పాదయాత్ర ప్రకటనతో కేటీఆర్ సంచలనం.. పవన్, కాంగ్రెస్‌లపై పదునైన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
By: A.N.Kumar | 3 Jun 2026 1:22 PM ISTతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేటీఆర్ అదే సమయంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలు అటు ఏపీ, ఇటు తెలంగాణలో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి.
మాకు కేసీఆర్ చాలు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్..
ఇటీవల జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా తాము గౌరవిస్తామని, ఆయన ఏపీ ఉపముఖ్యమంత్రి మాత్రమే కాకుండా తమకు ఒక సోదరుడిలాంటి వాడని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే రాజకీయాల విషయానికి వస్తే మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
"పవన్ కల్యాణ్ గారు మా ఇంటికి వస్తే మర్యాదగా బిర్యానీ పెట్టి ఆతిథ్యం ఇస్తాం. కానీ తెలంగాణ రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోం. మాకు మా తెలంగాణలో ఒరిజినల్ నాయకుడు కేసీఆర్ ఉన్నారు, ఆయనే మాకు చాలు." అని కేటీఆర్ అన్నారు.
పవన్ కల్యాణ్ గతంలో అన్న “మీ అయ్య జాగీరా?” అనే మాటలను ప్రస్తావిస్తూ... తెలంగాణ ఎవరి జాగీరు కాదని.. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సొత్తని కేటీఆర్ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎందరో నాయకులు, సెలబ్రిటీల కుటుంబాలు, వ్యాపారాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని, ఇక్కడ వారికి ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా అని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతి, జనగణమన గురించి తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. తెలంగాణలో జనసేన పోటీ చేయడంపై తమకేం అభ్యంతరం లేదని.. 2023 ఎన్నికల్లోనూ వారు పోటీ చేశారని.. అయితే ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవిస్తూ మాట్లాడాలని హితవు పలికారు. ఊహాజనిత ప్రభంజనాలు సృష్టించుకోవద్దని పవన్‌కు సూచించారు.
వచ్చే ఏడాది కేటీఆర్ పాదయాత్ర!
రాష్ట్రంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపేలా కేటీఆర్ ఒక కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి తాను రాష్ట్రవ్యాప్తంగా భారీ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ప్రజల్లోనే ఉంటూ, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో నేరుగా తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ యాత్ర ఒక వేదిక కానుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పాదయాత్ర ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు రానున్న రోజుల్లో మరింత ఉత్కంఠభరితంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణ కథలో నంబర్ వన్ విలన్ కాంగ్రెస్
ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ.. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే "మూడు నెలల్లోనే పిల్లలు పుడతారా?" అని సీఎం అంటున్నారని ఒకవేళ 30 నెలలైనా ఎలాంటి ఫలితాలు కనిపించకపోతే ప్రజలు మిమ్మల్ని ఏమని పిలవాలని ఎద్దేవా చేశారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ ఎంతో కష్టపడి నిర్మించిన బంగారు తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కొన్ని నెలల్లోనే సర్వనాశనం చేసిందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కూడా కేటీఆర్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు.. కానీ ఆ పరిస్థితిని బలవంతంగా తీసుకొచ్చింది మాత్రం కేసీఆర్ చేసిన అమరణ నిరాహార దీక్ష, ఉద్యమ పోరాటమేనని స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల పాత్ర మరువలేనిదని కొనియాడారు. "ప్రతి కథలో ఒక హీరో, ఒక విలన్ ఉంటారు. తెలంగాణ సాధన కథలో కేసీఆర్ హీరో అయితే... నంబర్ వన్ విలన్ మాత్రం కాంగ్రెస్ పార్టీనే" అని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముప్పై ఏళ్ల పాటు తెలంగాణను వెనుకబాటుకు గురిచేసింది కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు.
మొత్తంమీద పవన్ వ్యాఖ్యల సందర్భంగా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకేసారి డిఫెన్స్‌లో పడేశాయి. రానున్న రోజుల్లో కేటీఆర్ చేపట్టబోయే పాదయాత్ర, బీఆర్ఎస్ పార్టీ తీసుకోబోయే పొలిటికల్ స్టాండ్ తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.
