Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ భారీ స్కాం.. కేటీఆర్ చూపిస్తున్న ఆధారాలేంటి?

దివాలా తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి వేలాది కోట్ల రూపాయిల ప్రాజెక్టులు కట్టబెడుతున్నట్లుగా ఆరోపించారు.

By:  Garuda Media   |   4 Feb 2026 10:30 PM IST
సీఎం రేవంత్ భారీ స్కాం.. కేటీఆర్ చూపిస్తున్న ఆధారాలేంటి?
X

సంచలనానికి తెర తీశారు బీఆర్ఎస్ కీలక నేత.. మాజీ ముఖ్యమంత్రి తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన షాకింగ్ ఆరోపణలు చేశారు. గడిచిన రెండు వారాలుగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఒకరి తర్వాత ఒకరు చొప్పున సిట్ విచారణను ఎదుర్కొంటున్న వేళ.. కేటీఆర్ ఈ రోజు (బుధవారం) ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. గడిచిన వారం రోజులుగా తమను వరుసగా విచారణకు పిలుస్తుంటే తమకు సందేహం వచ్చిందని.. తవ్వితే ఒక స్కాం బయటకు వచ్చిందన్నారు.

దివాలా తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి వేలాది కోట్ల రూపాయిల ప్రాజెక్టులు కట్టబెడుతున్నట్లుగా ఆరోపించారు. గడిచిన రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత జరిగిన పలు స్కాంలను బయటపెడుతున్నామని.. తాజాగా మరో స్కాంను తాము బయటపెడుతున్నట్లు చెప్పారు. డైవర్షన్ కోసమే తమను విచారణకు పిలుస్తున్నట్లుగా పేర్కొన్నారు.

కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా కంపెనీ సీఎం రేవంత్ బినామీ కంపెనీగా కేటీఆర్ ఆరోపించారు. గతంలో రేవంత్ వాడిన కారు కూడా ఈ కంపెనీ పేరు మీదనే ఉందన్న ఆయన.. ఆ కారును నెంబరు (టీఎస్ వో7 ఎఫ్ఎఫ్0009) పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఈ కారులోనే తిరిగారన్న కేటీఆర్.. ఆ కారు ఎవరి పేరు మీదన రిజిస్టర్ అయ్యిందో తెలుసా? అంటూ.. కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా కంపెనీ పేరు వెల్లడించారు. ఇది దాదాపు రూ.2.5కోట్లు విలువ చేసే కారుగా కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ కంపెనీకి అనేక ప్రాజెక్టులు వచ్చాయని.. ఈ కంపెనీ మీద 2018లో ఐటీ దాడులు జరిగినట్లు చెప్పారు.

2023లో ఈ కంపెనీ దివాళా తీసిందన్న కేటీఆర్.. ‘‘వాళ్ల దగ్గర సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవు అలాంటి కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు ఇవ్వటమేంటి? ఈ కంపెనీకి కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారని సుప్రీంకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఈ కంపెనీ అవకతవకలపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాని జనవరి 23న సుప్రీంకోర్టు ఆదేశించింది. దివాళా తీసిన కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు ఎలా ఇచ్చారో సీఎం రేవంత్ చెప్పాలి’’ అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.

సంచల స్కాం అంటూ కేటీఆర్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు బలపరిచేలా కొన్ని ఆధారాలు చూపించారు. కారుకు సంబంధించిన ఫోటోలు, ఆధారాలతో పాటు.. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ కారు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి పేరు మీద మారిందన్నారు. ఆ కంపెనీకి ప్రభుత్వం రూ.6వేల కోట్ల విలువైన పనులను అప్పగించినట్లుగా చూపే అధికారిక రికార్డులను.. కంపెనీకి సంబంధించినకొన్ని డాక్యుమెంట్లను ప్రదర్శించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ ఎలా రియాక్టు అవుతారో.. వీటికి ఏ సమాధానాలు ఇస్తారో చూడాలి.