Begin typing your search above and press return to search.

ప్రధానిగా మమత...ఈ జోస్యం ఎవరిదంటే ?

పశ్చిమ బెంగాల్ సీఎం గా మమతా బెనర్జీ గత పద్నాలుగేళుగా కొనసాగుతున్నారు. 2026లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి.

By:  Satya P   |   21 Oct 2025 12:34 PM IST
ప్రధానిగా మమత...ఈ జోస్యం ఎవరిదంటే ?
X

పశ్చిమ బెంగాల్ సీఎం గా మమతా బెనర్జీ గత పద్నాలుగేళుగా కొనసాగుతున్నారు. 2026లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. మరో టెర్మ్ ఆమె సీఎం అవుతారు అన్నది పార్టీ వారి గట్టి నమ్మకం. అయితే ఈసారి మమతా దీదీని గద్దె దించేస్తామని బీజేపీ అంటోంది. ఆ ముచ్చట అలా ఉంటే మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మీద తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ అయితే తాజాగా సంచలన జోస్యమే చెప్పారు. దీపావళి వేడుక వేళ మమతా బెనర్జీ రాజకీయ జాతకాన్ని ఆయన చదివి వినిపించారు. ఇది బెంగాల్ లో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ మింగుడుపడకుండా ఉంది. అంతే కాదు ఇండియా కూటమిలో కాంగ్రెస్ కి ఇతర పక్షాలకు అసలు అర్ధం కాకుండా ఉంది. ఇంతకీ కునాల్ ఘోష్ మమత మీద తనకున్న మమతానుబంధనంతో ఏమి చెప్పారంటే...

ప్రధాని అవుతారుట :

ఈ దేశంలో 2029 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓటమి పాలు అవుతుందని అదే సమయంలో మమత ప్రధానిగా దేశాన్ని పాలిస్తారు అని కునాల్ ఘోష్ జోస్యం చెప్పారు. ఆమె ప్రధాని అయితే ఆ కధే వేరుగా ఉంటుందని కూడా ఆయన కామెంట్స్ చేశారు. మమతా దేశానికి ప్రధాని అయ్యే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

జ్యోతిబసు రికార్డు బ్రేక్ :

అంతే కాదు మరో జోస్యాన్ని ఆయన వదిలారు. మమతా బెనర్జీ బెంగాల్ సీఎం గా ఇప్పటిదాకా సుదీర్ఘ కాలం ఉన్న జ్యోతిబసు రికార్డుని బ్రేక్ చేస్తారని చెప్పారు. 1977 నుంచి 2000 దాకా 23 ఏళ్ల పాటు జ్యోతిబసు బెంగాల్ ని నిరాటంకంగా పాలించారు. మమత 2026 నాటికి 15 ఏళ్ళు ఏకధాటీగా పనిచేసిన వారుగా రికార్డు క్రియేట్ చేస్తారు. ఆమె బెంగాల్ సీఎం గా 2036 దాకా కొనసాగుతారు అని కూడా కునాల్ ఘోష్ చెప్పారు. మరి ఆమె బెంగాల్ సీఎం అని ఒక వైపు అంటూ మరో వైపు దేశానికి ప్రధాని అంటున్నారు అదేలా అంటే కునాల్ ఘోష్ జోస్యం దేనికైనా అన్నట్లుగానే చెబుతోంది. ఆమె కచ్చితంగా 2029 లో ప్రధాని అవుతారు అని ఒక వేళ అలా కాకపోతే బెంగాల్ సీఎం గా ఆమె కొనసాగుతారు అని అంటున్నారు. ఆమె తరువాత అభిషేక్ బెనర్జీ సీఎం అవుతారని కూడా ఇదే కునాల్ ఘోష్ చెబుతున్నారు.

రాహుల్ సంగతేంటి :

ఇండియా కూటమిలో అతి పెద్ద పార్టీ ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కదా ప్రధాని అని అంతా అంటున్నది మరి మమత దేశానికి ప్రధాని అయితే రాహుల్ సంగతేంటి అన్న చర్చ వస్తోంది. అంతే కాదు ఇండియా కూటమిలోని ఇతర మిత్రులకు కూడా ప్రధాని పదవి మీద ఆశలు హెచ్చుగా ఉన్నాయి కదా మమతకు ఆ పట్టం కట్టేస్తే వారి విషయం ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. కునాల్ ఘోష్ తమ అధినేత్రి మెప్పు కోసం బీజేపీని నిందించడం కోసం ఏకంగా ఇండియా కూటమిలో చిచ్చు పెట్టేశారు అని అంటున్నారు.

వారిది సోషల్ మీడియాట :

తృణమూల్ కాంగ్రెస్ సచివాలయంలో ఉంటూ పాలిస్తే విపక్ష బీజేపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండాల్సిందే అని కూడా కునాల్ ఘోష్ అంటున్నారు. 2026 ఎన్నికలు తృణమూల్ కాంగ్రెస్ కి ఒక బిగ్ చాలెంజ్ అని వినిపిస్తున్న నేపధ్యంలో ఈ సీనియర్ నేత తృణమూల్ కి మంచి బూస్టింగ్ అయితే ఇవ్వగలిగారు కానీ రియల్ సీన్ వేరుగా ఉందని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలు కాకుండా చూసుకోవాలని బీజేపీ నేతలు హితవు చెబుతున్నారు.