Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్‌: క‌ర్నూలు మంత్రుల‌కు సెగ ..!

కర్నూల్ లో జరుగుతున్న పరిణామాలు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు మంత్రులకు సెగ పెడుతున్నాయి.

By:  Garuda Media   |   16 Oct 2025 9:49 AM IST
గ్రౌండ్ రిపోర్ట్‌: క‌ర్నూలు మంత్రుల‌కు సెగ ..!
X

కర్నూల్ లో జరుగుతున్న పరిణామాలు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు మంత్రులకు సెగ పెడుతున్నాయి. కర్నూలు జిల్లా నుంచి టీజీ భరత్ అదేవిధంగా ఫరూక్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఒకరు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే మరొకరు మైనారిటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ జిల్లా మొత్తం మీద వీరికి పట్టు ఉంది. అదేవిధంగా కీలకమైన బాధ్యతలు కూడా చంద్రబాబు అప్పగించారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తే దాదాపు సగం పైగా జిల్లా ఖాళీ అయిపోయింది.

అనేక గ్రామాలు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పనులు లేకపోవడం. రైతులు తీవ్రంగా నష్టపోవడం. పత్తి, ఉల్లి ,టమాటా సహా అనేక పంటలు దెబ్బ తినడం. వారికి మద్దతు ధర రాకపోవడంతో రైతులు తమ కుటుంబాలను వెంటపెట్టుకొని పొరుగున‌ ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకు వలస పోతున్నారు. ఇటీవల కాలంలో భారీ ఎత్తున తరలిపోయిన దృశ్యాలు ప్రధాన మీడియాలోనే వ‌చ్చాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో ఇబ్బందికర పరిణామాలుగా మారుతున్నాయి అన్నది వాస్తవం.

ఈ విషయాన్ని గ్రహించిన సీఎం చంద్రబాబు తాజాగా కర్నూలు మంత్రులు టీజీ భరత్, ఫ‌రూక్‌ల‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు మీరు ఎందుకు గమనించటం లేదు. పరిస్థితిని ఎందుకు చక్కదిద్ద‌డం లేదన్నది ఆయన ప్రధానంగా అడిగిన ప్రశ్న. ఉపాధికల్పన, ఉద్యోగాల‌కు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెబుతున్న సమయంలో ఈ విధంగా వేలాదిమంది తమ కుటుంబాలతో రైతులు వలస పోవడం రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారింది అన్నది చంద్రబాబు అంతర్గతంగా చెప్పిన మాట.

ఈ క్రమంలో రైతులు తక్షణమే స్థానికంగా ఉపాధి పొందే లాగా చర్యలు తీసుకోవాలని అవసరమైతే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత ఎక్కువగా జిల్లాలో అమలు చేయాలని కూడా ఆయన సూచించారు. ఇతర పనులను మానేసి అవసరమైతే జిల్లాపై దృష్టి పెట్టాలని కూడా టీజీ భరత్‌కు అయినా సూచించినట్టు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. మ‌రో వైపు అధికారులు కూడా కర్నూలు జిల్లాలో ఏం జరుగుతోందన్న విషయంపై క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు. ఇక్కడ నుంచి రైతులు వెళ్లిపోకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా ఉపాధి కల్పించాలని అంశాల పైన వారు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. మొత్తానికి కర్నూలులో జరుగుతున్న పరిణామాలు మంత్రులు టీజీ భరత్ ఫరూక్‌లకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయన్నది వాస్తవం.