Begin typing your search above and press return to search.

నైతిక రాజీనామాలు...కాలం చెల్లిన నినాదాలు !

ఇక వివిధ రాష్ట్రాలలో అనేకమంది తమ పదవులకు నైతిక బాధ్యత పేరుతో రాజీనామా చేశారు. అయితే కాలగమనంలో పదవులకు రాజీనామా అన్నది కూడా రాజకీయ సవాళ్ళ ప్రతిసవాళ్ళ వ్యూహంగా మారుతోంది.

By:  Satya P   |   22 July 2026 8:29 AM IST
నైతిక రాజీనామాలు...కాలం చెల్లిన నినాదాలు !
X

నైతికతతో కూడిన రాజీనామాలు చేయాలి అంటే అది గత కాలంలో. అంటే అంతా బాగున్ననాడు. ఆ పక్షం ఈ పక్షం అంతా రాజకీయ పక్షం వహించకుండా దేశ హితం వైపు ఆలోచించినపుడు కొనసాగిన నైతిక నిష్ట అది. కానీ అన్ని విధాలుగా కాలం మారింది. ఏ మాట నుంచి అయినా రాజకీయ లాభం రాబట్టే కాలమిది. అంతే కాదు నీతిగా తప్పుకుంటే హర్షించి మంచిగా చప్పట్లు కొట్టే వెర్రిబాగుల కాలం కానేకాదిది. తప్పు ఒప్పుకున్నా లేదా బాధ్యత వహించినా మరింతగా ఇరికించి సర్వానందం పొందే నైజమిది. అందుకే నైతిక రాజీనామాలు లేవు, ఆ ఊసులు అంతకంటే లేవు.

మాట పట్టింపు కోసం :

ఈ దేశంలో 1952 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు అలా ఏర్పాటు అవుతూ వచ్చాయి. అయితే మాట పట్టింపు కోసం కూడా రాజీనామాలు చేసిన తరాలను కూడా ఈ దేశం చూసింది. పండిట్ నెహ్రూ కేబినెట్ ఓ తొలి మంత్రి వర్గంలో ఉన్న జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ అలాగే చేశారు. ఒక సిద్ధాంతం నమ్మిన వారిగా ఆయన నచ్చక తప్పుకున్నారు. అలాగే తరువాత రోజులలో అనేక మంది తమ శాఖలలో తప్పులు జరిగాయని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసిన ఉదంతాలు కళ్ళ ముందు కనిపిస్తాయి.

వారంతా ఆ దారిలోనే :

ఇక ఒక్కసారి కనుక వెనక్కి వెళ్ళి చూస్తే భారతదేశ చరిత్రలో నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన ప్రముఖులు అనేకమంది కనిపిస్తారు. వారులో ఈ దేశానికి ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి నెహ్రూ కేబినెట్ లో రైల్వే మంత్రిగా ఉన్నపుడు 1956లో తమిళనాడులో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. తొలి తరం కాంగ్రెస్ నాయకుడు టిటి కృష్ణమాచారి 1958లో నెహ్రూ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ముంద్రా స్కాండల్ పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఒక ఆర్థిక కుంభకోణం నేపథ్యంలో ఈ వ్యవహారంలో ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా ఆర్థిక మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

కొనసాగిన సంప్రదాయం :

అదే విధంగా అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ కూడా 1999లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన గైసాల్ రైలు ప్రమాదంలో దాదాపు 280 మందికి పైగా మరణించిన సంఘటనలో తన పదవికి రాజీనామా చేశారు. ఇక దాదాపుగా చివరిసారిగా అనుకోవచ్చు 2008 ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో అప్పటి మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్. పాటిల్, అలాగే అప్పటి ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ లు కూడా భద్రతా వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవుల నుండి తప్పుకున్నారు.

ఇక వివిధ రాష్ట్రాలలో అనేకమంది తమ పదవులకు నైతిక బాధ్యత పేరుతో రాజీనామా చేశారు. అయితే కాలగమనంలో పదవులకు రాజీనామా అన్నది కూడా రాజకీయ సవాళ్ళ ప్రతిసవాళ్ళ వ్యూహంగా మారుతోంది. దాంతో నైతిక రాజీనామాలు పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో డిమాండ్లు విపక్షాల నుంచి వస్తున్నాయి. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది అన్న దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరుతున్నారు. దాంతో నైతిక రాజీనామాల విషయం మరోసారి ప్రస్థావనకు వస్తోంది. అయితే ఇవి ఎపుడైతే రాజకీయ అస్త్రాలుగా మారుతున్నాయో నినాదాలకు కూడా కాలం చెల్లుతోంది అన్న భావన ఏర్పడింది.