కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడా?
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అగ్గిరాజేసే పరిణామాలు వేగంగా సాగుతున్నాయి.
By: A.N.Kumar | 29 Dec 2025 3:52 PM IST‘కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? మున్సిపల్ ఎన్నికల వేళ కేటీఆర్ ను అరెస్ట్ చేసి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందా? కేటీఆర్ మాటలు చూస్తుంటే ఏదో జరుగుతున్నట్టే కనిపిస్తోంది. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే మాత్రం అది రాజకీయంగా సంచలనమవుతుంది. ఇప్పటికే అన్ని ఎన్నికల్లో గెలుస్తున్న కాంగ్రెస్ కు కేటీఆర్ అరెస్ట్ తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది ఆసక్తి రేపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అగ్గిరాజేసే పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో చప్పున చల్లారిన మంటలు ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలతో మరోసారి రాజుకున్నాయి. కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారన్న హింట్ కలకలం రేపుతోంది. ఈ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఒకప్పుడు నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా? అని సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి అని చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. మరి కేటీఆర్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు కేవలం ఆత్మరక్షణ కోసమేనా? లేక రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం పన్నిన పక్కా వ్యూహామా అన్న అనుమానాలు విశ్లేషకుల్లో కలుగుతున్నాయి.
తెలంగాణలో పదేళ్లపాటు తిరుగులేని అధికారం చెలాయించిన కేటీఆర్ ప్రస్తుతం విపక్షంలో ఉండి అధికార కాంగ్రెస్ ను, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారు. గుక్క తిప్పుకోకుండా ఇరుకునపెట్టేలా విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తన అరెస్ట్ గురించి ఆయన వరుసగా మాట్లాడుతుండడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషఖులు భావిస్తున్నారు.
అరెస్ట్ గండం.. ఇన్వెస్టిగేషన్ తో సెగ
ముఖ్యంగా కేటీఆర్ అరెస్ట్ కు భయం ఏంటంటే.. ఫార్ములా ఈ రేసు కేసు. ఈ వ్యవహారంలో ఏసీబీ విచారణ ముదురుతుండడం.. మాజీ అధికారుల వాంగ్మూలాలు కేటీఆర్ కు ఇబ్బందికరంగా మారాయనే ప్రచారం సాగుతోంది.ఈ క్రమంలోనే ఒకవేళ అరెస్ట్ జరిగితే అది ‘రాజకీయ కక్ష సాధింపు అని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం భయం మాత్రమే కాదు.. రాబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధం చేసుకుంటున్న సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ కేటీఆర్ మాటలు వైరల్
తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జీహెచ్ఎంసీతో సహా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జరుగునున్నాయి. హైదరాబాద్‌పై పట్టు సడలితే పార్టీ మనుగడ కష్టమని కేటీఆర్‌కు తెలుసు. ఈ క్రమంలోనే ‘‘ఈ ఎన్నికల ముందు తనను లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని.. నేను లోపల ఉన్నా, పార్టీ చూసుకుంటుంది. నేను బెదిరింపులకు భయపడను’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. అందుకే అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విలన్ గా చిత్రీకరించడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కేటీఆర్ ముందే ప్రిపేర్ చేస్తున్నాడని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పార్టీని సిద్ధం చేయడానికి.. నేతలను ఆపడానికి, కేడర్‌లో భరోసా నింపడానికి "నేను జైలుకు వెళ్లడానికైనా సిద్ధం.. మీరు సిద్ధమా?" అనే సంకేతాలను కేటీఆర్ పంపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి బీఆర్ఎస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ సేఫ్ జోన్ అనుకున్న చోటే ఓడిపోవడంతో కేటీఆర్ తన రూట్ మార్చారు. దూకుడు తగ్గించకుండానే జనంలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. కేసీఆర్ ను అందుకే యాక్టివ్ చేసినట్టు తెలుస్తోంది. అరెస్ట్‌ను ఒక రాజకీయ అవకాశంగా మార్చుకోవడం.. చట్టపరమైన చర్యలు జరిగితే అది ప్రభుత్వం చేస్తున్న అన్యాయమని కోర్టుల్లోనూ.. ప్రజల్లోనూ వాదించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ కేటీఆర్ అరెస్ట్ ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందా లేదా అధికార పార్టీకి అనుకూలంగా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కేటీఆర్ అరెస్ట్ వ్యవహారం చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు ఎటువైపు పడతాయో.. కేటీఆర్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కుంటారో చూడాలి.
