Begin typing your search above and press return to search.

ఛత్తీస్ గఢ్ వలస కూలీల్ని కశ్మీర్ లో మతం అడిగి చంపేశారా?

సున్నిత అంశాల్ని ప్రస్తావించే వేళలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం.

By:  Garuda Media   |   2 Aug 2026 2:00 PM IST
ఛత్తీస్ గఢ్ వలస కూలీల్ని కశ్మీర్ లో మతం అడిగి చంపేశారా?
X

సున్నిత అంశాల్ని ప్రస్తావించే వేళలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాల్సి న బాధ్యత మీడియా మీద ఉన్నప్పటికి.. ఎవరికి వారు వారికి నచ్చినట్లుగా రిపోర్టు చేసే బాధ్యతారాహిత్యమైన తీరు మీడియా సంస్థల్లో కనిపిస్తోంది. అంతేకాదు.. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే కన్నా.. అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తున్న తీరు ఏ మాత్రం మంచి సంప్రదాయం కాదన్నది మర్చిపోకూడదు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా జమ్ముకశ్మీర్ చోటు చేసుకున్న ఒక విషాద ఉదంతాన్ని ప్రస్తావించాలి.

కుల్గాం జిల్లా కేలం ప్రాంతంలో ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇద్దరు వలస కార్మికులను శుక్రవారం రాత్రి కాల్చి చంపేశారు. వీరిని హత్య చేయటానికి ముందు ఉగ్రవాదులు వారిని మతం అడిగి మరీ చంపేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్లు దీపక్ రాత్రే, 28 ఏళ్లు భూపేంద్ర బైనాగా చెబుతున్నారు. కాల్పుల్లో దీపక్ ఘటనా స్థలంలో మరణిస్తే.. భూపేంద్ర మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వీరిద్దరు ఛత్తీస్ గఢ్ లోని సారంగఢ్ - బిలాయ్ గఢ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో దీపక్ ఎనిమిది నెలల క్రితం ఉపాధి కోసం వెళితే.. భూపేంద్ర మాత్రం మూడు నెలల క్రితమే జమ్ముకశ్మీర్ కు వెళ్లినట్లుగా గుర్తించారు.

ఈ దారుణ విషాద ఉదంతాన్ని సంచలనం కోసమో.. మరే ఇతర అజెండాతో కాకుండా.. వాస్తవాలకు దగ్గరగా.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. అసలేం జరిగింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా అంతే కీలకం. గడిచిన కొన్నేళ్లుగా భారతదేశంలో ఒకలాంటి తప్పుడు విధానం ఎక్కువగా అమలవుతోంది. ఇందుకు మీడియా సంస్థలు తమదైన పాత్రను పోషించటం ఒక విషాదంగా చెప్పాలి.

తాజా ఉదంతాన్నే తీసుకుంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. అదేమంటే.. వలస కూలీలు హత్యకు గురి కావటం కఠిన వాస్తవమైతే.. ఆ ఘోరం ఎలా జరిగింది? అందుకు బాధ్యులు ఎవరు? ఈ హత్యల వెనుక అజెండా ఏంటి? ఏ ఉద్దేశంతో ఈ దారుణం చోటు చేసుకుంది? అన్నది అత్యంత కీలక ప్రశ్నలు. ఈ లోతుల్లోకి వెళితే.. తొలుత స్థానిక కశ్మీరీ మీడియా సంస్థలు ఈ ఉదంతాన్ని ఎలా రిపోర్టు చేశాయి? అన్న విషయంలోకి వెళితే.. పాకిస్థాన్ మద్దతుతో పని చేస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లుగా పేరకొన్నారు. పోలీసు రికార్డుల్లో లేని.. సాధారణ పౌరుల మాదిరి తిరిగే హైబ్రిడ్ ఉగ్రవాదులు ఈ పిరికిపంద చర్యకు పాల్పడి ఉంటారని పేర్కొన్నారు.

అమర్ నాత్ యాత్ర విజయవంతంగా సాగుతున్న వేళ.. కశ్మీరీ వ్యాలీలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న నమ్మకాన్ని చెరిపివేసేందుకు ఉగ్రవాదులు ఈ లక్షిత దాడికి పాల్పడినట్లుగా కశ్మీరీ మీడియా విశ్లేషించింది. అదే సమయంలో బాధితుల కుటుంబాలు ఆరోపించిన ‘మతం.. కులం అడిగి చంపారు’ అనే అంశంపై మాత్రం కశ్మీరీ మీడియా సంస్థలు తమ కథనాల్లో ప్రస్తావించలేదు. అధికార యంత్రాంగం ఏదీ కూడా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన జారీ చేయకపోవటాన్ని చెబుతున్నారు.

