కర్నూల్ బస్సు ప్రమాదం.. మరణించిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ వీళ్లే..
కర్నూల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం ఎంతటి ఘోరానికి దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
By: Madhu Reddy | 24 Oct 2025 5:47 PM ISTకర్నూల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం ఎంతటి ఘోరానికి దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశం మొత్తం ఈ ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ నుండి బెంగళూరుకి బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్ బస్సు బైక్ ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా బస్సు మొత్తం వ్యాపించడంతో.. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు బయట ఏం జరుగుతోందో తెలియక ప్రాణాలతో బయటపడలేకపోయారు. దీంతో మొత్తం 42 మంది ప్రయాణించగా.. అందులో 20 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక చనిపోయిన వారిని ఒక్కొక్కరిగా గుర్తిస్తూ ఉండగా.. గుర్తించలేని వారిని డీఎన్ఎ టెస్ట్ ల ద్వారా గుర్తించి తమ కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు మహిళా షాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడు కు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరుకు చెందిన అనూష రెడ్డి చనిపోయారు. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు
ఇకపోతే వీరిద్దరిలో ఒకరైన ధాత్రి.. ఇటీవల హైదరాబాద్ లోని తన పెదనాన్న ఇంటికి వచ్చారట. అక్కడినుంచి బెంగళూరు వెళ్ళేందుకు గురువారం రాత్రి ఆమె వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతురాలి తల్లి వాణి, బంధువులు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ధాత్రి మృతికి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
ఇంకొకరు యాదాద్రి జిల్లాకు చెందిన అనూష రెడ్డి.. ఇటీవల దీపావళి కోసం స్వగ్రామానికి వచ్చింది. తిరిగి బెంగళూరు వెళ్లడానికి గురువారం రాత్రి ఖైరతాబాద్ లో బస్సు ఎక్కి ఈ దుర్ఘటనలో మృతి చెందింది. ఇకపోతే ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరూ కూడా బస్సు లోపలే చిక్కుకొని తీవ్ర కాలిన గాయాలతో మరణించినట్లు తెలిపారు. ఈ హృదయ విధారకర సంఘటన వారి కుటుంబాలను, ఐటి వర్గాలను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసాయి..ఈ క్లిష్ట సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
