కర్నూలు బస్సు ప్రమాదం... మృతదేహాల గుర్తింపుపై కీలక అప్ డేట్!
అవును... కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారినవేళ.. ఏ మృతదేహం ఎవరిదో నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షలే కీలకం కానున్నాయని అధికారులు తెలిపారు.
By: Raja Ch | 25 Oct 2025 4:20 PM ISTకర్నూలులో జాతీయ రహదారి 44పై వీ.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో.. ఏ మృతదేహం ఎవరిదో నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షలే కీలకంగా మారాయి. ఈ నివేదికలు రావడానికి మరిమ సమయం పట్టే అవకాశముందని.. అప్పటివరకూ మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించటం సాధ్యం కాదని అంటున్నారు.
అవును... కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారినవేళ.. ఏ మృతదేహం ఎవరిదో నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షలే కీలకం కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే 16 మంది మృతుల బంధువుల నమూనాలు సేకరించగా.. నివేదికలు రావడానికి రెండు మూడ్రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
కర్నూలు వైద్య కళాశాల ఫోరెన్సిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డా.సాయిసుధీర్, డా.బ్రహ్మాజీ, డా.నాగార్జున ఆధ్వర్యంలో ఆరుగురు ఫోరెన్సిక్ వైద్యులతో పాటు 10 మంది పీజీలు కలిసి డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం 19 మృతదేహాల నుంచి నమూనాలు తీయడంతో పాటు శవ పరీక్షలు చేశారు. ప్రస్తుతానికి అందులో 16 మంది మృతుల బంధువుల నమూనాలు సేకరించారు.
పరీక్షల కోసం అవసరమైన జీవకణం, ఎముక మూలుగ సహా ఇతర నమూనాలను ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయి. ఆ నమూనాలను సరిపోల్చేందుకు మృతుల తల్లిదండ్రులు, తోబట్టువులు, పిల్లల్లో ఎవరో ఒకరి నుంచి రక్తనమూనాలు తీసుకోవాలి. ఇలా ఇప్పటివరకూ 16 మంది నుంచి సేకరించారు. వీటన్నింటినీ ఇప్పటికే డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు.
శివశంకర్ స్నేహితుడిని విచారిస్తున్న పోలీసులు!:
మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో... పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాలో శివశంకర్ తో పాటు ఉన్న అతని స్నేహితుడిని గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి శివశంకర్ ద్విచక్ర వాహనంపై డోన్ కు బయలుదేరాడని చెబుతున్నారు.
ఈ క్రమంలో.. జాతీయ రహదారిపై వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో వారిద్దరు ఎగిరిపడ్డారు. అయితే.. ఘటనాస్థలిలోనే శివశంకర్ మృతి చెందగా.. ఎర్రిస్వామికి గాయాలయ్యాయి. దీంతో ఎర్రిస్వామి ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తాజాగా అతడి ఆచూకీ గుర్తించిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
