Begin typing your search above and press return to search.

ఆ యూస్ లెస్ ఫ్రెండ్ వల్లే నా చదువు సంకనాకింది.. కేటీఆర్ ఫన్నీ కామెంట్స్

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చురుకైన నాయకుడిగా.. వాక్చాతుర్యం కలిగిన నేతగా కేటీఆర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

By:  A.N.Kumar   |   30 April 2026 1:00 PM IST
ఆ యూస్ లెస్ ఫ్రెండ్ వల్లే నా చదువు సంకనాకింది.. కేటీఆర్ ఫన్నీ కామెంట్స్
X

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చురుకైన నాయకుడిగా.. వాక్చాతుర్యం కలిగిన నేతగా కేటీఆర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాధారణంగా అసెంబ్లీలో అధికార పక్షంపై విమర్శలు సంధించడమో లేదా అభివృద్ధి పనులపై సీరియస్‌గా చర్చించడమో చేసే కేటీఆర్.. తాజాగా తనలోని 'కామెడీ యాంగిల్'ను బయటపెట్టారు. తన కాలేజీ రోజుల్లో జరిగిన ఒక ఆసక్తికరమైన, హాస్యాస్పదమైన సంఘటనను ఓ కాలేజీ ఫంక్షన్ లో పంచుకోవడంతో ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

స్నేహితుడి మాట నమ్మి.. హైదరాబాద్ వదిలి గుంటూరుకు!

ఈ కథ అంతా కేటీఆర్ ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదివే కాలంలో మొదలైంది. అప్పట్లో ఆయన హైదరాబాద్‌లోని ఒక మంచి కాలేజీలో సెటిల్ అయిపోయారు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు ఆయన స్నేహితుడు కళ్యాణ్. "హైదరాబాద్‌లో ఏం ఉందిరా.. గుంటూరు వెళ్దాం పదా, అక్కడ చదువు కంటే ఎంజాయ్‌మెంట్ అదిరిపోతుంది" అని కళ్యాణ్ ఇచ్చిన ఉచిత సలహాతో కేటీఆర్ మైండ్ మారిపోయింది.

తన తండ్రి, అప్పటి ఉద్యమ నేత కేసీఆర్‌ను ఎలాగోలా ఒప్పించి, హైదరాబాద్ సుఖాలను వదిలి గుంటూరుకు పయనమయ్యారు. "నా ఫ్రెండ్ చెప్పిన మాటలు విని, గుంటూరులో ఏదో స్వర్గం ఉంటుందని ఊహించుకుని వెళ్లాను" అని కేటీఆర్ నవ్వుతూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

"ఆఫ్ట్రాల్ గుంటూరు ఏంటి?" అన్న ధీమా.. చివరకు షాక్!

గుంటూరు వెళ్లేటప్పుడు కేటీఆర్ దగ్గర బోలెడంత ఆత్మవిశ్వాసం ఉండేదట. "నాకు హిందీ బాగా వచ్చు, నేను హైదరాబాద్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను, నా లెవల్ వేరు.. ఈ గుంటూరు కాలేజీ ఎంట్రన్స్ టెస్ట్ ఒక లెక్కా?" అన్న ధీమాతో ఏమాత్రం ప్రిపేర్ అవ్వకుండా పరీక్షా హాల్లో కూర్చున్నారు.

తీరా ఫలితాలు వచ్చాక చూస్తే.. పరిస్థితి తలకిందులైంది. ఆ ఎంట్రన్స్ టెస్టులో కేటీఆర్‌కు వచ్చింది కేవలం నాలుగు మార్కులు మాత్రమే! ఆ తక్కువ మార్కులు చూసి ఆయనకు నోట మాట రాలేదట. ఆ సమయంలో తన అహం దెబ్బతినడమే కాకుండా ఫలితంపై ఏదో అనబోతే గట్టిగానే చెంపదెబ్బ కూడా దక్కిందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. దెబ్బకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయని తెలిపారు.

వైరల్ అవుతున్న "సంకా నాకింది" కామెంట్

ఈ వైఫల్యానికి కారణం తన స్నేహితుడు కళ్యాణ్ అని కేటీఆర్ భావించారు. ఆ కోపంలో ఆయన తన ఫ్రెండ్ ను బండ బూతులు తిట్టాడట.. ఈ మాటలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా నవ్విస్తున్నాయి. "నా చదువు సంక నాకింది కేవలం ఈ కళ్యాణ్ వల్లే!" అంటూ ఆయన అప్పట్లో తన ఫ్రెండ్‌ను తిట్టుకున్న విధానాన్ని ఇప్పుడు బహిరంగంగా చెప్పడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఒకప్పుడు సీరియస్ స్టూడెంట్‌గా, ఇప్పుడు పవర్‌ఫుల్ లీడర్‌గా ఉన్న కేటీఆర్ నోటి నుండి ఇలాంటి పక్కా లోకల్ స్లాంగ్ వినబడేసరికి నెటిజన్లు ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

ఈ కథలో దాగిన సందేశం

కేటీఆర్ ఈ విషయాన్ని సరదాగా చెప్పినప్పటికీ ఇందులో విద్యార్థులకు ఒక ముఖ్యమైన సందేశం ఉంది. స్నేహితుల మాటలు వినడం మంచిదే కానీ, కెరీర్ విషయంలో గుడ్డిగా వారిని అనుసరించకూడదు. మన బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఒక పరీక్షను లేదా పోటీని ఎదుర్కొనేటప్పుడు సరైన సిద్ధత లేకపోతే పరాభవం తప్పదు. కాలేజీలో నాలుగు మార్కులు తెచ్చుకున్న విద్యార్థి కూడా పట్టుదలతో కృషి చేస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతారని కేటీఆర్ ప్రయాణం చెబుతోంది.

రాజకీయాల్లో ఎప్పుడూ ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతి విమర్శలతో బిజీగా ఉండే నేతలు ఇలా తమ వ్యక్తిగత జీవితంలోని 'ఫెయిల్యూర్స్'ను హాస్యంతో కలిపి చెప్పడం వల్ల సామాన్య ప్రజలకు వారు మరింత దగ్గరవుతున్నారు. మొత్తానికి కేటీఆర్ "గుంటూరు గోల" ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌లో ఉంది!