Begin typing your search above and press return to search.

సొంతిల్లు కూడా లేని ప్రధాని గురించి తెలుసా ?

ఇద్దరూ ప్రముఖులే. ఇద్దరికీ ఒకే రోజు పుట్టిన రోజు. ఒకరు మహాత్మాగాంధీ అయితే రెండవ వారు లాల్ బహదూర్ శాస్త్రి. గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మిస్తే శాస్త్రి యూపీ రాష్ట్రం వారణాసిలో 1904 అక్టోబర్ 2న జన్మించారు.

By:  Satya P   |   2 Oct 2025 11:00 PM IST
సొంతిల్లు కూడా లేని ప్రధాని గురించి తెలుసా ?
X

ఇద్దరూ ప్రముఖులే. ఇద్దరికీ ఒకే రోజు పుట్టిన రోజు. ఒకరు మహాత్మాగాంధీ అయితే రెండవ వారు లాల్ బహదూర్ శాస్త్రి. గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మిస్తే శాస్త్రి యూపీ రాష్ట్రం వారణాసిలో 1904 అక్టోబర్ 2న జన్మించారు. లాల్ బహుదూర్ శాస్త్రి గురించి ఈ తరం ఎంతైనా తెలుసుకోవాలి. ఆయన పుట్టిన రోజు గాంధీజీది ఒకే తేదీ కావడంతో శాస్త్రి గురించి ఒక విధంగా తక్కువగా తలచుకుంటున్నారు అన్న భావన ఉంది. అయితే ఈ దేశానికి రెండవ ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి సుగుణాల పుట్ట. ఆయనలో నిజాయతీ నిరాడంబరత ఎన్ని తరాలు అయినా భారతీయ సమాజానికి ఆదర్శమే అని చెప్పాల్సి ఉంటుంది.

జీవన పోరాటంలో :

అతి పేద కుటుంబంలో జన్మించిన శాస్త్రి రెండేళ్ళకే తండ్రిని కోల్పోయారు. తాత మేనమామల వద్ద పెరిగిన శాస్త్రికి చిన్నతనంలో పాఠశాలకు వెళ్లాలి అంటే గంగానదిని దాటాల్సి వచ్చేది. పడవ వాడికి ఎంతో కొంత పైకం చెల్లిస్తే కానీ ఆ ఒడ్డుకు చేర్చేవాడు కాదు. అయితే ఆ డబ్బులు కూడా లేక తన బట్టలను విప్పి పుస్తకాలు కలిపి మూటగట్టి భుజాన వేసుకుని ప్రాణాలకు తెగించి గంగానదిని ఈది స్కూల్ కి వెళ్ళేవారు. పడవ వాడిని బతిమాలితే ఎక్కించేవాడే. కానీ చిన్నతనం నుంచి ఆత్మ గౌరవం ఆయనకు మెండు. అందుకే అలా చేసేవారు.

జైలు జీవితం తరువాత :

ఇక దేశ స్వాతంత్ర్యం కోసం అనేక సార్లు జైలుకు వెళ్ళిన శాస్త్రి మొత్తం తొమ్మిదేళ్ళ పాటు కారాగార శిక్షను అనుభవించారు. ఇక ఆయన ప్రజా జీవితంలో ఒక్క పైసా అయినా ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. సేవగానే దానిని భావించేవారు. ఆయన మొదట మొదట అలహాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెల్లిచినపుడు సొంత ఇల్లు లేదు. దాంతో ఆయన స్నేహితులు అంతా చందాలు వేసుకుని డబ్బులు ఇద్దామనుకున్నా వద్దు అని తృణీకరించిన మహానుభావుడిగా చూడాలి.

రైల్వే మంత్రిగా రాజీనామా :

తాను రైలు మంత్రిగా ఉండగా రైలు ప్రమాదం జరిగి ప్రయాణీకులు చనిపోయారని తెలిసి తన పదవికి రాజీనామా చేసిన శాస్త్రి గారి నిబద్ధతను ఎంత చెప్పినా తక్కువే. ఇక తాను కేంద్ర మంత్రిగా అనేక శాఖలు చూసినా తన పిల్లలను మాత్రం బస్సులోనే పాఠశాలకు పంపించారు. అయితే పిల్లలు పోరగా ఆయన ఒక సెకండ్ హ్యాండ్ ఫియట్ కారుని వాయిదాల పద్ధతిలో అప్పు చేసి కొన్నారు. కానీ ఆ బాకీ 4 వేల 600 రూపాయలు ఉండగానే ఆయన మరణించడంతో ఆయన సతీమణి లలితా శాస్త్రి ఆ బాకీ తమ సొమ్ముతోనే తీర్చి భర్తకు తగిన భార్య అనిపించుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉంటూ తన ఇంటికి కరెంట్ బిల్లు కట్టక చీకటిలో కొన్నాళ్ళు మగ్గిన రాజకీయ నాయకుడిగా శాస్త్రినే తలచుకోవాలి.

ఉద్యోగం మానిపించారు :

తాను ప్రధాని అయిన వెంటనే తన కుమారుడు హరికృష్ణ శాస్త్రికి ఒక ప్రముఖ సంస్థ ప్రమోషన్ లభించింది అయితే హఠాత్తుగా వచ్చిన ఆ ప్రమోషన్ దేని కోసమో ఊహించిన శాస్త్రి ఆ ఉద్యోగానికే కొడుకుని మానిపించి తాను ప్రజలకు సేవకుడిని మాత్రమే తప్ప పైరవీకారులకు కాదని స్పష్టమైన సందేశం ఇచ్చారు.

జై జవాన్ జై కిసాన్ :

అద్భుతమైన ఈ నినాదం ఇచ్చిన వారు శాస్త్రి. ఆయన 1964లో దేశానికి ప్రధాని అయ్యాక ఆహార సంక్షోభం వచ్చింది. అప్పట్లో ఆయన జై కిసాన్ అని గ్రీన్ రివల్యూషన్ కి శ్రెకారం చుట్టారు 1965 ఆగస్టులో పాకిస్తాన్ తో యుద్ధం వస్తే విజయవంతంగా ఎదుర్కొని లాహోర్ దాకా తరిమి కొట్టారు. అలా ఈ దేశానికి జై జవాన్ జై కిసాన్ అన్నది శాశ్వత నినాదంగా చేశారు. 1966 జనవరి 10న తాష్కెంట్ లో పాక్ తో ఒక ఒప్పందం కోసం వెళ్ళి సంతకం చేసిన మరునాడు అంటే 11న అకస్మాత్తుగా మరణించిన శాస్త్రిది ఒక విషాదమే.

మరణం వెనక ఉన్న మిస్టరీ :

ఆయన మరణం వెనక ఉన్న మిస్టరీ ఈ రోజుకీ వీడలేదు అంటే ఆలోచించాల్సిందే. ఏది ఏమైనా దేశానికి ప్రధానిగా ఉన్నా సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేని నిజాయతీపరుడుగా ఆయన చరిత్రలో గుర్తుండిపోతారు. ఈ రోజున ప్రభుత్వం సొమ్ముతో విలాసాలు జల్సాలు చేస్తున్న నాయకులు ఉన్న పరిస్థితిలో శాస్త్రి లాంటి వారిని అసలు ఊహించలేం. మళ్లీ ఇంతటి నిజాయితీపరుడైన ప్రధానిని ఈ దేశం చూస్తుందా అంటే అది సందేహమే అని చెప్పక తప్పదు