స్థానికేతర వలస కార్మికులపై జరిగిన దాడిగానే కశ్మీరీ మీడియా రిపోర్టు చేసింది. జాతీయ మీడియాతో పాటు.. పలు ప్రాంతీయ మీడియాలో మాత్రం భిన్న కోణాల్లో రిపోర్టు కావటం గమనార్హం. అయితే.. ఈ ఉదంతంపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్.. విపక్ష నేత మొదలుకొని పలువురు నాయకులు ఈ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో పలువురు నిరసన ర్యాలీలు నిర్వహించారు. అయితే.. మతం పేరు అడిగి చంపారు? అన్న అంశాన్ని మాత్రం ఎవరూ హైలెట్ చేయలేదు. వలస కూలీలను చంపేయటాన్ని మాత్రం తీవ్రంగా తప్పు పట్టిన ధోరణి కనిపిస్తుంది.

అదే సమయంలో బాధితుల స్వరాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ లో అక్కడి మీడియా ఎలా స్పందించింది? అన్న అంశంలోకి వెళితే.. ఉగ్రవాదులు ఇద్దరు వలస కార్మికులను చంపేసే ముందు వారి పేర్లు.. వారి కులం.. మతం వివరాల్ని అడిగి తెలుసుకున్న తర్వాతే చంపేసినట్లుగా బాధితుల్లో ఒకరైన దీపక్ తల్లి కన్నీరుమున్నీరు అవుతూ చెప్పిన మాటల్ని ఛత్తీస్ గఢ్ మీడియా ప్రచురించింది. అక్కడ ఉన్న ఇతర కార్మికుల్లో హిందువులైన వీరిద్దరినే ఏరికోరి చంపారనే ఆరోపణల్ని ఛత్తీస్ గఢ్ మీడియా సంస్థలు హైలెట్ చేయటం కనిపిస్తుంది.

అంతేకాదు.. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన దీపక్.. భూపేంద్ర కుటుంబాలు ఎంతటి తీవ్రమైన పేదరికంతో ఉన్నారన్న అంశంతో పాటు.. పని కోసం వలస వెళితే.. ప్రాణాలు తీసిన వైనాన్ని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరైన అంశాలకు పెద్దపీట వేయటం కనిపిస్తుంది.అంతేకాదు.. ఉపాధి కోసం వెళ్లిన ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకొని వచ్చిన అంశంపై స్థానికంగా వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని మీడియా ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం కనిపిస్తుంది. మరో కీలక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. వలస కూలీల హత్యపై కశ్మీరీ ప్రజలు ఉగ్రవాద చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న అంశంతో పాటు.. గాయపడిన వారికి స్థానికులే అండగా నిలిచారన్న అంశాన్ని చూపిస్తూ.. కశ్మీరీల సంప్రదాయ తీరును హైలెట్ చేసేలా కశ్మీరీ మీడియా వ్యవహరించిందన్న మాట వినిపిస్తోంది.

అదే సమయంలో కశ్మీర్ లోని రాజకీయ పార్టీలు మొదలు పౌర సమాజం వరకు అందరూ వలస కూలీల్ని హత్య చేసిన వైనాన్ని ఖండించటం.. నిరసనల్ని వ్యక్తం చేయటం.. వారి కుటుంబాలకు సంఘీభావాన్ని తెలిపేలా వ్యవహరించారని చెప్పాలి. ఇక్కడ కశ్మీర్ లోని మీడియా సంస్థలకు ఉన్న పరిమితులను ప్రస్తావించాల్సిందే. ఓవైపు ఉగ్రవాదుల నుంచి ప్రాణభయం.. మరోవైపు ప్రభుతవ నిఘా సంస్థల ఆంక్షల మధ్య వారు పని చేయాల్సి ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వేళ.. సగటు కశ్మీరీలు సోషల్ మీడియాలో ఎలా స్పందిస్తున్నారన్న అంశాన్ని చూడటం ద్వారా.. అక్కడి పరిస్థితుల్ని అర్థం చేసుకునే వీలుంది.

ఇటీవల కాలంలో ఒక దరిద్రగొట్టు ట్రెండ్ నడుస్తోంది. బాధితులు ఎవరైనా ప్రముఖులు అయితే స్పందించే అంశంలో చూపే ఉత్సాహం.. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారి విషయంలో పెద్దగా ఆసక్తి వ్యక్తాని పరిస్థితి. ఈ విషాద ఉదంతంలోనూ అదే జరిగింది. దేశంలోని ఇతర సోషల్ మీడియా ఖాతాల్లోనే కాదు కశ్మీరీల సోషల్ మీడియాఖాతాల్లోనూ ఈ విషాద ఉదంతానికి తగిన రీతిలో స్పందించని వైనం కనిపిస్తుంది. ఇదే ఏ ఉన్నత ఆదాయ వర్గాలకు చెందిన వారు బాధితులుగా మారితే స్పందించే తీరులో తేడా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

ఈ ఉదంతంపై జమ్ము కశ్మీర్ ప్రభుత్వంతో పాటు.. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించటం.. వారికి పరిహారం కింద రూ.20 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించగా.. జమ్ముకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి పరిహారాన్ని చెల్లిస్తానని ప్రకటించాయి. అంతేకాదు.. మృతుల భౌతిక కాయాలను జమ్ముకశ్మీర్ నుంచి ఛత్తీస్ గఢ్ లోని వారి సొంతూర్లకు పంపే విషయంలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం వేగంగా స్పందించటమే కాదు.. బాధ్యతగా వ్యవహరించిందని చెప్పాలి. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం పైతం బాధిత కుటుంబాలకు అండగా నిలవటం కనిపిస్తుంది.

