కర్నూలు ఘోరం: ఎర్రిస్వామి ఎలా దొరికాడు?
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కర్నూలు ట్రావెల్ బస్సు ఘోర ప్రమాద ఘటనకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూడటం తెలిసిందే
By: Garuda Media | 26 Oct 2025 9:48 AM ISTరెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కర్నూలు ట్రావెల్ బస్సు ఘోర ప్రమాద ఘటనకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూడటం తెలిసిందే. ఈ ప్రమాదానికి ట్రావెల్ బస్సు డ్రైవరే కారణమని భావించినప్పటికి.. ఈ మొత్తం విషాదానికి కర్త,కర్మ,క్రియ ఒక తాగుబోతు నిర్లక్ష్యమన్న విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో సీసీ ఫుటేజ్ పరిశీలనలో వెలుగు చూసిన ఈ ఉదంతం.. ఈ ప్రమాదానికి సంబంధించిన అంశాలన్నింటిని మార్చేసింది.
టూవీలర్ మీద వెళుతున్న శివశంకర్ ను వి.కావేరీ బస్సు డ్రైవర్ తప్పిదంతో ఢీ కొనటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావించారు. అయితే.. మద్యం మత్తులో వెళుతున్న శివశంకర్ చెట్ల మల్లాపురం వద్ద డివైడర్ ను ఢీ కొని అక్కడికక్కడే మరణించటం.. టూవీలర్ మీద అతడి వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్పంగా గాయపడటం తెలిసిందే. రోడ్డుకు అడ్డంగా పడిన పల్సర్ బైకు.. ఆ పక్కనే పడిపోయిన శివశంకర్ సెల్ ఫోన్ తీసుకొని.. డెడ్ బాడీని పక్కకు తీసే సమయంలోనే ట్రావెల్ బస్సు పల్సర్ బైక్ ను ఢీ కొనటంతో బస్సుకు నిప్పు అంటుకోవటానికి కారణమన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.
ఇదంతా చూసిన ఎర్రిస్వామి హడలిపోయి.. తన గ్రామానికి వెళ్లిపోయాడు. పందొమ్మిది మంది ప్రాణాలు తీసిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి వివరాల్ని సేకరిస్తున్న పోలీసులకు.. బైకిస్టు శివశంకర్ సెల్ ఫోన్ లభ్యం కాకపోవటంతో అతడి నెంబర్ ను గుర్తించి.. దాని సిగ్నల్ ఎక్కడ ఉందన్న విషయాన్ని చెక్ చేవారు. ఈ క్రమంలో శివశంకర్ సెల్ ఫోన్ రాంపల్లిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాంపల్లికి వెళ్లిన పోలీసులు ఎర్రిస్వామిని గుర్తించి.. అదుపులోకి తీసుకొని విచారించటంతో మొత్తం విషయం బయటకు వచ్చేసింది. బస్సు ప్రమాదానికి దారి తీసిన వివరాల్ని వెల్లడించారు. మొత్తంగా ట్రావెల్ బస్సు ఘోర ప్రమాదం వెనుక ఉన్న గుట్టును ఎర్రిస్వామి విప్పితే.. అతడ్ని పట్టించింది మాత్రం శివశంకర్ సెల్ ఫోన్ గా చెప్పకతప్పదు.
