Begin typing your search above and press return to search.

మే 16 తర్వాతే జాగ్రత్త పడి ఉంటే కర్నూలు ఘోరం లేదుగా..!

అవును... కర్నూలు జిల్లాలో దగ్దమైన వీ.కావేరీ బస్సు ఘటనలో ఆ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది.

By:  Raja Ch   |   25 Oct 2025 4:04 PM IST
మే 16 తర్వాతే జాగ్రత్త పడి ఉంటే కర్నూలు ఘోరం లేదుగా..!
X

హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వీ.కావేరీ ప్రైవేటు బస్సు కర్నూలు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. గురువారం రాత్రి ఆనందంగా బస్సు ఎక్కినవారు శుక్రవారం తెల్లవారే సరికి విగతజీవులుగా మారారు. దీనికి గల కారణాల్లో యాజమాన్యం నిర్లక్ష్యం ఒకటని తెలుస్తోంది.

అవును... కర్నూలు జిల్లాలో దగ్దమైన వీ.కావేరీ బస్సు ఘటనలో ఆ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఆ బస్సుకు అగ్నిమాపక పరికరాలు లేవని రవాణా శాఖ అధికారులు గతంలో రెండుసార్లు జరిమానాలు వేశారు. అయినా యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోలేదనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం మారింది.

వివరాళ్లోకి వెళ్తే... కర్నూలు జిల్లాలో దగ్ధమైన వీ.కావేరి బస్సుకు అగ్నిమాపక పరికరాలు లేవని రవాణా శాఖ అధికారులు గతంలో రెండుసార్లు జరిమానాలు వేశారనే విషయం తెరపైకి వచ్చింది. అయినప్పటికీ యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోలేదని అంటున్నారు. ఫలితంగా ఆ బస్సు నిలువునా తగలబడి, 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

వాస్తవానికి ఈ బస్సు నిబంధనలు ఉల్లంఘించిందని గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జులై వరకు రవాణాశాఖ అధికారులు ఐదుసార్లు జరిమానాలు వేశారు. ఇందులో భాగంగా... గత ఏడాది సెప్టెంబరు 20న నెల్లూరులో రోడ్డుకు అడ్డంగా బస్సు నిలపడం, డ్రైవర్‌ యూనిఫాం ధరించకపోవడంతో రవాణాశాఖ అధికారులు జరిమానా వేశారు.

అనంతరం.. ఈ ఏడాది మే 16న కాకినాడ జిల్లా కృష్ణవరం వద్ద.. అగ్నిమాపక పరికరాలు లేవని, ఎక్కువ వోల్ట్స్‌ ఉండే హెడ్‌ లైట్స్‌ వాడుతున్నారని రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో తెలియడంతో జరిమానా విధించారు. మళ్లీ జూన్‌ 11న శ్రీకాకుళం జిల్లా కుశలపురంలో తనిఖీ చేయగా.. అప్పటికీ అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయలేదు. మళ్లీ జరిమానా పడింది.

ఇదే క్రమంలో... జూన్‌ 13న శ్రీకాకుళంలో మళ్లీ తనిఖీ చేసినప్పుడు రహదారి భద్రత నిబంధన ఉల్లంఘించి, రోడ్డుకు అడ్డంగా బస్సు నిలపడంతో మరోజారి జరిమానా వేయగా... జులై 4న ఏలూరు జిల్లా బొమ్ములూరు వద్ద చేసిన తనిఖీల్లో ప్రయాణికుల జాబితా లేదని గుర్తించి జరిమానా విధించారు. ఈ విధంగా ఏపీలో ఐదుసార్లు ఈ బస్సుకు జరిమానాలు విధించారు.

తెలంగాణలోనే 16 చలాన్లు!:

మరోవైపు ఈ బస్సుపై నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తెలంగాణలో 16 చలాన్లు పెండింగ్‌ లో ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా... బస్సును ప్రమాదకరంగా నడపడం, రాంగ్‌ రూట్‌ లో నడపడటం, ప్రవేశానికి అనుమతి లేని రోడ్లలో నడపడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని అంటున్నారు.

మే 16 తర్వాతే జాగ్రత్తపడి ఉంటే..?:

తాజాగా కర్నూలులో ఘోర అగ్ని ప్రమాదానికి గురైన ఈ బస్సు ప్రమాదానికి కారణం.. బస్సులో అగ్నిమాపక పరికరాలు లేవని చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మే 16న కాకినాడ జిల్లా కృష్ణవరం వద్ద అగ్నిమాపక పరికరాలు లేవని అధికారులు గుర్తించి జరిమానా విధించారు. అయినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది! ఆరోజు తర్వాతే యాజమాన్య ఆ విషయంలో జాగ్రత్త పడి, బస్సులో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని అంటున్నారు! ఓ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం 19 మంది ప్రాణాలు తీసుకుంది!