Begin typing your search above and press return to search.

కేసీఆర్ మీదకు గూండాలను పంపిస్తారా !

‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీదకు గూండాలను ఎలా పంపిస్తారు.

By:  Tupaki Political Desk   |   8 Sept 2026 4:04 PM IST
కేసీఆర్ మీదకు గూండాలను పంపిస్తారా !
X

‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీదకు గూండాలను ఎలా పంపిస్తారు. కొందరు రౌడీ ఎమ్మెల్యేలను, 500 మంది గూండాలను పోలీసులు వెంట ఉండి సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తారా. కేసీఆర్ కు ఏమయినా అయినా, వ్యవసాయ క్షేత్రం మీద చిన్న రాయిపడినా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. మా ఇంటికి మేము వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు వెళ్లనివ్వడం లేదు. ముందు కాంగ్రెస్ వాళ్లను ఆపండి. మేము కూడా ఆగుతాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కొందరు ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద దాడికి వెళ్తున్నారని తెలుసుకున్న కేటీఆర్ శాసనసభ నుండి పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులతో కలిసి ఎర్రవల్లికి వెళ్తున్న నేపథ్యంలో బొల్లారం చౌరస్తా వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ ‘పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవాలని, మీ మీద మాకు నమ్మకం లేదు. మా నాయకుడిని మేము కాపాడుకుంటాం’ అని అన్నారు. అయితే పోలీసులు కారును ముందుకు వెళ్లనీయకపోవడంతో నాయకులు అందరూ కారు దిగి కాలినడకన ఎర్రవల్లి వైపు పాదయాత్ర మొదలుపెట్టారు. దీంతో పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో కేటీఆర్, హరీష్ రావులతో పాటు వెంట ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులు రోడ్డు మీదే బైఠాయించారు.

అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి కేటీఆర్ ను బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు, హరీష్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సంధర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ సమావేశాలు జరుగుతుండగా నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎందుకు ఎర్రవల్లిలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వైపు వెళ్తున్నారు ? భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నుండి వారు వెళ్తుంటే పోలీసులు ఎందుకు వారికి సహకరిస్తున్నారు ? మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటన్నారు ? అని ప్రశ్నించారు.

కేటీఆర్, హరీష్ రావులను అరెస్టు చేసిన నేపథ్యంలో బోయిన్ పల్లి, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ల వద్దకు వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అటు ఎర్రవల్లి, ఇటు పోలీస్ స్టేషన్ల వద్ద క్షణక్షణానికి పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.