సారీలు చెప్పేవారు ఇంకా క్యూలో ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్ స్పందన
కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనను తాను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని కేటీఆర్ వెల్లడించారు.
By: A.N.Kumar | 29 Oct 2026 6:03 PM ISTతెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన వ్యక్తిగత ఆరోపణల వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. తనపై గతంలో చేసిన వ్యక్తిగత విమర్శలను ఉపసంహరించుకుంటున్నట్లు కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటించడం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
నిజం నిలకడ మీద తేలుతుంది : కేటీఆర్
కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్ స్పందిస్తూ.. "నిజం నిలకడ మీద తేలుతుంది" అని వ్యాఖ్యానించారు. తమపై రాజకీయ దురుద్దేశంతో చేసిన తప్పుడు ఆరోపణలు ఒక్కొక్కటిగా దూది పింజల్లా తేలిపోతున్నాయని అన్నారు. "మొన్న ఒక ప్రముఖ వార్తాపత్రిక క్షమాపణలు చెప్పింది.. నేడు ఈ మేడం (కొండా సురేఖ) తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.. రేపు మరెందరో ఈ దారిలోనే రాక తప్పదు. సారీ చెప్పేవాళ్లు ఇంకా చాలామంది క్యూలో ఉన్నారు" అని ధీమా వ్యక్తం చేశారు. తమను రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని.. కాలక్రమేణా నిజాయితీ గెలుస్తుందనడానికి ఈ పరిణామాలే నిదర్శనమని స్పష్టం చేశారు. "మొన్న పేపర్.. నేడు మేడం.. రేపు మరెందరో! తమపై తప్పుడు ఆరోపణలు చేసినవారు భవిష్యత్తులోనూ క్షమాపణలు చెప్పక తప్పదు." అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
న్యాయపరమైన చర్యలపై త్వరలోనే నిర్ణయం
కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనను తాను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని కేటీఆర్ వెల్లడించారు. ఆమె ట్వీట్లో ఏం పేర్కొన్నారో సమగ్రంగా పరిశీలించిన తర్వాత తన న్యాయవాదుల బృందంతో చర్చించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాతి లీగల్ చర్యలపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి కొండా సురేఖ ప్రకటనతో ఇక్కడితోనే ముగింపు పడుతుందా లేక న్యాయస్థానాల్లో ప్రక్రియ కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.
అసలు కొండా సురేఖ ట్వీట్లో ఏముంది?
అంతకుముందు కేటీఆర్‌ను ఉద్దేశించి కొండా సురేఖ సోషల్ మీడియాలో ఒక వివరణ ఇచ్చారు.. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని అంగీకరించారు. కేటీఆర్‌ను గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ వ్యక్తిగతంగా బాధపెట్టాలనే దురుద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన మాటల వల్ల కేటీఆర్ లేదా ఆయన కుటుంబం మనస్తాపానికి గురై ఉంటే చింతిస్తున్నట్లు చెబుతూ ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
వేడెక్కిన తెలంగాణ రాజకీయం
కొండా సురేఖ క్షమాపణల ప్రకటన ఒకవైపు వివాదానికి తెరదించేలా కనిపిస్తున్నప్పటికీ కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత ఆరోపణలకు మధ్య ఉండాల్సిన హద్దులు అవసరమంటూ కేటీఆర్ వ్యాఖ్యనించడం చర్చనీయాంశమైంది. కేటీఆర్ ప్రస్తావించిన "క్యూలో ఉన్నవారు ఎవరు?" అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో మరికొందరు నేతలు కూడా క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుంది అన్న కేటీఆర్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
