బ్రిటన్‌కు లక్ష్మీ మిత్తల్ గుడ్‌బై… పన్ను విధానం మార్పులతో కీలక నిర్ణయం
ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్ బ్రిటన్‌ను వదిలి వెళ్లేందుకు సిద్ధమైనట్లు స్థానిక మీడియా సంస్థలు నివేదించాయి.
By: A.N.Kumar | 24 Nov 2025 8:00 PM ISTప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్ బ్రిటన్‌ను వదిలి వెళ్లేందుకు సిద్ధమైనట్లు స్థానిక మీడియా సంస్థలు నివేదించాయి. యూకేలో రాబోయే పన్ను విధానం మార్పులు, ముఖ్యంగా 226 ఏళ్ల నాటి 'నాన్-డోమ్ ట్యాక్స్' రద్దు నిర్ణయం.. మిత్తల్ కుటుంబాన్ని ఈ కీలక అడుగు వేయించేలా చేశాయని చెప్పబడుతోంది.
నాన్-డోమ్ పన్ను విధానం రద్దు: సంపన్నులలో ఆందోళన
బ్రిటన్ ప్రభుత్వం నాన్-డోమ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ చారిత్రక విధానం ప్రకారం.. యూకేలో నివసించే వారు (రెసిడెంట్స్) విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్‌లో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు.
ప్రస్తుతం కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పన్ను మార్పులను వేగంగా అమల్లోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ నిర్ణయం బ్రిటన్‌లో నివసిస్తున్న అనేకమంది కోటీశ్వరులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అధిక పన్నుల భారం తప్పించుకునేందుకు, వారు దుబాయ్, సింగపూర్ వంటి పన్ను మినహాయింపులు అందించే దేశాలపై దృష్టి సారిస్తున్నారు.
ఆర్సెలార్ మిత్తల్: ప్రపంచ స్టీల్ దిగ్గజం
లక్ష్మీ మిత్తల్ నేతృత్వంలోని ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. కంపెనీ మొత్తం విలువ: €26.12 బిలియన్ పౌండ్లుగా ఉంది. మిత్తల్ కుటుంబ వాటా 40% కావడం విశేషం.
2021లో లక్ష్మీ మిత్తల్ సీఈవో పదవి నుండి తప్పుకోవడంతో, ఆయన కుమారుడు ఆదిత్య మిత్తల్ ఆ బాధ్యతలను స్వీకరించారు. పన్ను మార్పుల నేపథ్యంలో మిత్తల్ కుటుంబం తమ పెట్టుబడులను.. నివాసాన్ని దుబాయ్ వైపు తరలించేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. భవిష్యత్ పెట్టుబడులు దుబాయ్‌లో పెరిగే అవకాశముందని సండే టైమ్స్ నివేదిక వెల్లడించింది.
*యూకే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
లక్ష్మీ మిత్తల్ సంపద, సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం , £15.4 బిలియన్ పౌండ్లు. యూకే అత్యంత ధనికుల జాబితాలో ఆయన ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నారు. ఇంత భారీ సంపద కలిగిన వ్యక్తి యూకే విడిచిపెట్టి వెళ్లడం దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా పన్ను రాబడిపై, ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*సునాక్-అక్షతా మూర్తి వివాదం మళ్లీ చర్చలోకి
ఇదే నాన్-డోమ్ పన్ను విధానం కారణంగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ - ఆయన భార్య అక్షతా మూర్తి కూడా గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అక్షతా మూర్తి యూకే వెలుపల సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించకపోవడంతో అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. తరువాత ఒత్తిడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా తాను సంపాదించే ఆదాయంపై కూడా యూకేలోనే పన్నులు చెల్లిస్తానని ఆమె ప్రకటించారు.
బ్రిటన్ ప్రభుత్వ పన్ను విధాన మార్పులు భారీ సంపన్నుల వలసలకు దారితీస్తాయనే ఆర్థిక నిపుణుల ఆందోళనకు లక్ష్మీ మిత్తల్ నిర్ణయం నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ధోరణి యూకే ఆర్థిక నిర్మాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
