సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. చెల్లిపై నో కామెంట్!
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్.. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో శనివారం పర్యటించారు.
By: Garuda Media | 27 April 2026 4:00 AM ISTబీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్.. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో శనివారం పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటలకు నియోజకవర్గానికి వచ్చిన ఆయన.. ఇక్కడి రైతులతో మాట్లాడారు. అంతేకాదు.. నేరుగా ధాన్యం కోతలు జరుగుతున్న పొలాల వద్దకు వెళ్లి మహిళా రైతులతో ముచ్చట్లు చెప్పారు. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని.. రైతులు చెప్పగా.. వచ్చే రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుందని.. అప్పుడు రైతులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దాదాపు 3 గంటల పాటు ఆయన కల్లాల్లోనే కలియదిరిగారు. మహిళా రైతులతో చేతిలో వేసి మరీ మాట్లాడారు.
అయితే.. అదేసమయంలో మాజీ సీఎం కేసీఆర్ తనయ, కేటీఆర్ సోదరి కవిత సొంత పార్టీ ప్రకటన చేయడం.. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రధాన మీడియాలో కవిత ప్రసంగంలోని హైలెట్లు రిపీటెడ్‌గా వస్తున్నాయి. ఈ విషయం పెద్ద ఎత్తున చర్చగా మారింది. అయితే.. ఇంత జరుగుతున్నా.. కేటీఆర్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. వాస్తవానికి ఆయన రైతులతో ముచ్చటిస్తున్న సమయంలోనే పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు అక్కడకు వచ్చారు. కేటీఆర్ ఎలా స్పందిస్తారు? కవిత పార్టీపై ఏమంటారు? అని ఎదురు చూశారు.
దాదాపు గంటన్నర సేపు ఎదురు చూసినా.. కేటీఆర్ మాత్రం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అంతేకాదు.. అసలు కవిత గురించిన ప్రస్తావన కూడా చేయలేదు. ఈ పరిణామంతో అందరూ విస్మయానికి గురయ్యారు. వాస్తవానికి కవిత తీవ్రస్థాయిలో బీఆర్ ఎస్‌ను, కేసీఆర్‌ను కూడా టార్గెట్ చేశారు. వీటికితోడు టీఆర్ ఎస్ పేరును ఆమె తీసుకున్నారు(ఇంగ్లీష్ పదాలు). ఇంత జరిగిన తర్వాత.. కేటీఆర్ సహజంగానే స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన మౌనంగా వెళ్లిపోయారు. అయితే.. రైతులతో మాట్లాడేటప్పుడు మాత్రం ఉత్సాహంగా కనిపించారు. కానీ.. మీడియాపలకరించినా.. ఆయన గాలిలోకి చేతులు ఊపుతూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
కేసీఆర్ వద్దన్నారా?
ఈ పరిణామంపై అనేక చర్చలు సాగుతున్నాయి. బీఆర్ ఎస్ అధినేతగా కేసీఆర్.. ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నట్టు తెలిసిం ది. కవిత పార్టీ వ్యవహారంపై ఎవరూ స్పందించరాదని ఆయన పరోక్షంగా ఆదేశాలు ఇచ్చినట్టు చర్చ సాగుతోంది. ఎందుకంటే.. కవిత పార్టీపై బీజేపీ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. కానీ, బీఆర్ ఎస్ పార్టీ తరఫున ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా స్పందించలేదు. మీడియా ముందుకు రాలేదు. సోషల్ మీడియాలోనూ ఎలాంటి కామెంట్లు పెట్టలేదు. ఒక్క బీఆర్ ఎస్ అధికారిక ట్విట్టర్‌లో మాత్రం.. `ఒరిజినల్.. ఒరిజినలే`` అంటూ కోల్గేట్ పేస్టు, వాటర్ బాటిళ్లను పోలుస్తూ.. పోస్టు పెట్టారు. ఇంతకుమించి పన్నెత్తు మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.
