కర్నూలు లోకల్ ఫైట్: కాకెక్కుతోన్న టీడీపీ-వైసీపీ
మున్సిపల్ ఎన్నికల వేడి క్షేత్రస్థాయిలో జోరందుకున్న కర్నూలులో అధికార పార్టీ నాయకులకు పెద్ద టెస్టే ఎదురు కానుందని అంటున్నారు.
By: Garuda Media | 27 Sept 2026 1:00 AM ISTమున్సిపల్ ఎన్నికల వేడి క్షేత్రస్థాయిలో జోరందుకున్న కర్నూలులో అధికార పార్టీ నాయకులకు పెద్ద టెస్టే ఎదురు కానుందని అంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రాజకీయం ప్రస్తుతం అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు చట్ట సవరణ ఆమోదించడంతో, కర్నూలు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుత కర్నూలు మున్సిపల్ ఎన్నికల రాజకీయ ముఖచిత్రం ఆసక్తిగా మారింది.
కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కొత్తగా 68 వార్డులకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాలు కూడా విడుదలయ్యాయి. మొత్తం నగర ఓటర్ల సంఖ్య సుమారు 4,79,861 గా ఉంది. 68 వార్డుల పరిధిలో రాజకీయాలు ఈ ఓటర్ల చుట్టూనే తిరుగుతోంది. ఇటీవలి వినాయక చవితి ఉత్సవాలలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు, స్థానిక యువజన సంఘాలకు, గణేష్ మండపాలకు భారీగా విరాళాలు అందించడం గమనార్హం. అయితే.. వీరిలో కొందరు వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. దీంతో టీడీపీకి అనుకూలంగా ఉన్న వర్గాలను ఆకర్సించే ప్రయత్నం చేయడంతో.. అధికార పార్టీలో గుబులు రేగింది. అయితే.. ఈ విరాళాలు తమను ఏమీ చేయలేవని మంత్రి భరత్ పేర్కొనడం గమనార్హం.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నుండి గెలిచి మంత్రి అయిన టీజీ భరత్ నేతృత్వంలో ఈ ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలు కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. కార్పొరేషన్‌పై పట్టు సాధించడం ఆయనకు ఒక పెద్ద రాజకీయ పరీక్షగా మారిందని స్థానిక రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండటం, అసెంబ్లీ ఎన్నికల నాటి క్లీన్ స్వీప్ ఉత్సాహంతో అత్యధిక వార్డులతో పాటు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. వీరికి జనసేన, బీజేపీ శ్రేణుల మద్దతు కూడా కలిసి రానుంది.
ఇక, వైసీపీ కూడా దూకుడుగానే ఉంది. గత 2021 మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీపీ ఏకపక్షంగా విజయం సాధించి 52 వార్డులలో 41 గెలిచింది. మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో పార్టీ కేడర్‌ను కాపాడుకోవడం వారికి సవాలుగా మారినా దానిని అధిగమించేందుకు నిరంతరం ప్రయత్నాలు సాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందే వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు, మాజీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ, బలమైన అభ్యర్థులను రంగంలోకి దంపి తిరిగి పట్టు నిలుపుకోవాలని పార్టీ అధిష్టానం చూస్తోంది.
మేయర్ అభ్యర్థిని ప్రజలే నేరుగా ఎన్నుకోనుండటంతో, వార్డు స్థాయి నేతల ఆధిపత్యం కంటే బలమైన, ప్రజల్లో ఆదరణ ఉన్న ప్రధాన ముఖాన్ని మేయర్ అభ్యర్థిగా నిలబెట్టడం పార్టీలకు కీలకం కానుంది. ఇక, స్థానిక సమస్యలను ప్రస్తావించడంలో వైసీపీ ముందుంటే.. వాటిని పరిష్కరిస్తున్నామని.. నిధులు కూడా తెస్తున్నామని.. మంత్రి టీజీ భరత్ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాకపోయినా.. కర్నూలులో స్తానిక ఎన్నికల కాక మాత్రం రగులుతోంది. ఒకవైపు వైసీపీ నాయకులు.. మరోవైపు టీజీ మంత్రాంగం రెండూ కూడా నగర పోరును వేడెక్కిస్తున్నాయి.
