Begin typing your search above and press return to search.

విదేశీ కార్మికుల కోసం కువైట్ ఇ-సర్వీస్ స్టార్ట్.. ఇకపై ఆ సమస్య ఉండదు!

అవును... విదేశీ కార్మికులకు వీసా, నివాస విధానాలను సరళీకృతం చేయడానికి కువైట్ కొత్త ఎలక్ట్రానిక్ సేవల (ఇ-సర్వీస్)ను ప్రారంభించింది.

By:  Raja Ch   |   29 Dec 2025 3:51 PM IST
విదేశీ కార్మికుల కోసం కువైట్ ఇ-సర్వీస్ స్టార్ట్.. ఇకపై ఆ సమస్య ఉండదు!
X

విదేశీ కార్మికులకు వీసా, నివాస విధానాలను సరళీకృతం చేయడానికి కొత్త ఎలక్ట్రానిక్ సేవలను కువైట్ ప్రారంభించింది. ఇది ప్రధానంగా.. విదేశీ నివాసితులు దేశంలో వారి చట్టపరమైన స్థితిని ఎలా నిర్వహిస్తారనే దానిలో కీలక మార్పును సూచిస్తుందని అంటున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేసిన ఈ మార్పులు.. పని సంబంధిత నివాస అనుమతులను ఆన్‌ లైన్‌ లో జారీ చేయడం, పునరుద్ధరణ చేయడం, బదిలీ చేయడానికి అనుమతిస్తాయి.

అవును... విదేశీ కార్మికులకు వీసా, నివాస విధానాలను సరళీకృతం చేయడానికి కువైట్ కొత్త ఎలక్ట్రానిక్ సేవల (ఇ-సర్వీస్)ను ప్రారంభించింది. ఈ సందర్భంగా స్పందించిన ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. విదేశీ ఉద్యోగులు ఇకపై వీసా పునరుద్ధరణ, రెసిడెన్సీ పర్మిట్ల బదిలీ వంటి సేవల కోసం విదేశీయులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా.. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌ సైట్ ద్వారా ఆన్‌ లైన్‌ లోనే పొందవచ్చని తెలియజేసింది.

ఈ సంస్కరణలు కువైట్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ విస్తృత సమగ్ర పరిశీలనలో భాగమని అంటున్నారు. దీనికి మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ సంతకం చేశారు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ సమన్వయంతో ఈ సేవలను అభివృద్ధి చేసినట్లు జనరల్ డిపార్ట్‌ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయలో.. ఈ కొత్త నిబంధనల ప్రకారం విదేశీయులు, సందర్శకులకు ఆరోగ్య బీమా తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మార్పులు కువైట్ పౌర, ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న విదేశీ కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తాయని.. వీసా పునరుద్ధరణ, ఉద్యోగ, నివాస మార్పుల సమయంలో వారు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయని అన్నారు.

వాస్తవానికి యజమానులు లేదా రంగాల మధ్య మారేటప్పుడు నివాస అనుమతులను ట్రాన్స్ ఫర్ చేసే ప్రక్రియ.. గతంలో చాలా మంది ప్రవాసులకు ఎదురైన అతిపెద్ద సవాళ్లలో ఒకటి. అయితే.. తాజాగా ప్రవేశపెట్టబడిన కొత్త ఇ-సేవలతో.. కువైట్ ఈ బదిలీల వేగవంతమైన డిజిటల్ ప్రాసెసింగ్‌ ను అనుమతిస్తుంది. ఫలితంగా.. ఇకపై పొడవైన క్యూలు, రెసిడెన్సీ విభాగానికి పదేపదే వెళ్లాల్సిన ప్రయాణాలను ఇది తగ్గిస్తుంది.

ఈ నిబంధనల ప్రకారం.. ప్రవేశ, సందర్శన వీసాలకు ఇప్పుడు నెలకు 10 కువైట్ దినార్లు ఖర్చవుతుంది. ఈ క్రమంలో.. పెట్టుబడిదారులు, ఆస్తి యజమానులు, దీర్ఘకాలిక నివాసితులకు నివాస అనుమతులు కొన్ని సందర్భాల్లో 15 సంవత్సరాల వరకు మంజూరు చేయబడతాయి. అయితే.. ఈ లోపు అందరు విదేశీ నివాసితులు, సందర్శకులు కువైట్‌ లో వారి వీసా లేదా నివాస స్థితికి మద్దతు ఇచ్చే చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమాను కలిగి ఉండాలి.