ఎన్టీఆర్ పై భక్తా లేక భజనా?! కేటీఆర్ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ
తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు ఒక చరిత్ర.
By: Tupaki Political Desk | 1 Oct 2026 6:23 PM ISTతెలుగు రాష్ట్రాల రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు ఒక చరిత్ర. రాజకీయాల్లో ఆయన నమోదు చేసిన రికార్డులు మరెవరికీ సాధ్యం కావనేది పరిశీలకుల అభిప్రాయం. అటువంటి మహా నేత గొప్పతనం కోసం కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ, ఎవరైనా ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు తెస్తే, అందుకు కచ్చితంగా రాజకీయమే కారణం అయివుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆరో గొప్పోడు, మంచోడు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన తాజాగా చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఖైరతాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఎన్టీఆర్ పై కేటీఆర్ పొగడ్తలు చేస్తున్నారా? అంటూ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ గొప్పోడు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనలో తనపై చేసిన విమర్శలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన కేటీఆర్ అందుకు ఆర్మూర్ కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు. ఈ సమయంలో సిరిసిల్లలో తనపై సీఎం చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ తన తండ్రి 43 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, తాను అమెరికాలో చదువుకుని ఆరేళ్లు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో హోటళ్లు పెట్టుకున్నానని వివరించారు. ఈ క్రమంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను గుర్తుచేసుకుని ఆయన చలవతో తన తండ్రి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారని చెప్పారు.
అయితే అవసరం లేకపోయినా కేటీఆర్ ఎన్టీఆర్ ను స్మరించుకోవడంపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ భవన్ లో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా ఆయన ఎన్టీఆర్ ను పొగిడిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. తెలంగాణలో టీడీపీ ఉండకూడదు అన్నట్లు రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనూహ్యంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను స్మరించుకోవడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఖైరతాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సెటిలర్లను ఆకట్టుకోడానికే కేటీఆర్ ఈ ప్రయత్నం చేసినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు కేటీఆర్ మాటలతో తెలంగాణలో మరోసారి ఎన్టీఆర్ ఇమేజ్ పై చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో స్థిరపడిన టీడీపీ సానుభూతిపరులను తమవైపు తిప్పుకోడానికి తెలంగాణలోని ప్రధాన పార్టీలు అన్నీ ఎన్టీఆర్ ను వాడుకుంటున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అందుకే ఎప్పటికప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ పేరును వాడుకుంటుంటారని అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనూ ఎన్టీఆర్ పేరు వాడుకుని రెండు పార్టీలు లబ్ధి పొందాలని చూశాయని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా అమీర్ పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టించి సెటిలర్లను ఆకట్టుకున్నారని అంటున్నారు. అయితే ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఆ చాన్స్ కాంగ్రెస్ కు ఇవ్వకూడదనే ఆలోచనతో కేటీఆర్ ముందుగానే మొదలుపెట్టినట్లు ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
