Begin typing your search above and press return to search.

బండి సంజయ్‌పై కేసు వేస్తానన్న కేటీఆర్

బండి సంజయ్ విమర్శలపై మరింతగా స్పందించిన కేటీఆర్, "రాజకీయ ఉనికికోసం రోడ్లపై చౌకబారు నాటకం ఆడుతున్నారు.

By:  A.N.Kumar   |   9 Aug 2025 1:24 AM IST
బండి సంజయ్‌పై కేసు వేస్తానన్న కేటీఆర్
X

తెలంగాణలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలు హద్దు మీరాయని, అవి నిరాధారమైన ఆరోపణలని వ్యాఖ్యానించారు.

కేటీఆర్ హెచ్చరికల ప్రకారం.. "48 గంటల్లో బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే, లీగల్ నోటీసులు పంపి కోర్టులో కేసు వేస్తాను" అని స్పష్టం చేశారు.

-ఇంటెలిజెన్స్‌ వ్యవస్థపై అవగాహన లేదన్న విమర్శ

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంజయ్ చేసిన ఆరోపణలపై స్పందించిన కేటీఆర్.. "ఇంటెలిజెన్స్‌ ఎలా పని చేస్తుందో కూడా ఆయనకు తెలియదు. హోంమంత్రి పదవిలో ఉన్నా ఆయనకు కనీస అవగాహన లేదు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎవరైనా ఇలాంటివి నిరాధార ఆరోపణలు చేస్తే, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- రాజకీయ ఉనికికి చౌకబారు నాటకం

బండి సంజయ్ విమర్శలపై మరింతగా స్పందించిన కేటీఆర్, "రాజకీయ ఉనికికోసం రోడ్లపై చౌకబారు నాటకం ఆడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలు చేస్తున్నారంటే అది దిగజారిన రాజకీయపు సంకేతం" అని విరుచుకుపడ్డారు.

- సవాల్ విసిరిన కేటీఆర్

"ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బండి సంజయ్ అంటున్నారు కదా.. అయితే ఆ ఆరోపణలు నిజమేనని నిరూపించాలి. లేకపోతే వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను" అని కేటీఆర్ ఘాటుగా హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఎలా స్పందిస్తారు? ఆయనపై వాస్తవంగానే లీగల్ నోటీసులు పంపుతారా? అనే ఆసక్తికర పరిస్థితి రాజకీయంగా నెలకొంది. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.