Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులోకి నన్ను లాగొద్దు.. లాగితే లీగల్ యాక్షన్: కేటీఆర్ హెచ్చరిక

తనను ప్రతి డ్రగ్స్‌ కేసులోకి లాగడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన ఇకపై అలా చేస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

By:  A.N.Kumar   |   15 March 2026 5:35 PM IST
డ్రగ్స్ కేసులోకి నన్ను లాగొద్దు.. లాగితే లీగల్ యాక్షన్: కేటీఆర్ హెచ్చరిక
X

హైదరాబాద్ రాజకీయాల్లో మరోసారి డ్రగ్స్‌ కేసు చర్చనీయాంశమైంది. మొయినాబాద్‌లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ పార్టీ కేసు నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తనను ప్రతి డ్రగ్స్‌ కేసులోకి లాగడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన ఇకపై అలా చేస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన డ్రగ్స్‌ పార్టీ కేసులో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు వెలుగులోకి రావడంతో రాజకీయంగా చర్చలు ముదిరాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ నాయకులు, ముఖ్యంగా టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. కేటీఆర్‌.. ఆయన అనుచరులు కూడా డ్రగ్స్‌ వాడుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ అవసరమైతే డ్రగ్స్‌ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచించారు.

ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన కేటీఆర్‌ స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. “డ్రగ్స్‌ కేసు తెరపైకి వచ్చిన ప్రతిసారి బీఆర్‌ఎస్‌ పార్టీని లాగడం దారుణం. వ్యక్తిగతంగా నేను డ్రగ్స్‌ వాడకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, డ్రగ్స్‌ వినియోగం వంటి వాటిని బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తుంది” అని ఆయన అన్నారు. డ్రగ్స్‌ వాడకం ఎంత పెద్ద వ్యక్తి చేసినా కఠినంగా శిక్షించాల్సిందేనని కూడా ఆయన స్పష్టం చేశారు.

డ్రగ్స్‌ టెస్టుల విషయంలో కూడా తన వైఖరిని కేటీఆర్‌ వెల్లడించారు. ప్రజాప్రతినిధులు డ్రగ్స్‌ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. “నేను ఎలాంటి పరీక్షకైనా సిద్ధమే. ఇప్పటికే పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పాను. అవసరమైతే డ్రగ్స్‌ టెస్టు చేయించుకోవడానికీ సిద్ధంగా ఉన్నాను. ప్రజాప్రతినిధులంతా కూడా టెస్టులు చేయించుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలి” అని పేర్కొన్నారు.

అయితే తనను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్‌ కేసుల్లోకి లాగడం సరైంది కాదని కేటీఆర్‌ అన్నారు. “ఎవరికైనా రాజకీయంగా విమర్శలు చేయాలంటే ఆధారాలతో మాట్లాడాలి. నిరాధార ఆరోపణలు చేస్తూ నా పేరును డ్రగ్స్‌ కేసులోకి లాగితే చట్టపరంగా నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు ముదురుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. డ్రగ్స్‌ కేసు దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో నాయకుల వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో డ్రగ్స్‌ కేసు విచారణ ఎటువంటి మలుపు తిరుగుతుందో, అలాగే రాజకీయంగా ఈ వ్యవహారం ఎలా ప్రభావం చూపుతుందో అనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.