కర్నూలు బస్సు ప్రమాదం: ఏ1కు రిమాండ్.. ఏ2కు విడుదల!
హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చెట్లమల్లాపురం వద్ద ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 7 Nov 2025 5:48 PM ISTహైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చెట్లమల్లాపురం వద్ద ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 19 మంది సజీవదహనమై, పలువురు తీవ్రంగా గాయపడిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. మంటలు వ్యాపించినప్పుడు బయటకు వెళ్లలేక ప్రయాణికులు సీట్ల మధ్య కాలి బూడిదైపోయారు.
తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనలో... బస్సులో సేఫ్టీ ఎగ్జిట్ డోర్లు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ లేకపోవడం వంటి నిర్లక్ష్యాలు బయటపడ్డాయి! ఈ ఘటనకు సంబంధించి ఏ-1 అయిన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు.
అయితే తాజాగా బస్సు యజమాని వేమూరి వినోద్ విడుదలయ్యారు. కర్నూలు బస్సు ప్రమాదఘటనలో ఏ-2గా ఉన్న ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు.. కర్నూలు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. అయితే కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయన తనను విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం రూ.10 వేల సొంత పూచీకత్తుపై ఆయన్ని విడుదల చేసింది.
కాగా... కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు.. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వీరంతా సజీవ దహనమయ్యారు. ఆ బైక్ నడిపిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు!
మరోవైపు ఈ బస్సు రిజిస్ట్రేషన్ విషయంలోనూ లొసుగులున్నట్లు.. సీటర్ వాహనాన్ని స్లీపర్ గా మార్చినట్లు ఆరోపణలొచ్చాయి. ఇదే సమయంలో.. ఈ ప్రమాదానికి గురైన బస్సు 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబరు 9 వరకు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు.. ఇదే క్రమంలో 9 సార్లు నో ఎంట్రీ జోన్ లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడగా.. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనల పైనా చలాన్లు పడినట్లు తెలిసింది!
