వీడిన మిస్టరీ.. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణం ఇదే!
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 19 మంది ప్రయాణికులతో పాటు బైక్ నడిపిన శివశంకర్ అనే యువకుడు కూడా మృతి చెందాడు.
By: Raja Ch | 25 Oct 2025 6:18 PM ISTతెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపి, దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన మిస్టరీ వీడింది. ఈ సందర్భంగా బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రధానంగా బస్సు ఢీకొట్టిన బైక్ నడిపిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని గుర్తించి, విచారించిన అనంతరం అసలు విషయాలు తెరపైకి వచ్చాయని తెలుస్తోంది.
అవును... హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో మంటలు చెలరేగి 19 మంది సజీవ సమాది అయ్యారు. ఆ మంటల్లో గుర్తుపట్టలేనంతగా కాలి, మాంసపుముద్దలుగా మిగిలారు.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 19 మంది ప్రయాణికులతో పాటు బైక్ నడిపిన శివశంకర్ అనే యువకుడు కూడా మృతి చెందాడు. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో బైక్ పై శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా గుర్తించిన పోలీసులు.. అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించారు.. ఫలితంగా, అతని నుంచి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు రాబట్టారు.
ఇందులో భాగంగా... ప్రమాదానికి ముందు బంక్ లో పెట్రోల్ పోయించిన తర్వాత శివశంకర్ బైక్ నడపగా.. ఎర్రిస్వామి వెనుక కూర్చున్నాడు. ఈ క్రమంలో వారి బైక్ చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై స్కిడ్ అయ్యి రోడ్డు కుడి పక్కనున్న డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ రోడ్డుపై పడిపోగా.. శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు!
అయితే... ఆ బైక్ పై వెనుక కూర్చున్న ఎర్రిస్వామి మాత్రం అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు! ఈ క్రమంలో... శివశంకర్ ఎలా ఉన్నాడో చూసి పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి యత్నించాడు. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్ ను అటువైపుగా వేగంగా వస్తున్న వేమూరి కావేరి బస్సు ఢీకొని ఈడ్చుకెళ్లింది.
దీంతో... బస్సు ముందు భాగంలో ఆ బైక్ ఇరుక్కు పోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో గాయపడ్డ ఎర్రిస్వామి భయంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
