కేటీఆర్... ఇంత మాట అనేశారేంటబ్బా!
రైతులకు కీలక సమయంలో నీరు ఇవ్వకుండా బీఆర్ ఎస్‌పై ఉన్న రాజకీయ కక్షలతో అన్నదాతలను ఏడిపిస్తోందని వ్యాఖ్యానించారు.
By: Garuda Media | 6 July 2026 4:30 PM ISTబీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీళ్లు ఇవ్వడం ప్రస్తుత ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదని, రాజకీయ కారణాలతో దీనిని తొక్కిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి ఈ ప్రాజెక్టును నిర్వహించడం చేతకాకపోతే.. మాజీ సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించాలని.. ఆయన వారం రోజుల్లోనే రైతులకు ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇప్పిస్తారని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే బహుళార్థసాధక ప్రాజెక్టుగా ఉన్న కాళేశ్వరంపై విమర్శలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. రైతులకు కీలక సమయంలో నీరు ఇవ్వకుండా బీఆర్ ఎస్‌పై ఉన్న రాజకీయ కక్షలతో అన్నదాతలను ఏడిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రం కూడా మెచ్చుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కన్నేపల్లి వద్ద నిర్మించిన పంప్ హౌస్‌ను వదిలినా లక్షల ఎకరాలకు నీరు చేరుతుందని చెప్పారు. కానీ, సర్కారు మాత్రం మౌనంగా కూర్చుందన్నారు.
ప్రస్తుతం వందల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని కేటీఆర్ ఆరోపించారు. దీనిని కావాలనే చేస్తున్నారని.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఒక్క చర్య కూడా చేపట్టడం లేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టులు కట్టడం చేతకాదు.. ఉన్నవాటిని నిర్వహించడం కూడా చేతకాదని కేటీఆర్ ఆరోపించారు. ``కేసీఆర్ రంగంలోకి దిగితే పంపులన్నీ ఆన్ చేసి, అన్ని జలాశయాలను నీటితో నింపి, రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్లు అందించి చూపిస్తారు`` అని కేటీఆర్ సవాల్ రువ్వారు.
జలాశయాలను పరిశీలించేందుకు వెళ్తున్న బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ.. ఆయన నిలదీశారు. ఉన్నతాధికారులు చెప్పారని.. పోలీసులు తమను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది సరైన చర్యకాదని ఆయన వ్యాఖ్యానించారు. ``మీకు చేతనైతే అన్నదాతలకు నీళ్లు ఇవ్వడం. లేక పోతే ఆ బాధ్యత మాకు అప్పగించండి.`` అని కేటీఆర్ అన్నారు.