జాతీయ మీడియా విషయానికి వస్తే.. మిశ్రమ ధోరణి కనిపిస్తుంది. జమ్ముకశ్మీర్ లో ఇద్దరు వలస కూలీల్ని హత్య చేశారన్న అంశంతో పాటు.. ఉగ్రవాదుల దాడిలో జరిగిందన్న అంశానికే ప్రాధాన్యత ఇచ్చారు. అంతే తప్పించి.. చంపే ముందు వారి పేర్లు.. కులం.. మతాన్ని అడిగి చంపేశారన్న అంశాన్ని మాత్రం హైలెట్ చేయలేదు. విచిత్రమైన అంశం ఏమంటే.. జాతీయ మీడియాకు చెందిన కొన్ని మీడియా సంస్థలు అధికారిక ప్రకటనను రిపోర్టు చేయగా.. ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు మాత్రం బాధిత కుటుంబాల వాదనను కూడా హైలెట్ చేసింది. ఆ సందర్భంగా ఆ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు మాత్రమే వెల్లడించారన్న స్పష్టత ఇవ్వటం కనిపిస్తుంది.

అదే సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ మీడియా ఎలా స్పందించింది? అన్న అంశంలోకి వెళితే.. కశ్మీర్ కు పొరుగున ఉన్న రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలు ఈ దాడిని భద్రతాపరమైన హెచ్చరికగా రిపోర్టు చేశాయి. ఈ దాడికి డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా జరుగుతుందన్న అంశాల్ని ప్రస్తావించారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి వెళ్లే వలస కూలీలు.. ముడిసరుకులు తీసుకువెళ్లే లారీ డ్రైవర్ల రక్షణ మీద ఆందోళన వ్యక్తం చేసేలా రిపోర్టు చేశాయి. కశ్మీర్ కు అత్యధికంగా కూలీలు వెళ్లే రాష్ట్రాలైన బిహార్.. యూపీలకు చెందిన మీడియా సంస్థలు ఈ ఘటనకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చాయి. వలస కార్మికుల భద్రత మీద ఆందోళన వ్యక్తం చేసేలా కథనాలు ఉన్నాయి. దక్షిణాదికి చెందిన పలు మీడియా సంస్థలు ఈ ఘటనకు కొంతమేర ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే..పేర్లు.. మతం వివరాలు అడిగి హత్య చేశారన్న అంశాన్ని హైలెట్ చేయటం కనిపిస్తుంది.

ఈ అంశానికి సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఈ విషాద ఉదంతాన్ని జాతీయ మీడియా కొంతమేర ఫోకస్ చేసినా.. ప్రాధాన్యత మరిచారు. ప్రాంతీయ మీడియా సంస్థలు కూడా అలాంటి తీరునే ప్రదర్శించారని చెప్పాలి. కొన్ని రాష్ట్రాలకు చెందిన మీడియా సంస్థల్ని మినహాయిస్తే.. అందరూ విషయాన్ని ఎవరికి తగ్గట్లు వారు పబ్లిష్ చేయటం కనిపిస్తుంది. అందరూ వదిలేసిన ఒక కీలక అంశం ఒకటి చోటు చేసుకుంది. అదేమంటే.. మతంతో సంబంధం లేకుండా ఉగ్రవాదాన్ని కశ్మీరీలు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నారు. అందుకు తాజా విషాద ఉదంతం ఒకటి స్పష్టం చేసిందన్న విషయాన్ని మాత్రం అందరూ వదిలేయటం గమనార్హం.

ఈ ఘటనను నిరసిస్తూ స్థానిక ముస్లింలు రోడ్లపైకి వచ్చి చేసిన నిరసన ప్రదర్శనలకు చెందిన ఫోటోలను కానీ.. కశ్మీరీ పౌర సమాజం వ్యక్తం చేసిన సంఘీభావం.. ఆవేదనను మాత్రం అందరూ వదిలేయటం విచారకరంగా చెప్పక తప్పదు. సాధారణంగా జాతీయ మీడియా మొదలుకొని ప్రాంతీయ మీడియా సంస్థల రిపోర్టులు అన్ని కూడా ఉగ్రవాదానికి కశ్మీరీల మద్దతు ఉందన్నట్లుగా వ్యవహరిస్తారు. అలాంటిదేమీ లేదు. ఆ భావన తప్పు. వారు సైతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారన్న నిజాన్ని దేశ ప్రజలకు.. ప్రపంచానికి చెప్పే ఒక అసలుసిసలైన నిజాన్ని చెప్పలేకపోయిన పరిస్థితి. వాస్తవాల్ని వాస్తవాలుగా చెప్పాలని ఆశించే అందరూ ఆవేదనకు గురయ్యే అంశంగా దీన్ని చెప్పాలి.