కర్నూలు బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు.. మిగతా వారు ఎవరెవరంటే?
ఇకపోతే వీరితో పాటు ఈ ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరిని అధికారులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
By: Madhu Reddy | 24 Oct 2025 3:12 PM ISTకర్నూలు బస్సు అగ్నిప్రమాదం ఘటన ఎంత హృదయ విదారక పరిణామంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొత్తం 41 మంది ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణిస్తూ ఉండగా.. ఏకంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అలా ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అగ్ని ప్రమాదానికి ఆహుతి అవడం మరింత విషాదకరం అనే చెప్పాలి. బాధితులను జీ రమేష్ (35), అతని భార్య అనూష (32), వారి కుమారుడు యశ్వంత్ (8), కూతురు మాన్విత (6) గా అధికారులు గుర్తించారు. వీరు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారి పల్లికి చెందినవారు.
ఇకపోతే వీరితో పాటు ఈ ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరిని అధికారులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే దీపావళి కోసం ఇంటికి వచ్చి వెళ్తున్న ఒక తెలంగాణ యువతి కూడా ఇందులో సజీవదహనం అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. యాదాద్రి జిల్లా గుండాల మండలం.. వస్తకొండూరుకు చెందిన అనూష.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. దీపావళి కోసం ఇంటికి వచ్చిన ఆమె నిన్న రాత్రి బెంగళూరు వెళ్లేందుకు ఖైరతాబాద్ లో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కారు. బస్సు దగ్ధమైన ఘటనలో ఆమె సజీవదహనం అయ్యారు. దీంతో ఆమె పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు.
డీఎన్ఏ ద్వారా గుర్తించే ప్రయత్నం..
ఇదిలా ఉండగా మరణించిన వారిని గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల సేకరణ జరుగుతున్నట్లు మంత్రి సత్య కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా బస్సులోనే భౌతిక కాయాలు ఉన్నాయని.. పరిస్థితులకు అనుగుణంగా ఘటన స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో 12 మంది బయటపడ్డారని.. వారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రమాద ఘటన నుండి బయటపడిన వ్యక్తులు వీరే..
ఇకపోతే ఈ ప్రమాదంలో అప్రమత్తమయ్యి వెంటనే బయటకు వచ్చిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వారిలో మొదటగా నిజాంపేట్ క్రాస్ రోడ్డులో బస్సు ఎక్కిన శ్రీహర్ష. ఈయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇతడు ఇటీవల ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చి తిరిగి బెంగళూరు వెళ్తుండగా తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బస్సులో మంటలు అంటుకోగానే.. కిటికీ అద్దాలు పగలగొట్టి మరీ ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఈయన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెస్ రామారెడ్డి.. తన బావ దగ్గరకు వచ్చి తిరిగి బెంగళూరులోని తన భార్య, కూతురు వద్దకు వెళ్తున్నారట. జేఎన్టీయూలో బస్సు ఎక్కిన ఈయన ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు చివర్లో ఉండడంతో ప్రమాదం జరగగానే బయట నుంచి కొందరు డోరు గట్టిగా కొట్టారట. దీంతో ఉలిక్కిపడి లేచిన ఆయనను బయటనుంచి కొందరు కిందికి లాగేసినట్లు తెలిపారు. ఇతడితో పాటు వేణుగోపాల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం అనే ఇద్దరు వ్యక్తులు కూడా బయటపడ్డారు.. ప్రస్తుతం వీరిలో సుబ్రహ్మణ్యం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదం నుండి బయటపడిన మరో ఇద్దరిలో ఒకరు సీట్ నెంబర్ U4 లో ఉన్న సురారానికి చెందిన గుణ సాయి కాగా, సీట్ నెంబర్ U18 లో ఉన్న బహదూర్ పల్లికి చెందిన సుబ్రహ్మణ్యం గా అధికారులు గుర్తించారు.
అలాగే విద్యానగర్ కి చెందిన జయంత్ అనే వ్యక్తి బస్సులో నుండి దూకేశాడు. దీంతో ఆయన ఎడమ కాలికి స్వల్ప గాయం అయినట్లు సమాచారం..
అలాగే ప్రయాణికులలో ఒకరైన హారిక కూడా బస్సు నుండి ఎగ్జిట్ డోర్ పగలగొట్టుకొని మరీ బయటకొచ్చేసినట్లు తెలిపారు.
అలాగే ఎమర్జెన్సీ విండో పగలగొట్టుకొని బయటకొచ్చిన వ్యక్తులలో 27 ఏళ్ల జయంత్ కుష్వాహా కూడా ఉన్నారు. కర్నూలుకి 10 కిలోమీటర్ల ముందే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు జయంతి తెలిపారు.
