Begin typing your search above and press return to search.

అమ్మా.. నాన్న.. ఓ కేటీఆర్ బాధ

తల్లిదండ్రుల కలలు.. పిల్లల కెరీర్ గోల్స్.. ఈ రెండింటి మధ్య సాగే ‘నలిగిపోయే’ ప్రయాణం సామాన్యులకే కాదు, రాజకీయ ఉద్ధండులకు కూడా తప్పలేదని తాజా ఉదంతం నిరూపిస్తోంది.

By:  A.N.Kumar   |   30 April 2026 12:00 PM IST
అమ్మా.. నాన్న.. ఓ కేటీఆర్ బాధ
X

తల్లిదండ్రుల కలలు.. పిల్లల కెరీర్ గోల్స్.. ఈ రెండింటి మధ్య సాగే ‘నలిగిపోయే’ ప్రయాణం సామాన్యులకే కాదు, రాజకీయ ఉద్ధండులకు కూడా తప్పలేదని తాజా ఉదంతం నిరూపిస్తోంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వ్యక్తిగత జీవితంలోని ఒక ఆసక్తికరమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ ఒక తరం పడిన ఇబ్బందిని కళ్ళకు కట్టారు.

ప్రతి ఇంట్లో ఉండే సీనే అది. "నా కొడుకు డాక్టర్ కావాలి" అని అమ్మ, "కాదు.. నా కొడుకు కలెక్టర్ కావాలి" అని నాన్న. ఈ ఇద్దరి అంచనాల మధ్య చిక్కుకున్న ఒక సగటు యువకుడిలాగే కేటీఆర్ కూడా ఒకప్పుడు తీవ్ర మానసిక మథనానికి గురయ్యారు. ఒకవైపు తల్లి శోభమ్మ గారు తన కొడుకును తెల్ల కోటు వేసుకున్న వైద్యుడిగా చూడాలని కలలుగంటే.. మరోవైపు కేసీఆర్ తన వారసుడు ఐఏఎస్ ఆఫీసర్‌గా దేశాన్ని ఏలాలని ఆకాంక్షించారు.

ఆ ఒక్క నిర్ణయం.. జీవితాన్ని మార్చేసింది!

అమ్మ కోరికను గౌరవిస్తూ కేటీఆర్ వైద్య విద్య వైపు అడుగులు వేశారు. దాని కోసం పట్టుదలతో కర్ణాటకలో 'కే-సెట్' రాసి, ర్యాంకు కూడా సాధించారు. సంబరంగా వెళ్లి నాన్నకు విషయం చెప్పారు.. కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది.

కేసీఆర్ తనదైన శైలిలో కొడుకుకు క్లాస్ తీసుకున్నారు. "డాక్టర్ అవుతావా సరే.. కానీ ఒక విషయం గుర్తుంచుకో! 32 ఏళ్లు వచ్చే వరకు చదువుతూనే ఉండాలి. ఎంబీబీఎస్, ఎండీ, సూపర్ స్పెషాలిటీ.. ఇలా చదువుకు అంతం ఉండదు. పైగా అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా ప్రాణాలు కాపాడటానికి పరుగెత్తాలి. నీకంటూ సొంత సమయం ఉండదు, సుఖం ఉండదు. నీకు ఇది ఓకేనా?" ఈ మాటలు కేటీఆర్ ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. అమ్మ కోరికకు.. నాన్న లాజిక్కుకు మధ్య నలిగిపోయిన ఆయన, చివరకు మెడిసిన్ వదిలి మైక్రో బయాలజీ వైపు మళ్లారు. ఆపై అమెరికా ప్రయాణం, కార్పొరేట్ ఉద్యోగం.. చివరికి రాజకీయాల్లోకి రావడం అంతా ఒక చరిత్ర.

నేటి తరానికి కేటీఆర్ ఇచ్చే సందేశం ఇదే!

ఈ కథ కేవలం ఒక రాజకీయ నాయకుడి గతం మాత్రమే కాదు.. నేటి తరం తల్లిదండ్రులకు ఒక గుణపాఠం. తల్లిదండ్రులు తాము సాధించలేనిది పిల్లలపై రుద్దడం వల్ల వారి సహజ సిద్ధమైన ప్రతిభ మరుగున పడిపోతుంది. మిడిల్ క్లాస్ నుండి హై క్లాస్ వరకు ప్రతి ఇంట్లో డాక్టర్, ఇంజనీర్ లేదా ఐఏఎస్ అనే మూడు ఆప్షన్ల మధ్యే పిల్లల భవిష్యత్తును బందీ చేస్తున్నారు. కేటీఆర్ పరోక్షంగా చెప్పినట్లు.. పిల్లల ఆసక్తి ఎక్కడ ఉందో గుర్తించి, ఆ మార్గంలో వారిని నడిపిస్తేనే వారు అద్భుతాలు సృష్టించగలరు.

ఏది ఏమైనా ఆనాడు కేటీఆర్ డాక్టర్ అయ్యి ఉంటే ఒక మంచి వైద్యుడిని చూసేవాళ్లమేమో గానీ.. నేడు తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఒక 'డైనమిక్ లీడర్'ను మాత్రం కోల్పోయేవాళ్లం. తల్లిదండ్రుల కలల మధ్య నలిగిపోకుండా తనకంటూ ఒక సొంత మార్గాన్ని వెతుక్కున్న కేటీఆర్ ప్రయాణం నిజంగా ఆలోచింపజేసేదే!