టీజీ వర్సెస్ బైరెడ్డి: వేడెక్కిన కర్నూలు రాజకీయం...?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. టిడిపి వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
By: Garuda Media | 18 May 2026 11:28 PM ISTఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. టిడిపి వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా యువ నాయకుడు, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎంపీ ప్రస్తుత మంత్రి భరత్ తండ్రి టీజీ వెంకటేష్ తీవ్రంగా స్పందించారు. వైసిపి నాయకులకు మరోసారి పరాభవం తప్పదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
వచ్చే ఎన్నికలనాటికి ... జిల్లాల వైసీపీ నాయకులు ఎవరు మిగలరంటూ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు దీనికి కొనసాగింపుగా సిద్ధార్థ రెడ్డి మీలోనే ఎవరూ మిగలరు అంటూ ఇచ్చిన కౌంటర్.. రాజకీయంగా ఇరు పార్టీల మధ్య వివాదాన్ని మరింత పెంచింది. ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందిస్తూ భారీ ఎత్తున సంపాదించుకుంటున్నారు.. ఆస్తుల పోగేసుకుంటున్నారు ప్రజలను మోసం చేస్తున్నారంటూ టీజీ వెంకటేష్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
దీంతో వెంకటేష్ సమయం చూసుకునే స్పందించారు. ఎవరు ఆస్తులు పోగేసుకోవాల్సిన అవసరం లేదని.. పుట్టుకతోనే తాము కోటీశ్వరులమని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో ఎవరు ఎంత దోచుకున్నారో ఎవరు ఎన్ని భూకబ్జాలు చేశారో కూడా తన వద్ద జాబితా ఉందని నోరు పారేసుకుంటే మీసాలు తీసి కూర్చోబెడతామని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయంగా ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణ పరిస్థితి ఏర్పడింది.
ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు సవాళ్లు రువ్వుకోవడం ఒకరినొకరు విమర్శలు గుప్పించుకోవటం కామన్ గా మారింది. అయితే దీనివల్ల ఇటు పార్టీలకు గానీ అటు వ్యక్తిగతంగా నాయకులకు కానీ ప్రయోజనం ఏంటి అనేది ప్రశ్న. వ్యక్తిగత విమర్శల వల్ల రాజకీయాల్లో నాయకులు పలుచన అవుతారే తప్ప అటు ప్రజలకు కానీ ఇటు పార్టీ క్యాడర్కు గాని చేరువ అయ్యే పరిస్థితి ఉండదు.
క్షేత్రస్థాయిలో టిడిపిని బలోపేతం చేయాలన్న లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో టీజీ కుటుంబం కనకబడుతుందన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో వైసిపి పరోక్షంగా పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
