కర్నూలులో పూర్తిగా దగ్దమైన ట్రావెల్స్ బస్సు... 20 మందికి పైగా మృతి!
శుక్రవారం తెల్లవారుజామున ఘోరం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
By: Raja Ch | 24 Oct 2025 9:52 AM ISTశుక్రవారం తెల్లవారుజామున ఘోరం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరులో 44వ నేషనల్ హైవేపై అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు మంటల్లో కాలి బూడిదవ్వగా.. ఆ సమయంలో బస్సులోనే పలువురు సజీవదహనం అయ్యారు!
అవును... కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు శివారులోని కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర వి.కావేరీ ట్రావెల్స్ బస్సు (డీడీ01 ఎన్9490) మంటల్లో కాలి బూడిదైంది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
20 మందికి పైగా మృతి!:
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో బస్సు కాలి బూడిదవ్వగా.. ఆ సమయంలో బస్సులో సుమారు 39 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో కొంతమంది బస్సులోనే సజీవదహనమైనట్లు సమాచారం. ఈ క్రమంలో మొత్తం మృతుల సంఖ్య 20 వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. మరో 12 మంది స్వల్పంగా గాయపడినట్లు చెబుతున్నారు.
అసలు ప్రమాదం ఎలా జరిగింది?:
హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఉలిందకొండ సమీపంలోకి రాగానే వెనక నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో ఆ టూవీలర్, బస్సు కిందికి వెళ్లి ఆయిల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా బస్సు అంతా మంటలు వ్యాప్తిచెందాయని అంటున్నారు.
ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా.. ఒక్కసారిగా తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. ఆ సమయంలో డోర్ వద్ద మంటలు వ్యాపించడంతో పాటు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో గుర్తించలేకపోయారని.. ఈ సమయంలో పలువురు అద్దాలు పగలగొట్టుకుఇ బయటపడినట్లు తెలుస్తోంది.
మరికొంతమంది బయటకు వెళ్లలేక మంటల్లోనే సజీవదహనం అయినట్లు సమాచారం. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృత్యుంజయులు వీరే!:
ఈ ఘోర అగ్నిప్రమాదం నుంచి వేణుగోపాల్ రెడ్డి, రామిరెడ్డి, నవీన్ కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ, శ్రీలక్ష్మి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో హిందూపూర్ కు చెందిన నవీన్ గాయపడిన ఆరుగురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్ కు వస్తున్న హైమ రెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగి, పోలీసులకు సమాచారం అందించారు!
స్పందించిన జిల్లా ఎస్పీ!:
ఈ ఘటనపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పందించారు. బెంగళూరు వెళ్తున్న బస్సు టూవీలర్ ను ఢీకొట్టిడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. బైక్ ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయని.. డ్రైవర్ గమనించి మరో డ్రైవర్ ను నిద్ర లేపి, చిన్నపాటి ప్రమాదం అనుకుని వాటర్ బబుల్ తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారని అన్నారు. అంతలోనే మంటలు ఎక్కువయ్యాయని తెలిపారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి!:
ఈ ఘోర అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సీఎస్, ఇతర అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
స్పందించిన మంత్రి నారా లోకేష్!:
ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... 'కర్నూలు జిల్లాలోని చిన్న టేకూర్ గ్రామం సమీపంలో జరిగిన వినాశకరమైన బస్సు అగ్ని ప్రమాదం వార్త హృదయ విదారకంగా ఉంది. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని పోస్ట్ చేశారు.
