Begin typing your search above and press return to search.

కేసీఆర్ జగన్‌ థర్డ్ ఫ్రంట్ ....2029 ఢిల్లీ లెక్కలేంటి ?

ఇక కేసీఅర్ అయితే తెలంగాణాలో నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వంతో తలపడుతున్నారు. అలాగే బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని అంటున్నారు.

By:  Satya P   |   24 Oct 2026 8:00 PM IST
కేసీఆర్ జగన్‌ థర్డ్ ఫ్రంట్ ....2029 ఢిల్లీ లెక్కలేంటి ?
X

అందరికీ 2029 ఎన్నికల మీద మనసు పోతోంది. ఇంకా గట్టిగా చూస్తే రెండున్నరేళ్ళ సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అంతా వచ్చే లోక్ సభ ఎన్నికల నుంచి తీవ్ర స్థాయిలో రాజకీయ మధనం చేస్తున్నారు. ఈసారి కేంద్రంలో తమ హవా చూపాలని ఆరాటపడుతున్నారు. నిజానికి చూస్తే జాతీయ స్థాయిలో ఎన్ డీయే, ఇండియా కూటమి బలంగానే ఉన్నాయి. రెండింటిలో చెరి ఇరవై పార్టీలకు తక్కువ కాకుండా మిత్ర పక్షాలు ఉన్నాయి. అవి కాక మిగిలిన పార్టీలు న్యూట్రల్ స్టాండ్ తో ఉంటున్నాయి. ఇపుడు తెలుగు నాట చూస్తే అలా రెండు కనిపిస్తాయి. తెలంగాణాలో బీఆర్ఎస్ ఏపీలో వైసీపీ తటస్థ విధానంతో ముందుకు సాగుతున్నాయి.

కాంగ్రెస్ బీజేపీకి దూరం :

ఇక కేసీఅర్ అయితే తెలంగాణాలో నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వంతో తలపడుతున్నారు. అలాగే బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల గురించి తాజాగా బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీయేతర రాజకీయ ప్రత్యామ్నాయం గురించి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ వ్యూహాన్ని ఇపుడు అంతా తరచి చూస్తున్నారు. దాని మీదనే విశ్లేషిస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలకు సమ దూరం అన్నది బీఆర్ఎస్ కొత్త వ్యూహంగా కేటీఆర్ తాజా వ్యాఖ్యలతో తెలుస్తోంది అని అంటున్నారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో :

అదే సమయంలో మరో చర్చ కూడా సాగుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అక్కడ కీలక పాత్ర పోషించగలరా అనేది ప్రధాన ప్రశ్నగా కూడా ముందుకు వస్తోంది. ఇక బీఆర్ఎస్ గతంలో కూడా జాతీయ మోజుతో ఉన్న చోటనే అధికారం కోల్పోయింది. అందుకే ఇపుడు తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు అక్కడ అధికారం చాలా ముఖ్యం అని అంటున్నారు. అలా గులాబీ పార్టీ పునర్నిర్మాణంతో పాటు క్యాడర్‌లో ఉత్సాహం నింపడం, 2023 లో భారీ ఓటమిని చవి చూసిన కేసీఆర్ రాజకీయ ప్రాధాన్యాన్ని తిరిగి పెంచుకోవడం అన్నది కూడా ఇపుడు ఆ పార్టీకి కీలకంగా ఉంది. అదే సమయంలో 2029 లో చాన్స్ వస్తే జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పాలన్న కోరిక అయితే కేసీఆర్ లో అలాగే ఉంది అని కూడా ప్రచారం సాగుతోంది.

వైసీపీ రూట్ ఎటు :

ఇదిలా ఉంటే ఏపీలో 2024 ఎన్నికలో కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకుని చేదు అనుభవాలు అందుకున్న వైసీపీ చూపు కూడా 2029 ఎన్నికల మీద ఉంది. ఈ మధ్య వైసీపీ అధినేత జగన్ స్టాండ్ కూడా కొంత వేరుగా ఉంటోంది అని అంటున్నారు. బీజేపీకి పూర్తిగా మద్దతు ఇస్తూ వచ్చిన వైసీపీ ఇపుడు బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తోంది. సర్ ప్రక్రియ మీద అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో సవరించిన చట్టం మీద వైసీపీ తన వైఖరిని స్పష్టం చేస్తోంది. దాంతో బీజేపీకి దూరం అవుతున్నట్లుగా వైసీపీ సంకేతాలు ఇస్తున్నప్పటికీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసేందుకు మాత్రం ఎలాంటి సిగ్నల్స్ అయితే ఇవ్వడం లేదని గుర్తు చేస్తున్నారు.

ప్రాంతీయ పార్టీలతో :

ఇక జాతీయ స్థాయిలో చూస్తే ఇదే న్యూట్రల్ స్టాండ్ తో ఉంటూ ఇతర ప్రాంతీయ పార్టీలతో కలసి ముందుకు సాగాలన్నది వైసీపీ కొత్త వ్యూహంగా కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ బీఆర్ఎస్ తో వైసీపీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాగే తమిళనాడులో డీఎంకే కూడా ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ లకు దూరంగా ఉంటోంది. ఆ పార్టీ సైతం థర్డ్ ఫోర్స్ అంటోంది. అలాగే బెంగాల్ లో ఓడినా జాతీయ రాజకీయాల మీద ఆసక్తి ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, యూపీలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇటీవలే సీజేపీకి మద్దతు ప్రకటించిన బిజీ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ వంటి కీలక నేతలు కొత్త కూటమి ప్రతిపాదనను స్వాగతిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.

ఆ రెండూ కాకుండా :

ఈ రోజున చూస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. బీజేపీకి ఎంత తగ్గినా 240 దాకా సీట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ కి ప్రస్తుతం వంద ఎంపీలు ఉన్నారు.ఈ రెండూ కలసి 350 దాకా ఎంపీల బలంతో ఉంటే మిగిలిన పార్టీలు అన్నీ జట్టు కట్టినా కేంద్రంలో అధికారానికి మ్యాజిక్ ఫిగర్ అయిన 273 కి చేరువ కాలేదని నంబర్ గేం చెబుతోంది. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అండ ఉండాల్సిందే అని అంటున్నారు.

ఉనికి కోసమేనా :

అయితే వైసీపీ అయినా బీఆర్ఎస్ అయినా నేల విడిచి సాము చేయలేవని అంటున్నారు. ఏపీలో వైసీపీకి తెలంగాణాలో బీఆర్ఎస్ కి అధికారం కావాలి. జాతీయ రాజకీయ వేదికలను ఉపయోగించుకుని తమ సొంత రాష్ట్రాలలో బలపడాలన్నదే కేసీఅర్ జగన్ ఎత్తుగడ కూడా అయి ఉండొచ్చు అని అంటున్నారు. అదే సమయంలో తాము వేరుగా ఉన్నట్లుగా చూపించుకుంటే 2029 ఎన్నికల నాటికి ఏ కూటమికీ మెజారిటీ రాకపోతే తమ రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుందన్నది కూడా అసలైన వ్యూహంగా కూడా విశ్లేషిస్తున్నారు.