Begin typing your search above and press return to search.

బూడిదలో బంగారు వేట.. బస్సు ప్రమాదం వద్ద ప్రశ్నిస్తున్న దృశ్యాలు!

అవును... కర్నూలు లో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన పదుల సంఖ్యలో కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగల్చగా... లక్షల కుటుంబాలు ఆ ఘటనను ఇంకా తలచుకుంటూనే ఉన్న పరిస్థితి!

By:  Raja Ch   |   30 Oct 2025 6:19 PM IST
బూడిదలో బంగారు వేట.. బస్సు ప్రమాదం వద్ద ప్రశ్నిస్తున్న దృశ్యాలు!
X

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ బస్సు కర్నూలు జిల్లాలో జాతీయ రహదారి 44పై ఘోర అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఆ ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులోనుంచి బయటకు వెళ్లలేక సీట్ల మధ్య మాంసపు ముద్దలు, బూడిద కుప్పలుగా మిగిలిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు.

ఈ ఘటనతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన దారుణ దృశ్యాలు ఇంకా కళ్ల ముందే కనిపిస్తున్నాయి. గాయపడిన వారు ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. అగ్నికి ఆహుతవుతున్న సమయంలో వారి హాహాకారాలు ఇంకా గాలిలోనే తిరుగుతున్నాయి!

మృతుల కుటుంబాలు ఇంకా ముద్ద కూడా ముట్టలేని పరిస్థితిలో ఉండగా.. మృత్యువు నుంచి బయటపడినవారు ఇంకా ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. ఇది తమకు పునర్జన్మ అని కొంతమంది భావిస్తుంటే.. ఇది ఇప్పటికీ కలో నిజమో తెలియని షాక్ లో మరికొంతమంది ఉన్నారని చెబుతున్నారు. ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అవును... కర్నూలు లో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన పదుల సంఖ్యలో కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగల్చగా... లక్షల కుటుంబాలు ఆ ఘటనను ఇంకా తలచుకుంటూనే ఉన్న పరిస్థితి! అయితే మరికొంతమంది మాత్రం అవన్నీ మరిచిపోయి ప్రవర్తిస్తున్న తీరు, మనుషుల్లో రోజు రోజుకీ కరువైపోతుందా అనిపించే మానవత్వాన్ని ప్రశ్నిస్తుంది.

ఇందులో భాగంగా... ఈ నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమవ్వగా... ఆ ప్రమాదానికి గురైన బస్సును అధికారులు తాజాగా రోడ్డుకు దూరంగా తీసుకెళ్లారు. ఈ సమయంలో... మృతిచెందిన, గాయపడిన ప్రయాణికులు ధరించిన ఆభరణాల కోసం బస్సు చుట్టూ కొందరు చేరి వెతుకుతున్న దృశ్యాలు తాజాగా తెరపైకి వచ్చాయి.

ఈ ఘోర అగ్ని ప్రమాదంలో విలువైన ఆభరణాలు కాలిపోయి ఉంటాయని భావించి.. బూడిదను సంచుల్లోకి ఎత్తి, నీటిలో జల్లెడపడుతూ మరీ వెతుకుతున్నారు. దీంతో.. ఎంతో మంది కుటుంబ సభ్యులను, స్నేహితులను, బంధువులను, ఆత్మీయులను కోల్పోయి విషాదంలో ఉంటే.. వీరు మాత్రం ఆభరణాల కోసం బూడిదలో సైతం వెతకడం.. మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న ఘటనగా చూస్తున్నారు!

కాగా... హైదరాబాద్‌ - బెంగళూరు నేషనల్ హైవే 44పై కర్నూలు జిల్లా శివారులోని చిన్నటేకురు వద్ద అక్టోబర్ 24న తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వేమూరి కావేరీ ట్రావెల్స్‌ కు చెందిన స్లీపర్‌ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 42 మందిలో 19 మంది ప్రయాణికులు, టూవీలర్ నడిపిన వ్యక్తి సహా మొత్తం 20 మంది మృతి చెందారు.