Begin typing your search above and press return to search.

కేటీఆర్, హరీష్ రావులపై లైంగిక వేధింపుల కేసు !

ఈ నెల 7న శాసనసభ ప్రారంభోత్సవాల సంధర్భంగా నల్ల టీ షర్టులతో వచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిదులను పోలీసులు అడ్డుకున్నారు.

By:  Garuda Media   |   10 Sept 2026 2:33 PM IST
కేటీఆర్, హరీష్ రావులపై లైంగిక వేధింపుల కేసు !
X

తెలంగాణ రాజకీయాలు గత మూడు రోజులుగా వేడెక్కాయి. శాసనసభ ప్రారంభోత్సవాల సంధర్భంగా మొదలైన రగడ నాలుగు రోజులుగా రగులుతూనే ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేతలు కేటీఆర్, హరీష్ రావులతో పాటు ఎమ్మెల్యీ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిల మీద లైంగిక వేదింపుల కేసు నమోదు చేయడంతో కీలక మలుపు తిరిగింది.

ఈ నెల 7న శాసనసభ ప్రారంభోత్సవాల సంధర్భంగా నల్ల టీ షర్టులతో వచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిదులను పోలీసులు అడ్డుకున్నారు. టీ షర్టులతో సభలోపలికి అనుమతించమంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంధర్భంగా జరిగిన తోపులాట అనంతరం హరీష్ రావు, సుధీర్ రెడ్డిలు టీ షర్టులు విప్పేసి, ఇప్పుడు షర్టులు లేవు కాబట్టి సభకు అనుమతించాలని పోలీసులను డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ‘శాసనసభ ప్రారంభోత్సవాల సంధర్భంగా అడ్డుకున్న తమను కేటీఆర్, హరీష్ రావు, సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డిలు దూషించారని, తమ ముందే టీ షర్టు విప్పేసి అర్ధనగ్నంగా నిలబడి ఇబ్బంది కలిగించారని ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. ఈ మేరకు వీడియోలు, ఫోటోలను ఆధారాలుగా జత చేశారు. ఈ మేరకు సైఫాబాద్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352 మరియు 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

శాసనసభకు హాజరుకావడం శాసనసభ్యుల హక్కు. సభ బయట ప్రజాప్రతినిధులను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదు. సభ లోపల సభా సాంప్రదాయాలకు విరుద్దంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకునే అవకాశం స్పీకర్ కు ఉంటుంది. సభలోకి వెళ్లకుండా పోలీసులు ఆపొద్దని హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

అయితే మహిళా పోలీసుల అభియోగాలు తీవ్రంగా ఉంటే కోర్టు కూడా తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. అయితే టీ షర్టు విప్పడాన్ని లైంగిక వేధింపులుగా పరిగణించే అవకాశం లేదని అంటున్నారు. అంతిమంగా ఈ కేసును వీడియోలు, సాక్ష్యాలు, కోర్టు విచారణ నిర్ణయిస్తాయి. రాజకీయ పరమైన కేసు కాబట్టి ఎటు వైపు దారితీస్తుంది అన్నది అంచనా వేయడం కష్టం. మొత్తానికి శాసనసభ సమావేశాల సంధర్భంగా జరిగిన ఘటనలు ఏకంగా లైంగిక వేధింపుల కేసు వరకు వెళ్లడం గమనార్హం.