోయారు. ఆయన శిష్యుడు నరేంద్ర మోడీ దేశానికి 2014లో ప్రధాని అయ్యారు. అయితే 2014లో బీజేపీ విజయం సాధించిన వెంటనే ప్రధాని పదవిని అద్వానీ పేరుని పరిశీలిస్తారు అన్న ప్రచారం అయితే సాగింది. కానీ అలా జరగలేదు. అయితే దేశంలో మరో ఉన్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠం అయినా ఆయనకు అందుతుందని అనుకున్నారు. 2017లో రాష్ట్రపతి ఎన్నికల వేళ పెద్ద ఎత్తున అద్వానీ పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ జరిగింది వేరు. ఇక 2019 నాటికి మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేది లేదని అద్వానీ చెప్పేసి రాజకీయంగా శాశ్వతంగా తప్పుకున్నారు. ఒక విధంగా ఆయన పార్టీ కోసం ఎంతో చేసి కీలక స్థానాలను అయితే అందుకోలేకపోయారు అన్న వెలితి అయితే అభిమానులలో ఈ రోజుకీ ఉంది.
పుట్టిన రోజు వేళ :
ఇదిలా ఉంటే నవంబర్ 8 అంటే అందరికీ గుర్తుకు వచ్చేది అద్వానీ పుట్టిన రోజు. అలా శనివారం ఆయన పుట్టిన రోజున దేశమంతా ఆయనను తలచుకుంటోంది. ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తోంది. ఎల్‌కె అద్వానీ 98వ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్షుతో ఉండాలని మోడీ ఆకాక్షించారు. అద్వానీని అత్యున్నత దృష్టి మేధస్సు కలిగిన రాజనీతిజ్ఞుడిగా మోడీ అభివర్ణించారు. భారతదేశం పురోగతిని బలోపేతం చేయడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. అద్వానీ చేసిన కృషి భారతదేశం ప్రజాస్వామ్య రంగం మీద చెరగని ముద్ర వేసిందని ప్రధానమంత్రి అన్నారు. అద్వానీని ఒక విశిష్ట రాజనీతిజ్ఞుడిగా భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో మార్గదర్శక శక్తిగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. అద్వానీ తన జీవితాన్ని దేశ పురోగతి, ఐక్యత సాంస్కృతిక సామరస్యం కోసం అంకితం చేశారని ఆయన అన్నారు. అద్వానీ దార్శనిక నాయకత్వం ప్రజా సేవ పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శించారని అన్నారు. ఆయన సహకారం భారతదేశ రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక దృశ్యాన్ని రూపొందించిందని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అద్వానీకి పుట్టినరోజు వేళ శుభాకాంక్షలు తెలిపారు.
