Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో 'బొగ్గు' మంట‌లు.. ఏంటీ వివాదం?

రాజ‌కీయంగా ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉండే తెలంగాణ‌లో తాజాగా.. బొగ్గు వివాదం రాజుకుంది.

By:  Garuda Media   |   30 Sept 2026 4:00 AM IST
తెలంగాణ‌లో బొగ్గు మంట‌లు.. ఏంటీ వివాదం?
X

రాజ‌కీయంగా ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉండే తెలంగాణ‌లో తాజాగా.. బొగ్గు వివాదం రాజుకుంది. బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌.. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. విదేశాల నుంచి బొగ్గును కొనుగోలుచేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డాన్ని ఆయ‌న తుగ్ల‌క్ నిర్ణ‌యంగా పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణ‌యాల‌తో రాష్ట్రం మ‌రింత అప్పుల ఊబిలోకి జారుకుంటుంద‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. సింగ‌రేణ్‌, మ‌హాన‌ది కోల్‌బ్లాక్స్‌(తెలంగాణ ప‌రిధిలోనే ఉంది) వంటి ఘ‌న‌మైన సంస్థ‌ల‌ను ప‌క్క‌న పెట్టి విదేశాల నుంచి బొగ్గును కొనుగోలు చేయ‌డం అంటే.. దోపిడీ నేన‌ని ఆయ‌న విమ‌ర్శించారు. దీంతో రాష్ట్రంలో బొగ్గు రాజ‌కీయం రాజుకుంది.

అసలేంటి? ఎందుకు?

రాష్ట్రంలో విద్యుత్ అవ‌స‌రాల‌కు నీరు, బొగ్గు అత్యంత కీల‌క‌వ‌న‌రుగా మారాయి. నీటి స‌మ‌స్య‌లు జోరుగా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్ప‌త్తి దిశ‌గా అడుగులు వేస్తోంది. దీంతో రోజుకు 80 వేల ట‌న్నుల మేర‌కు బొగ్గ‌ను జెన్‌కో సంస్థ‌లు వినియోగిస్తున్నాయి. దీని నుంచి ఉత్ప‌త్తి అయ్యే విద్యుత్‌ను ప‌రిశ్ర‌మ‌లు, ప్రాజెక్టుల అవ‌స‌రాల‌కు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్ర‌భావంతో ఇప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్‌కు ప్ర‌ధాన డిమాండ్ ఏర్ప‌డింది. దీనికితోడు.. రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికీక‌ర‌ణ పెరుగుతుండ‌డంతో విద్యుత్ వినియోగం కూడా అసాధార‌ణంగా పెరుగుతోంది. దీనిని చేరుకునేందుకు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్ప‌త్తి త‌ప్ప‌నిస‌రి అయింది.

రాష్ట్రంలో లేదా?

రాష్ట్రంలో సింగ‌రేణి, అదేవిధంగా సింగ‌రేణి ప‌రిధిలో మ‌హాన‌ది కోల్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. వీటి నుంచే ప్ర‌స్తుతంతెలంగాణ‌కు అవ‌స‌ర‌మైన బొగ్గు అందుతోంది. అంతేకాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల‌కు కూడా ఈబొగ్గును విక్ర‌యిస్తున్నారు. అయితే.. ఈ బొగ్గులో నాణ్య‌త త‌గ్గింద‌ని.. ఉత్ప‌త్తి త‌గ్గుతోంద‌ని అధికారులు చెబుతున్నారు. దీంతో విదేశీ బొగ్గు కొనుగోలు దిశ‌గా ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది. అయితే.. ఈ వ్య‌వ‌హారంలోనూ మ‌త‌ల‌బులు ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నాలుగు మాసాల కింద‌ట జెన్‌కో ఇచ్చిన నివేదిక‌లో విదేశీ బొగ్గు భార‌మ‌ని, ఆ బొగ్గులోనూ ఉత్ప‌త్తి త‌క్కువ‌గానే ఉంటుంద‌ని పేర్కొంది.

కానీ, తాజాగా జెన్‌కో మ‌రో నివేదిక ఇచ్చింది. దీనిలో విదేశీ బొగ్గు అత్య‌వ‌స‌ర ప్రాతిప‌దిక‌న కొనుగోలు చేయాల‌ని కోరింది. అంతేకాదు.. ఆస్ట్రేలియా.. ఇండోనేషియా వంటి బొగ్గు ఉత్ప‌త్తిలో ముందున్న దేశాల నుంచి కోల్ కొనాల‌ని సూచించింది. దీనికి ప్ర‌భుత్వం సూత్ర‌ప్రాయంగా అంగీకారం తెలిపింద‌ని అంటున్నారు. అయితే.. బొగ్గు కొనుగోలు వ్య‌వ‌హారం కేంద్రం ఆమోదించాలి. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఇత‌ర విష‌యాల్లో మోకాల‌డ్డుతున్న కేంద్రం .. తెలంగాణ విదేశీ బొగ్గు కొనుగోలు ప్ర‌తిపాద‌న‌కు వెంట‌నే గ్రీన్ ఫ్లాగ్ ఊపింద‌ని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. దీనికి మ‌రో కార‌ణం కూడా ఉంది.

సింగ‌రేణిలో అయితే.. టన్నుకు సుమారు రూ. 3,800 - రూ. 4,200 ఉంటుంది. అదే విదేశాల నుంచి అయితే.. ట‌న్నుకు 9 నుంచి 10 వేల రూపాయ‌ల చొప్పున చెల్లించాలి. పైగా.. అది కూడా ర‌జ‌ను రూపంలో ఇస్తార‌ని.. దానిని ఇక్క‌డ కాంట్రాక్ట‌ర్లు.. శుద్ధి చేసి.. ప్ర‌భుత్వానికి అందించాల‌ని చెబుతున్నారు. ఈమొత్తం వ్య‌వ‌హారంలో చేతులు మారే సొమ్ము ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు. దీంతో రాజ‌కీయంగా బొగ్గు వ్య‌వ‌హారం మంట‌లు రేపుతోంది.