హీరోయిన్లతో లింకులు.. డ్రగ్స్ ఆరోపణలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. నిజం చివరకు గెలుస్తుందంటూ ఆవేదన!
ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
By: A.N.Kumar | 27 Jun 2026 12:39 PM ISTబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న దుష్ప్రచారంపై మరోసారి తీవ్రస్థాయిలో స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే, కొందరు ప్రత్యర్థులు తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అభాసుపాలు చేసేందుకు కుట్రలు పన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
వ్యక్తిత్వ హననమే ధ్యేయంగా దుష్ప్రచారం
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ.. వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తన ఎదుగుదలను ఓర్వలేక, రాజకీయంగా తలపడే ధైర్యం లేక కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మొదట్లో వీటిని తాను పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే సమాజంలో అది నిజమనే భావన కలిగే ప్రమాదం ఉందని గుర్తించానన్నారు. సోషల్ మీడియా వేదికగా పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారాన్ని విస్తరించారని ఆయన ఆరోపించారు. "జీవితంలో నేను కనీసం ఒక సిగరెట్ కూడా తాగలేదు. అలాంటి నాపై డ్రగ్స్ తీసుకుంటున్నానంటూ నానా యాగి చేశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?" అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మంత్రులు కూడా మాట్లాడటం బాధాకరం..
తనపై కేవలం డ్రగ్స్ ఆరోపణలే కాకుండా మరికొన్ని సంచలన లీకులతో బురదజల్లే ప్రయత్నం చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డానని, అలాగే సినీ హీరోయిన్లతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నానంటూ అసత్య ప్రచారాలు సృష్టించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. "కేవలం సోషల్ మీడియాలో ఉండే అనామక కార్యకర్తలే కాకుండా బాధ్యతాయుతమైన పదవుల్లో, అధికారంలో ఉన్న కొందరు మంత్రులు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయడం నాకు తీవ్ర బాధను కలిగించింది" అని అన్నారు.
ప్రజా సమస్యలను పక్కనబెట్టే రాజకీయం!
ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు ప్రజల సమస్యలు, నిరుద్యోగం, అభివృద్ధి వంటి అంశాలపై చర్చించాల్సింది పోయి.. వ్యక్తిగత దూషణలకు, కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇవ్వడం విచారకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆధారాలు లేని ఆరోపణల వల్ల ప్రజల్లో అనవసరపు అపోహలు పెరుగుతాయని, ఇది రాజకీయాల స్థాయిని దిగజారుస్తుందని హెచ్చరించారు.
నిజం చివరకు గెలుస్తుంది!
తనపై వచ్చిన ఆరోపణల్లో ఒక్కదానికి కూడా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని కేటీఆర్ స్పష్టం చేశారు. "సత్యానికి కాస్త సమయం పట్టవచ్చు.. కానీ వాస్తవాలు ఎప్పటికైనా బయటపడతాయి. నిజం చివరకు గెలుస్తుందనే నమ్మకం నాకు బలంగా ఉంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు ప్రచారాలను, పెయిడ్ ఆర్టికల్స్‌ను గుడ్డిగా నమ్మకుండా వాటి వెనకున్న నిజానిజాలను పరిశీలించాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
