కర్నూలు దుర్ఘటనలో బైక్ పై రెండో వ్యక్తి..! విచారణలో పోలీసులు
ఇతడు ప్రమాదానికి ముందు మద్యం తాగి ఓ బంక్ లో పెట్రోల్ కోసం ఆగాడు. అప్పటికే అతడు బాగా మత్తులో ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది.
By: Tupaki Political Desk | 25 Oct 2025 3:25 PM ISTకర్నూలు శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బైకర్ ను బస్సు ఢీకొట్టడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. బైక్ నడుపుతున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా పోలీసులు తేల్చారు. ఇతడు ప్రమాదానికి ముందు మద్యం తాగి ఓ బంక్ లో పెట్రోల్ కోసం ఆగాడు. అప్పటికే అతడు బాగా మత్తులో ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది.
ఆ బంక్ లోకి అతడితో కలిసి..
ఎర్రి స్వామి బంక్ లోని వెళ్లిన సమయంలో అతడి బైక్ పై మరో వ్యక్తి ఉన్నాడు. వాస్తవానికి బస్సు బైక్ ను ఢీకొట్టిన ఘటనలో ఎర్రి స్వామి చనిపోయాడు. కానీ, శనివారం ఉదయం వరకు బైక్ పై అతడు ఒక్కడే ఉన్నట్లుగా కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఎర్రిస్వామితో పాటు శివశంకర్ అని అతడి స్నేహితుడు కూడా బైక్ పై ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజీతో తేలింది. పెట్రోల్ బంక్ నుంచి వీరు బయటకు వెళ్లాక ఎంతసేపటికి ప్రమాదం జరిగింది? అనేది తేలాల్సి ఉంది.
పోలీసు విచారణలో..
ఎర్రిస్వామితో పాటు బైక్ పై ఉన్న శివశంకర్ ను పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఇతడి వివరాలు గుర్తించిన పోలీసులు.. వివరాలు రాబడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఎర్రిస్వామితో కలిసి శివశంకర్ బైక్ పై డోన్ బయల్దేరినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సమయంలో వేమూరి కావేరి బస్ ఢీకొనడంతో ఇద్దరూ ఎగిరిపడ్డారు. ఎర్రిస్వామి అక్కడికక్కడే చనిపోగా.. శివశంకర్ అతడిని వదిలేసి వెళ్లిపోయాడు.
తేలాల్సినవి ఇవి..?
కర్నూలు దుర్ఘటనలో పలు అంశాలు తేలాల్సి ఉంది..? బస్సు కిందకు బైక్ వెళ్లిపోయిన ఈ పెను ప్రమాదంలో శివశంకర్ ఎలా తప్పించుకున్నాడు...? అంత ప్రమాదంలో అతడు కూడా ఉన్నట్లు ఎందుకు ఒక రోజంతా గుర్తించలేకపోయారు? ఇక పెట్రోల్ బంక్ నుంచి వచ్చాక ఎంతసేపటికి ప్రమాదం జరిగింది..? వంటి వివరాలు బయటకు రావాల్సి ఉంది.
