హాట్ టాపిక్: జన్వాడ ఫాంహౌస్ ఎవరిది?
ఈ ఫామ్ హౌస్ మీద ఇప్పటివరకు ఉన్న వాదనల్ని పరిగణలోకి తీసుకుంటే మొట్టమొదటిది ఈ ఫామ్ హౌస్ ఎవరిది? అన్న ప్రశ్నతో మొదలవుతుంది.
By: Garuda Media | 21 Sept 2026 9:22 AM ISTతెలంగాణ రాజకీయాలో ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. ఓవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ మీద అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయటమేకాదు.. వాటి లెక్కలు తేల్చేందుకు అధికారులకు నెల రోజుల గడువు ఇవ్వటం తెలిసిందే. అదే సమయంలో కేసీఆర్ కుమారుడు కం బీఆర్ఎస్ పార్టీ కీలక నేత కేటీఆర్ ఫామ్ హౌస్ తో పాటు.. గులాబీ నేతలకు చెందిన భూముల మీద పలు ఆరోపణలు చేయటం తెలిసిందే. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్ శివారులోని జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ మీద వివాదం మాత్రం రాజకీయవేడిని మరింత పెంచింది. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫామ్ హౌస్ కు యజమాని ఎవరు? అధికారిక రికార్డుల్లో యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయి? పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ దీన్ని నిర్మించారా? అన్న చర్చతో పాటు.. రాజకీయ రచ్చ అంతకంతకూ పెరుగుతోంది.
ఈ ఫామ్ హౌస్ మీద ఇప్పటివరకు ఉన్న వాదనల్ని పరిగణలోకి తీసుకుంటే మొట్టమొదటిది ఈ ఫామ్ హౌస్ ఎవరిది? అన్న ప్రశ్నతో మొదలవుతుంది. బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ మొదట్నించి వినిపిస్తున్న వాదన ప్రకారం.. ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ దని.. ఇది ఆయన బినామీ ఆస్తిగా చెబుతున్నారు. అంతేకాదు.. దీన్ని నిబంధనలకు విరుద్దంగా నిర్మించినట్లుగా ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ ఫామ్ హౌస్ తనది కాదని.. తన స్నేహితుడు బి. ప్రదీప్ రెడ్డిదని.. 2019 నుంచి తాను లీజుకు తీసుకున్నట్లుగా కేటీఆర్ చెబుతున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఫామ్ హౌస్ కు అసలు యజమానిగా పేర్కొంటున్న ప్రదీప్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. నాలుగు ఎకరాల భూమి తన స్వార్జితమని.. కేటీఆర్ కు తాను కేవలం లీజు ప్రాతిపదికనే ఇచ్చినట్లుగా స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల టీం మాత్రం ఇది ముమ్మాటికి కేటీఆర్ సొంత ఆస్తిగా పేర్కొంటున్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పలువురు జన్వాడ ఫామ్ హౌస్ వద్దకు వెళ్లారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాదనల ప్రకారం ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ సతీమణి శైలిమ, అత్త శశిరేఖ పేర్లతో రెవెన్యఊ రికార్డుల్లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ ఆరోపణలు సరికాదని ప్రదీప్ రెడ్డి లీగల్ అడ్వొకేట్ రాజేశ్వర్ రావు చెబుతున్నారు.
అంతేకాదు.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల టీం ఇలా వ్యక్తుల ఆస్తులపైకి రావటం సరికాదంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రదీప్ రెడ్డి ఆస్తులు కొన్నారని.. చట్టపరంగా అధికారులకు జవాబులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. కేటీఆర్ ప్రదీప్ రెడ్డిలకు ఫాం హౌస్ విషయంలో లీజ్ అగ్రిమెంట్ నడుస్తుందని స్పష్టం చేశారు.
ఫామ్ హౌస్ కు యజమాని ఎవరన్న దానిపై జరుగుతున్న చర్చకు కొనసాగింపుగా కొత్త విషయాలు తెర మీదకు వచ్చాయి. అదేమంటే కాంగ్రెస్ ఎంపీ చామల సరికొత్త వాదన వినిపిస్తున్నారు. ఈడీ జప్తులో ఉన్న భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపిస్తున్నారు. ఆయన వాదన ఏమంటే.. జన్వాడ సర్వే నెంబరు 311, 301, 313లో ఉన్న నాలుగు ఎకరాల భూమే ఉన్నట్లు ప్రదీప్ రెడ్డి చెబుతూ అందరిని తప్పుదారి పట్టిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం 12 ఎకరాల భూములు సత్యం రామలింగరాజు బినామీ శతభిష ఆగ్రో లిమిటెడ్ పేరుతో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇది ఇప్పటికే ఈడీ, ఐటీ శాఖలు అటాచ్ చేసి ఉన్నట్లుగా ఆరోపించారు.
అంతేకాదు 311, 301, 313 సర్వే నెంబర్లలోని ఆస్తులను అక్రమ పద్దతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. డీఎన్ బీ కంపెనీకి చెందిన రాకేశ్ అనే పేరు మీదకు మార్చినట్లుగా పేర్కొన్నారు. ఈ రాకేశ్ మరెవరో కాదని.. రామలింగరాజు కొడుక్కి అత్యంత సన్నిహితుడని చామల చెబుతున్నారు. అనంతరం ఆ భూమలును ప్రదీప్ రెడ్డి..కల్వకుంట్ల బంధువుల కుటుంబాల పేర్లకు మార్చుకున్నట్లుగా వెల్లడిస్తూ.. ఇందులో కేటీఆర్ సతీమణికి 3.20 ఎకరాలు.. ఆమె తల్లి శశిరేఖకు 18 గుంటల స్థలం ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఎంపీ చామల ఆరోపణలు ఇలా ఉంటే.. మరో ఎంపీ మల్లురవి మరో అంశంపై వాదన వినిపిస్తున్నారు.
ఫిరంగి నాలాను అక్రమించుకొని ఫామ్ హౌస్ కట్టుకున్నట్లుగా ఆరోపించారు. అనుమతులు తీసుకోకుండా కట్టడాలను పూర్తి చేయటం చట్టవ్యతిరేకంగా పేర్కొన్నారు. కేటీఆర్ కు లీజుకు ఇచ్చినట్లుగా ప్రదీప్ రెడ్డి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. జులైలో హైడ్రా నోటీసులు ఇస్తే.. ఇప్పటివరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించారు.మొత్తంగా ఫామ్ హౌస్ యాజమాన్య హక్కుల మీదా.. దాని నిర్మాణం మీద చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.
